Shinde Sivasena : శివసేన పార్టీ ఇక నుంచి బాల్ థాక్రే కుటుంబసభ్యులది కాదు. ఆయన పార్టీ నుంచి చీలిపోయిన ఏక్ నాథ్ షిండేదేనని ఎన్నికల సంఘం తేల్చింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఉద్దవ్ థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు పార్టీ కూడా దక్కకుండా పోయింది. పార్టీ చీలిక వర్గమైన ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గానికే శివసేన పార్టీ పేరు, ఆ పార్టీకి చెందిన బాణం గుర్తు దక్కుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉద్దవ్ థాక్రే కేబినెట్‌లో మంత్రిగా ఉన్న షిండే తిరుగుబాటు చేయడంతో అప్పటివరకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. శివసేనకు ఉన్న యాభై ఆయనకు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సీఎంగా షిండే బాధ్యతలను చేపట్టారు. అనూహ్యంగా డిప్యూటీ సీఎం పదవీని దేవేంద్ర ఫడ్నవీస్‌కు అప్పగించారు. మొత్తం 19 మంది ఎంపీల్లో 12 మంది షిండే వైపున్నారు.
ఆ తర్వాత శివసేన ఎవరిదన్న వివాదం ఏర్పడటంతో శివసేన పార్టీ పేరు, గుర్తు రెండూ ఈసీ స్తంభింప చేసింది. శివసేన పార్టీ చీలిక వర్గాల(ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే)కు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పార్టీ పేర్లు కేటాయించింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి 'కాగడా' గుర్తును కేటాయించింది. 'శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పేరును థాక్రే వర్గానికి కేటాయించింది. 'బాలాసాహెబంచి శివసేన' అన్న పేరును మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించింది ఈసీ. ఈ నిర్ణయంపైనా గతంలో శివసేన న్యాయపోరాటం చేసింది.
శివసేన పేరు, గుర్తును స్తంభింపజేయడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ గుర్తు, పేరును నిలిపివేస్తూ ఈసీ అక్టోబర్ 8న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. పార్టీల వాదనలు వినకుండానే చట్టవిరుద్ధంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ఉద్ధవ్ థాక్రే వర్గం వాదించింది. ఈ పిటిషన్లో ఎన్నికల సంఘం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేలను ప్రతివాదులుగా చేర్చింది. అయితే తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చేసిన వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి ధర్మాసనం అనుమతినిచ్చింది. ఠాక్రే, షిండే వర్గాల్లో అసలైన శివసేన ఎవరిదనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
ఆ తర్వాత జరిగిన మహారాష్ట్రలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్ర ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన విజయం సాధించింది. శివసేన అభ్యర్థి రుతుజ లాక్టే 77 శాతానికి పైగా ఓట్లు రాబట్టి ఘన విజయం సాధించారు. అయితే అప్పట్లో పార్టీ పేరు, గుర్తు రెండు శివసేనవి కావు. కాగడా గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు పూర్తిగా పార్టీ పేరు, గుర్తు ఉద్దవ్ థాక్రే వర్గానికి వెళ్లాయి.