బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఐటీ 'సర్వే'కి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కొన్ని పన్ను చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు తమ సర్వేలో తేలినట్లు ప్రాథమికంగా తెలిపింది. పలు గ్రూప్ సంస్థల ద్వారా ఆర్జించిన ఆదాయం, లాభాలు భారతదేశంలోని కార్యకలాపాల అనుగుణంగా లేవని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఆఫీసులపై ఐటీ సర్వే మంగళవారం ఉదయం ప్రారంభమై గురువారం రాత్రి దాదాపు 59 గంటల తర్వాత ముగిసింది.


బీబీసీ సంస్థకు ఆదాయం, గ్రూప్ లోని పలు సంస్థల ద్వారా ఆర్జించిన లాభాలు భారతదేశంలో కార్యకలాపాల తీరుకు అనుగుణంగా లేవు అని.. బదిలీ ధర డాక్యుమెంటేషన్‌కు సంబంధించి అనేక వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తిచినట్లు సీబీడీటీ ఓ ప్రకటన లో తెలిపింది. "బదిలీ అయిన నగదు, డాక్యుమెంటేషన్‌ పరిశీలించగా.. ఐటీ సర్వేలో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఉద్యోగుల నుంచి తీసుకున్న వాంగ్మూలాలు, డిజిటల్ సాక్ష్యాలు, పత్రాలు లాంటి ముఖ్యమైన సాక్ష్యాలను ఐటీ బృందాలు సేకరించినట్లు CBDT తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 (చట్టం)లోని సెక్షన్ 133A కింద సర్వే కింద బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాలలో ఐటీ సర్వే నిర్వహించినట్లు ప్రకటనలో ప్రకటన పేర్కొంది. ఈ విషయాన్ని జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.






తప్పు చేస్తే చర్యలు..


ఢిల్లీ, ముంబయిల్లోని BBC కార్యాలయాల్లో జరుగుతున్న సోదాలపై యూకే ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ స్పందించారు. ABP Liveలో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. BBCలో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే...భారత్‌లోని సంస్థలకు సోదాలు నిర్వహించే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో యూకే ప్రభుత్వం జోక్యం చేసుకోదని వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో BBC డాక్యుమెంటరీ గురించి కూడా ప్రస్తావించారు. ఈ డాక్యుమెంటరీని వెలుగులోకి తెచ్చినందుకే IT సోదాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై స్పందించారు. ఆ అంశానికి, ఇప్పటి సోదాలకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. ఒక వేళ మీ వ్యక్తిగత ఆదాయం గురించి అడిగితే సమాధానం చెప్పవద్దని, జాబ్ శాలరీకి సంబంధించిన ప్రశ్నలు అడిగితే మాత్రం వివరాలు సమర్పించాలని BBC యాజమాన్యం ఐటీ సర్వే సమయంలో ఉద్యోగులకు సూచించింది.


"నాకు తెలిసి వీటికి ఎలాంటి సంబంధమూ లేదు. నిజంగానే ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే భారత్‌లోని సంస్థలకు విచారించే హక్కు తప్పకుండా ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అని సర్వే చేస్తున్నారు. ఒకవేళ ఇవి సరిగా లేకపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటారు. బీబీసీ డాక్యుమెంటరీకి, సోదాలకు సంబంధం ఉందనడానికి ప్రస్తుతం ఆధారాలు ఏమీ లేవు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాను" 


-బాబ్ బ్లాక్‌మన్, యూకే ఎంపీ