Wet Road Car Driving Guide: వర్షాలు పడినప్పుడు రోడ్డుపై నీరు నిల్వ ఉండటం మనకు కొత్త విషయం కాదు. కానీ ఆ నీరు కారుకు ఎంత ప్రమాదకరమో చాలామందికి పూర్తిగా అర్థం కాదు. ముఖ్యంగా హైవేలపై కొంచెం వేగంగా వెళ్లే సమయంలో, కాస్త పెద్ద నీటి గుంతలోకి కారు దూసుకెళ్లగానే అకస్మాత్తుగా కారు స్కిడ్‌ కావడం, ఒక పక్కకు తిరిగిపోవడం, స్టీరింగ్‌ నియంత్రణ కోల్పోవడం - ఇవన్నీ జరుగుతుంటాయి. దీనికి అసలు కారణం ఆక్వాప్లానింగ్‌. దీనిని సరిగ్గా అర్థం చేసుకుంటే మనం పెద్ద ప్రమాదాలను తప్పించుకోవచ్చు.

Continues below advertisement

ఆక్వాప్లానింగ్‌ అంటే ఏమిటి?కారు టైర్‌ మీద ఉన్న ట్రెడ్‌ నీటిని పక్కకు తోసి రోడ్డుపై గ్రిప్‌ను నిలబెట్టాలి. కానీ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా టైర్‌ పరిస్థితి బలహీనంగా ఉన్నప్పుడు, కారు టైర్‌ రోడ్డుతో కనెక్ట్‌ కాకుండా నీటి మీదే జారిపోతుంది. దీనినే ఆక్వాప్లానింగ్‌ అంటారు. ఈ సమయంలో కారుపై మన కంట్రోల్‌ తాత్కాలికంగా పూర్తిగా తగ్గిపోతుంది.

ఒక్కసారి కారు నీటి మీద తేలిపోయినట్టు స్లైడ్‌ అయితే, ముఖ్యంగా ఒక వైపు టైర్లు ముందుగా గ్రిప్‌ కోల్పోతే, కారు అకస్మాత్తుగా పక్కకు తిరిగే ప్రమాదం ఎక్కువ.

Continues below advertisement

ఇది ఎందుకు ఎక్కువగా జరుగుతుంది?

భారతదేశంలో ఇది పెద్ద సమస్య. కారణాలు:

  • రోడ్లపై నీరు నిల్వ ఉండటం
  • అరిగిపోయిన టైర్లు ఉపయోగించడం
  • రోడ్డు పరిస్థితులకు మించిన వేగం
  • హై-పెర్ఫార్మెన్స్‌ కార్లలో స్టికీ టైర్‌లు ఉండటం

ముందుగా వచ్చే వార్నింగ్‌ సిగ్నల్స్‌ను పట్టించుకోండి

ప్రమాదం జరగకముందే కారు కొన్ని సూచనలు ఇస్తుంది:

  • స్టీరింగ్‌ తేలికగా మారిన ఫీలింగ్‌
  • నీటిలోకి ప్రవేశించగానే స్టీరింగ్‌ ఒక్కసారిగా లైట్‌గా అనిపిస్తుంది.
  • ఇంజిన్‌ rpm అకస్మాత్తుగా పెరగడం
  • టైర్‌ గ్రిప్‌ కోల్పోయి స్లిప్‌ అవుతుండగా ఇంజిన్‌ రేజ్‌ పెరుగుతుంది.
  • ట్రాక్షన్‌ కంట్రోల్‌ లేదా ESP లైట్లు వెలగడం
  • రోడ్డుపై గ్రిప్‌ తగ్గినట్టుగా గుర్తించిన వెంటనే కారు సిస్టమ్‌ హెచ్చరిక ఇస్తుంది.

ఈ సిగ్నల్స్‌ వస్తే వెంటనే క్రమంగా వేగం తగ్గిస్తూ, కారు స్థిరంగా ఉండేలా డ్రైవ్‌ చేయడం చాలా ముఖ్యం. బ్రేక్‌ను హఠాత్తుగా నొక్కడం మాత్రం చేయకండి, అది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

ఎంత వేగంలో ఆక్వాప్లానింగ్‌ జరుగుతుంది?

చాలామంది ఇది 120–140kphలలోనే జరుగుతుందని భావిస్తారు. వాస్తవానికి 70kph దగ్గర నుంచే ఆక్వాప్లానింగ్‌ మొదలవుతుంది.

ప్రమాదాన్ని ఎలా పూర్తిగా తప్పించుకోవచ్చు?

1. టైర్లను మంచి కండిషన్‌లో ఉంచండి - ట్రెడ్‌ డెప్త్‌ తగ్గితే నీటిని తొలగించే సామర్థ్యం పడిపోతుంది.

2. ట్రాక్‌-స్పెక్‌ స్టికీ టైర్లు వర్షంలో ప్రమాదం - వీటి ట్రెడ్లు నీటిని తొలగించడానికి డిజైన్‌ చేయలేదు.

3. నీటి గుంతలు కనిపిస్తే వేగం తగ్గించండి - వాటిలోకి స్పీడ్‌తో వెళ్లడమే అసలైన ప్రమాదం.

4. వార్నింగ్‌ సిగ్నల్స్‌ వస్తే వెంటనే స్పీడ్‌ తగ్గించండి - యాక్సిలరేటర్‌ స్మూత్‌గా వదలండి, కారు స్టేబుల్‌ అవుతుంది.

5. మన రోడ్లను బట్టి డ్రైవింగ్‌ అలవాటు మార్చుకోండి - ఫార్ములా 1 టైర్లు ఒక సెకనుకు 85 లీటర్ల నీటిని తొలగిస్తాయి. మన కార్ల టైర్లు అంత పని చేయలేవు, అందుకే రిస్క్‌ తీసుకోవద్దు.

వర్షంలో డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మనం రోడ్డును మాత్రమే చూడకూడదు.. టైర్ల పరిస్థితి, రోడ్డుపై ఉన్న నీరు, కారు వేగం అన్నింటినీ అంచనా వేయాలి. ఇవే కారు సేఫ్టీని నిర్ణయిస్తాయి. ఆక్వాప్లానింగ్‌ ప్రమాదం చిన్న విషయం కాదు. చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి అర్ధం చేసుకుని డ్రైవ్‌ చేయండి, వార్నింగ్‌ వస్తే వెంటనే స్పందించండి, సేఫ్‌గా ఉండండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.