Shirdi Sai Electricals Company subsidies: షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ పేరు వింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జగన్ గుర్తుకు వస్తారు. వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఈ కంపెనీకి ఏపీలో అగ్ర తాంబూలం దక్కింది. పవర్ రంగానికి చెందిన కాంట్రాక్టులు, ట్రాన్స్ ఫార్మర్ల సరఫరా చేసే కాంట్రాక్టులు అన్నీ ఈ కంపెనీకే దక్కేవి. టీడీపీ నేతలు కూడా తీవ్రంగా ఆరోపణలు చేసేవారు. టీడీపీ రాగానే ఆ కంపెనీ అక్రమాలన్నీ బయటకు తీస్తారని అనుకున్నారు. కానీ ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత లభిస్తోంది. తాజాగా వంద కోట్లకుపైగా స్టాంప్ డ్యూటీని మినహాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
షిరిడి సాయి అనుబంధ సంస్థకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ అయిన సూర్యచక్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు భారీ స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు మొత్తం రూ. 104.51 కోట్లు. ఈ మేరకు జీవోలు జారీ అయింది. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ ఇప్పటికే శ్రీసిటీ లో రూ. 3,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి సోలార్ ప్యానల్స్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటోంది. ఇప్పుడు కంపెనీ తన అనుబంధ సంస్థ సూర్యచక్ర డెవలపర్స్ ద్వారా కొత్తగా మరో రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెడతామని మినహాయింపులు కోరింది. ప్రభుత్వం డిసెంబర్ 2025లో జారీ చేసిన GO Ms. No. 9 ప్రకారం.. 5,000 ఎకరాలకు పైగా కాకుండా కొనుగోలు చేసే భూమికి 100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నారు. సూర్యచక్ర డెవలపర్స్ కొనుగోలు చేసిన భూమి విలువ రూ. 1,045 కోట్లు కాగా, దానిపై వచ్చే స్టాంప్ డ్యూటీ పూర్తిగా మాఫీ చేశారు. దీని వల్ల ఆ కంపెనీకి రూ. 105 కోట్ల లాభం ఉంటుంది. షిరిడీసాయికి ఇది మొదటిసారి కాదు. గతంలోనూ 2021–23 మధ్య అంటే జగన్ హయాంలోనూ ఈ కంపెనీకి సుమారు రూ. 200 కోట్లకు పైగా స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు మాఫీ చేశారు. మొత్తం మీద ఈ కంపెనీకి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 300 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు వచ్చాయి.
టీడీపీ హయాంలోనూ పెద్ద ఎత్తున భూములు కేటాయింపు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు 8,365 ఎకరాల భూమి కేటాయించారు. పదేళ్ల కిందట షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే కంపెనీ. తర్వాత భారీ విద్యుత్ కంపెనీగా మారింది. విద్యుత్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు కడతామని ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీ నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి చెందినది. రామయపట్నం వద్ద సోలార్ ప్లేట్లు తయారు చేస్తామంటూ ఓ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇండో సోల్ పేరుతో ప్రారంభించింది. పది లక్షల అథరైజ్డ్ క్యాపిటల్‌తో ప్రారంభమైన ఈ కంపెనీ పెద్ద ఎత్తున భూముల్ని తీసుకుంది. వైసీపీ హయాంలో ఎన్నో మేళ్లు
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు కడప నగరానికి ఆనుకుని ఉన్న ఐటీ సెజ్ భూములు.కానీ డీ నోటిఫై చేసి 49.8 ఎకరాలను కేటాయించారు. సోమశిల వద్ద కూడా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సోమశిల వద్ద 900 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. అల్లూరి సీతారామరాజుజిల్లా ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును షిరిడి సాయి సంస్థకు ప్రభుత్వం నామినేషన్ పద్దతిలో జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఇది చట్ట విరుద్ధమని టీడీపీ ఆరోపించింది.ఈ కంపెనీ తీరుపై పవన్ కల్యాణ్ విచారణకు కూడా ఆదేశించారు. శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఫిర్యాదులు ఉన్నాయి.
తమపై అప్పుడు ఆరోపణలు చేసినా ఇప్పుడు వైసీపీ సైలెంట్
తమ హయాంలో తమ బినామీ అని ప్రచారం చేసినా.. ఇప్పుడు ఆ సంస్థకు పెద్ద ఎత్తున భూములు, రాయితీలు కల్పించడాన్ని వైసీపీ కూడా ప్రశ్నించడం లేదు. ఆ సంస్థకు మద్దతుగానే వైసీపీ ఉంది. అంటే.. రెండు పార్టీలకూ షిరిడిసాయి దగ్గర సంస్థ అని అర్థమవుతోంది. కానీ ఆరోపణలు చేసిన టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.