Shiv Sena Symbol:


అత్యవసర సమావేశం..


శివసేన పార్టీకి చెందిన పేరుని, పార్టీ గుర్తుని ఏక్‌నాథ్ శిందేకి కేటాయిస్తూ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. దీనిపై తీవ్ర అసహనానికి గురవుతోంది థాక్రే సేన. శిందేపై చాన్నాళ్లుగా పోరాటం చేస్తున్న థాక్రేకు పెద్ద దెబ్బే. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు ABP News సోర్సెస్‌ ద్వారా తెలిసింది. థాక్రే సేనలోని అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికీ ఈ మీటింగ్‌కు రెడీ అయిపోయారు. పార్టీ కార్యాలయమైన మాతోశ్రీలో వీరంతా సమావేశం కానున్నారు. ఏక్‌నాథ్ శిందే వర్గానికే శివసేన పార్టీ పేరు, ధనుస్సు గుర్తు చెందుతాయని ఈసీ స్పష్టం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో చర్చించేందుకే ఎమర్జెన్సీ మీటింగే పెట్టినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ వివాదం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం ఏమీ తేల్చక ముందే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం ఎలా తీసుకుందని వాదిస్తోంది థాక్రే సేన. ఈ విషయంలో ఈసీకి ఎందుకంత తొందర అంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇప్పటికే థాక్రే వెల్లడించారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా మరోసారి సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలపైనా బీజేపీ ఒత్తిడి చేస్తోందని మండి పడ్డారు. 


"ఇది మేం ఊహించలేదు. సుప్రీంకోర్టులో ఈ వివాదం ఆర్నెల్లుగా నడుస్తోంది. ఈ విచారణ కొనసాగుతుంది కూడా. కానీ ఇంతలోనే ఎన్నికల సంఘం ఇలాంటి ప్రకటన చేసింది. సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇవ్వకుండా అలా ఎలా చేసింది..? ప్రజాస్వామ్యానికి ఇది చాలా ప్రమాదకరం" 


-ఉద్దవ్ థాక్రే 


సర్వేలో ఇలా..


ఇటీవలే Mood Of the Nation పేరిట C Voter,India Today ఓ సర్వే చేపడుతోంది. లక్షా 39 వేల మంది నుంచి అభిప్రాయాలు స్వీకరించి వాటి ఆధారంగా రాష్ట్రాల వారీగా అంచనాలు వెలువరిస్తోంది. ఈ సర్వేలో థాక్రే సేనకు కాస్త ఊరట కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. గత ఎన్నికలతో పోల్చి చూస్తే...ఈ సారి UPAకి ఆరు రెట్లు ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి గత లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. శివసేన చీలిపోకుండా థాక్రే కాస్తో కూస్తో అడ్డుకోగలిగారు. బీజేపీ నేతృత్వంలోని NDAతో కలిసి పోటీ చేశారు. గత ఎన్నికల్లో NDAకి 41 సీట్లు వచ్చాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మిత్రపక్షమైన శివసేనకు 18 సీట్లు వచ్చాయి. అయితే...అసెంబ్లీ ఎన్నికల తరవాత NDAతో తెగదెంపులు చేసుకుంది శివసేన. NCPతో కలిసి మహా వికాస్ అగాడిని ఏర్పాటు చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో కథ అంతా మారిపోయింది. ఆ తరవాత రాజకీయాలు మారిపోయాయి. ప్రభుత్వమూ మారిపోయింది. అప్పటి నుంచి తనదే అసలైన శివసేన అంటూ శిందే పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీ గుర్తు కోసమూ బాగానే ప్రయత్నించారు. చివరకు ఆయనకు అనుకూలంగానే ఎన్నికల సంఘం తీర్పునిచ్చింది. ఇప్పుడు థాక్రే సేన మరోసారి కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే యూపీఏకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని సర్వేలో తేలింది. 


Also Read: BBC Income Tax Survey: బీబీసీపై ఐటీ శాఖ దాడులు, కీలక ఆధారాలు లభ్యం: సీబీడీటీ ప్రకటన