Yamaha Scooters: స్కూటర్ అంటే మనకు గుర్తొచ్చేవి రెండు చక్రాల వాహనాలే. కానీ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా దీన్ని మార్చనుంది. మూడు చక్రాల స్కూటర్‌ను యమహా గతంలోనే లాంచ్ చేసింది. ఇప్పుడు దీన్ని మళ్లీ మార్కెట్లోకి తీసుకురానుంది. దీంతో వారు ప్రజల దృష్టిని ఆకర్షించనున్నారు. సాధారణంగా మూడు చక్రాలు అంటే మనకు ఆటోనే గుర్తొస్తుంది. కానీ యమహా కొత్త స్కూటర్ విభిన్న డిజైన్‌తో ఆకట్టుకోనుంది.


2014లో మొదట లాంచ్
యమహా తన మూడు చక్రాల ట్రైసిటీ స్కూటర్‌లను 2014లోనే జపాన్‌లో విడుదల చేసింది. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి.  అవే ట్రైసిటీ 125, ట్రైసిటీ 155. ట్రైసిటీ స్కూటర్‌లకు సాధారణంగా వెనుకవైపు రెండు చక్రాలు ఉంటాయి. అయితే యమహా స్కూటర్‌ల డిజైన్‌లో ముందువైపు రెండు చక్రాలు, వెనుకవైపు ఒక చక్రం ఉంటుంది. ఈ యమహా స్కూటర్లు ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.


డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ స్కూటర్లకు స్పోర్టీ లుక్ ఇస్తూనే, సింపుల్ గా ఉంచేందుకు వీలైనంత ప్రయత్నం చేశారు. దీనిలో పూర్తిగా ఎల్ఈడీ సెట్ అప్ అందించారు. ఎల్ఈడీ సెట్ అప్ అంటే ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్సీడీ సెంటర్ కన్సోల్ అందించారన్న మాట.


ఇది కాకుండా వెనుక సీటుకు సహాయపడే విధంగా ఒకే సీటుతో కూడిన ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రైల్ అందించారు. అదే సమయంలో ట్రైసిటీ స్కూటర్లలో ముందు వైపున 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. అలాగే వెనుక భాగంలో 13 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ వీల్‌కు ఈజీ టిల్ట్ అందించారు. దీని వల్ల దాన్ని టర్నింగ్ తిప్పడంలో ఎటువంటి సమస్య లేదు. కార్నర్స్‌లో కూడా సులభంగా తిప్పవచ్చు. ట్రైసిటీ స్కూటర్‌లో కీలెస్ ఎంట్రీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉన్నాయి.


ధర ఎంత?
ట్రైసిటీ స్కూటర్ల ధర గురించి చెప్పాలంటే జపాన్‌లో ట్రైసిటీ 125 ప్రారంభ ధర 4,95,000 యెన్‌లుగా ఉంది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ. 3.10 లక్షలు అన్నమాట. ఇక ట్రైసిటీ 155 ధర 5,56,500 యెన్‌లుగా నిర్ణయించారు. అంటే దాదాపు రూ. 3.54 లక్షలు అన్నమాట. ప్రస్తుతానికి జపాన్‌లో లాంచ్ అయిన ఈ స్కూటర్‌లను భారతదేశంలో అందుబాటులోకి తీసుకురావడం గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ అక్కడ సక్సెస్ అయితే కొన్ని యూనిట్లతో మనదేశంలో కూడా ట్రయల్ చేసే అవకాశం ఉంది. డిజైన్ వినూత్నంగా ఉంది కాబట్టి మన దేశంలో యువతను ఆకర్షించే అవకాశం ఉంది.