Asia Cup 2025 Ind VS Pak Latest Updates : భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లను తీసిన నాలుగో భారత బౌలర్ గా తాజాగా రికార్డులకెక్కాడు. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా రెండు వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. మహ్మద్ హరీస్, సోఫియాన్ ముఖీమ్ లను ఔట్ చేశాడు. దీంతో పొట్టి ఫార్మాట్లో తన వికెట్ల సంఖ్యను 92కి పెంచుకున్నాడు. కేవలం 72వ టీ20 ఆడిన బుమ్రా.. ఓవరాల్ గా తన ఖాతాలో 92 వికెట్లను వేసుకున్నాడు. అతని సగటు 17.67 కావడం విశేషం. బ్యాటర్లు అధిపత్యం వహించే ఈ ఫార్మాట్ లో బుమ్రా ఎకానమీ రేటు కేవలం 6.2 మాత్రమే నమోదు కావడం విశేషం. తాజా ఘనతతో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను బుమ్రా వెనక్కి నెట్టాడు. అంతకుముందు 87 మ్యాచ్ ల్లో 90 వికెట్లతో భువీ నాలుగో స్థానంలో నిలిచాడు.
టాప్ త్రీలో ఉన్నది ఎవరంటే..ఇక టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ నిలిచాడు. అతను కేవలం 63 మ్యాచ్ ల్లోనే 99 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ ఫార్మాట్ లో అత్యంత విజయవంతమైన భారత బౌలర్ గా నిలిచాడు. మరో వికెట్ సాధిస్తే వంద వికెట్ల క్లబ్బులో చేరిన తొలి భారత బౌలర్ గానూ రికార్డులకెక్కుతాడు. ఆ తర్వాత స్థానంలో యజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. తను 80 మ్యాచ్ ల్లో 96 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తను 116 మ్యాచ్ ల్లో 95 వికెట్లను తీశాడు. పాక్ పై మ్యాచ్ లో పాండ్యా కూడా ఒక వికెట్ తీశాడు. ఓపెనర్ సయూమ్ అయూబ్ ను డకౌట్ చేసి, సత్తా చాటాడు.
మరోసారి పై చేయి.. అంతకుమందు హై వోల్టేజీ సమరంలో మరోసారి పాకిస్థాన్ పై భారతే పై చేయి సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. అన్ని రంగాల్లో సత్తా చాటిన యువ టీమిండియా.. పాక్ ను 7 వికెట్లతో మట్టికరిపించింది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ ను బ్యాటర్లు నిరాశ పర్చారు. భారతబౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాన్ (44 బంతుల్లో 40, 1 ఫోర్, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం ఛేజింగ్ ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది. 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి, సూపర్-4లో దాదాపు బెర్త్ ను ఖరారు చేసుకుంది. 'సూర్య కుమార్ యాదవ్ (37 బంతుల్లో 47, 5 ఫోర్లు, 1 సిక్సర్) తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లలో సయిమ్ అయూబ్ కు మూడు వికెట్లు దక్కాయి. కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.