Asia Cup 2025  Ind vs Pak :దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఈ విజయం పై  టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్ సంతృప్తిని వ్యక్తం చేశాడు.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులు, కుటుంబాలకు ఆయన నివాళులర్పించారు. భారత సాయుధ దళాలకు సంఘీభావం తెలిపారు. పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని  భారత్ ఆర్మీ ధైర్యసాహసాలకు అంకితం చేశారు. జట్టు ప్రదర్శన వారికి గర్వకారణంగా ఉంటుందని ఆకాంక్షించారు. 

"ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సరైన సందర్భం, సమయాన్ని వెచ్చించి, పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము.

"మేము మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించిన మా సాయుధ దళాలన్నింటికీ ఈ విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నాము. "వారు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను. వారి ఆనందం కోసం మాకు అవకాశం దొరికినప్పుడల్లా మైదానంలో అలరిస్తూనే ఉంటాం" అని భారత కెప్టెన్ సూర్యకుమార్ కామెంట్స్ చేశాడు.

సూర్యకుమార్ విజయాన్ని ప్రతిబింబిస్తూ, ఈ గెలుపు దేశానికి " సంపూర్ణమైన రిటర్న్ గిఫ్ట్"గా అభివర్ణించాడు.

పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించిన భారత కెప్టెన్ జట్టును అద్భుతంగా నడిపించాడు. సూర్యకుమార్ 37 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేసి, ఏడు వికెట్లు చేతిలో ఉండగా కేవలం 15.5 ఓవర్లలో 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌లో స్ఫూర్తిని నింపాడు.

ప్రత్యర్థి ఎవరనేది సంబంధం లేకుండా, జట్టు కోసం ప్రతి మ్యాచ్‌ను గెలిచేలా సిద్ధంగా ఉండటం, ఫోకస్డ్‌గా స్థిరంగా ఉండటమే తమ ప్రాముఖ్యత అని భారత కెప్టెన్ నొక్కి చెప్పాడు.

స్పిన్నర్ల పాత్రను హైలైట్ చేస్తూ, మిడిల్ ఓవర్లలో వారి చేసే పని ఆటకు టోన్‌ను మార్చేస్తుందని అన్నాడు. కుల్దీప్ యాదవ్ గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఉండటం వల్లే అద్భుతం చేయగలిగాడని ప్రశంసించాడు. 

భారత స్పిన్ త్రయం - కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పెల్‌తో  పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను ఛేదించారు. వారిని 20 ఓవర్లలో 127/9కి పరిమిత చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు.బౌండరీలు, సిక్సరలుతో విరుచుకుపడ్డాడు. ఓ దశలో టాప్-ఆర్డర్ వికెట్లు పడిపోయిన తర్వాత కూడా, సూర్యకుమార్ యాదవ్  తిలక్ వర్మ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను సులభంగా విజయం దిశగా నడిపించారు. ఈ విజయం మైదానంలో విజయం కంటే ఎక్కువ. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చిన ఈ విజయం మెన్ ఇన్ బ్లూకు మరింత స్పెషల్ గా చెప్పవచ్చు.  

భారత్‌పై భారీ స్కోరు నమోదు చేయాలనే టార్గెట్‌తో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వారి టాప్ ఆర్డర్ తడబడింది, మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు పడిపోయాయి. భారత్‌ బౌలింగ్ యూనిట్ మరోసారి ఆధిపత్యం చెలాయించింది. వికెట్లు తీస్తూ, డాట్‌ బాల్స్‌ వేస్తూ పాకిస్తాన్‌ను ఎక్కువ టైం సైలెంట్‌గానే ఉంచింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎక్కువ పరుగులు ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీసుకున్నారు.

సైమ్ అయూబ్ చేతిలో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ భారత్‌ తన లక్ష్యాన్ని ఈజీగానే ఛేదించింది. తొలి బంతి నుంచే  పాకిస్తాన్‌ బౌలర్లపై భారత్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తానికి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో పాకిస్తాన్‌పై భారత్ పై చేయిసాధించింది.