E20 Fuel Car Compatibility Warranty Guide: ఇప్పుడు పెట్రోల్‌ బంక్‌కి వెళ్తే ఎక్కువగా E20 పెట్రోల్‌ దొరుకుతోంది. చాలా మంది తమకు తెలీకుండానే ఈ పెట్రోల్‌ను కారులో పోయించుకుంటున్నారు. E20 ఇంధనం లేదా E20 పెట్రోల్‌ అంటే... పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్‌ కలిపిన మిశ్రమం. ప్రభుత్వం గ్రీన్‌ ఫ్యూయల్‌ను ప్రోత్సహించడానికి ఇది తీసుకొచ్చింది. ఈ ఇంధనం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి, పర్యావరణానికి ఇబ్బంది తగ్గుతుంది. కానీ, కారు యజమానుల మదిలో మాత్రం ఒకే సందేహం ఉంది - “ఇది నా వాహనానికి హానికరమా?” అని.

E20 పెట్రోల్‌ ఏ వాహనాలకు సేఫ్‌?2012 నుంచి 2023 వరకు తయారైన చాలా కార్లు E10 ఫ్యూయల్‌కి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అంటే పెట్రోల్‌లో 10 శాతం ఎథనాల్‌ మిశ్రమానికి కంపాటబుల్‌గా ఉంటాయి, బాగానే పని చేస్తాయి. 2023 ఏప్రిల్‌ 1 తర్వాత రిజిస్టర్‌ అయిన కొత్త వాహనాలను తప్పనిసరిగా E20 కి అనుకూలంగా డిజైన్‌ చేశారు. అయినా కూడా అన్ని బ్రాండ్లు & మోడళ్లను ఒకేసారి మార్చలేదు, విడతలవారీగా E20 కంపాటబుల్‌గా తీసుకొచ్చారు. మీ కారు E20 అనుకూలమా, కాదా అన్నది మీ కారు మాన్యువల్‌లో ఉంటుంది, చెక్‌ చేసుకోవచ్చు.

E20 ఫ్యూయల్‌ పోయిస్తే కారు మైలేజ్‌ తగ్గుతుందా?సోషల్‌ మీడియాలో చాలామంది వాహనదారులు 15-20% మైలేజ్‌ తగ్గింది అంటున్నారు. కానీ ARAI (Automotive Research Association of India) అధికారిక టెస్టుల్లో మాత్రం కేవలం 1-6% తగ్గుదల మాత్రమే రికార్డు చేశారు. అంటే, మైలేజ్‌లో తగ్గుదల ఖచ్చితంగా ఉంటుంది, అది కూడా స్వల్పంగా ఉంటుంది, వాహనాన్ని బట్టి ఇది మారుతుంది.

E20 ఇంధనం వల్ల కొన్ని చిన్నపాటి రిస్కులు ఉన్నాయి

రబ్బరు, ప్లాస్టిక్‌ భాగాలు దెబ్బతినే అవకాశం: ఫ్యూయల్‌ లైన్స్‌, హోసులు, గ్యాస్కెట్లు E20 ని ఎక్కువ కాలం తట్టుకోలేక పగిలిపోవచ్చు.

లోహ భాగాలు తప్పుపట్టడం: ఎథనాల్‌ తేమని ఎక్కువగా ఆకర్షిస్తుంది. దీని వల్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ లాంటి లోహ భాగాల్లో తుప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ఫ్యూయల్‌ సిస్టమ్‌ క్లోగ్‌ అవ్వడం: ఎథనాల్‌ అనేది ఒక ద్రావకం ‍(solvent). ఇది ట్యాంక్‌లో ఉన్న పాత మలినాలను కరిగిస్తుంది. ఫలితంగా అవి ఫ్యూయల్‌ ఫిల్టర్‌, ఇంజెక్టర్లలో ఇరుక్కుపోతాయి. దీనివల్ల వాహనం స్టార్ట్‌ కావడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు లేదా పనితీరు తగ్గవచ్చు.

E20 ఇంధనం వాడితే వారంటీ సమస్యలు వస్తాయా?మీ కారు మాన్యువల్‌లో E10 వరకు మాత్రమే అనుకూలం అని ఉంటే, మీరు E20 వాడితే వారంటీ రద్దు అయ్యే అవకాశం ఉంది. కారు కంపెనీలు ఈ బాధ్యతను తీసుకోవడం లేదు. అయితే, ఇది వాహన యజమానుల తప్పు కాదని కొన్ని కంపెనీలు సాఫ్ట్‌గా చూసే అవకాశమూ ఉంది.

వాహనాన్ని ఐడియల్‌గా ఉంచొద్దుమీ కారును ఎక్కువ కాలం వాడకుండా అలాగే ఉండకండి, తరచూ వినియోగిస్తూ ఉండాలి. E20 ఫ్యూయల్‌ని ట్యాంక్‌లో నింపిన తర్వాత వాహనం కొన్ని వారాలు లేదా నెలలు వాడకుండా నిలిపేస్తే సమస్యలు వస్తాయి. ఫ్యూయల్‌ లోపల నీటి పొర వేరుపడి ఇంజిన్‌కి నష్టం కలిగించవచ్చు.

కొత్త కార్లు, బైక్‌లు (2023 తర్వాతి మోడల్స్‌) - E20 ఫ్యూయల్‌ వినియోగానికి సేఫ్‌

పాత వాహనాలు (2012-2022 మధ్య మోడల్స్‌) - E20 వాడొచ్చు కానీ మైలేజ్‌ డ్రాప్‌, మెయింటెనెన్స్‌ ఖర్చులు పెరిగే ఛాన్స్‌ ఉంటుంది.

వాహనం మాన్యువల్‌ చెక్‌ చేయడం తప్పనిసరి.

మొత్తంగా, E20 అనేది పెట్రోల్‌లో వచ్చిన కొత్త ఛాప్టర్‌. ఇది పర్యావరణానికి మంచిదే కానీ, మన వాహనాలను మాత్రం కాస్త కేర్‌ఫుల్‌గా వాడుకోవాలి.