Vinfast VF8 EV: విన్‌‌ఫాస్ట్ అనేది భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త కార్ల తయారీ కంపెనీ. తమిళనాడులోని ప్లాంట్‌తో తన ఉనికిని దృఢంగా స్థాపించాలనే ఉద్దేశాన్ని కంపెనీ స్పష్టం చేసింది. తమిళనాడు ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. తమిళనాడు స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ (SIPCOT) ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ ఫెసిలిటీ 400 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా 1.5 లక్షల కార్లను రూపొందించగల సామర్థ్యం ఉందని అంచనా. కంపెనీ ఐదు సంవత్సరాల్లో 500 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుందని తెలుస్తోంది. వియత్నాంలో ప్రస్తుతం ఉన్న తయారీ కేంద్రం, యూఎస్, ఇండోనేషియాలోని భవిష్యత్ ప్లాంట్లు కాకుండా విన్‌ఫాస్ట్‌కు భారతదేశం ఒక ముఖ్యమైన తయారీ కేంద్రంగా ఉంటుంది. విన్‌ఫాస్ట్ అనేది వియత్నాం బేస్డ్ కంపెనీ.


ఇంజిన్, రేంజ్ ఎలా ఉండనుంది?
విన్‌‌ఫాస్ట్ ఇటీవలే వీఎఫ్8 ప్రీమియం ఈవీతో అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించింది. రాబోయే ఇతర ఈవీలతో పాటు ఇది భారతదేశంలో కంపెనీ లాంచ్ చేయనున్న మొదటి కార్లలో ఒకటి కావచ్చు. ప్రస్తుతానికి దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు. వీఎఫ్8 అనేది 4.7 మీటర్ల పెద్ద ఈవీ. ఇది డ్యూయల్ మోటార్ లేఅవుట్‌తో వస్తుంది. ఇది 400 హెచ్‌పీ కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సుమారుగా 471 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. వీఎఫ్8 కేవలం 5.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది. వీఎఫ్8 ఈవీ... మహీంద్రా యాజమాన్యంలోని ప్రసిద్ధ స్టైలింగ్ హౌస్ అయిన పినిన్‌ఫరినా ద్వారా కూడా రూపొందింది.


ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
ఫీచర్ల పరంగా వీఎఫ్8 కనీసం 11 ఎయిర్‌బ్యాగ్‌లు, 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, ఏడీఏఎస్ ఫీచర్లు, పవర్డ్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, వేగన్ లెదర్ సీట్లు, ఓటీఏ అప్‌డేట్‌లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందుతుంది. రెండో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కంపెనీ దీనిపై 10 సంవత్సరాల సుదీర్ఘ వారంటీని అందిస్తుంది. ఇవి గ్లోబల్ మోడల్ ఫీచర్లు కాగా మనదేశంలో ఏమైనా మారుతుందేమో చూడాలి.


భారతదేశంలో లాంచ్ కానున్న విన్‌ఫాస్ట్ మోడల్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలో భారతీయ కార్ల కొనుగోలుదారులకు మరో ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. వీఎఫ్8 కాకుండా కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన కొత్త మాస్ మార్కెట్ ఈవీతో సహా ఎన్నో కార్లను కలిగి ఉంది.


మరోవైపు బజాజ్ ఆటో తన అప్‌డేటెడ్ పల్సర్ ఎన్ఎస్160, పల్సర్ ఎన్ఎస్200లను భారతదేశంలో లాంచ్ చేసింది. పల్సర్ ఎన్ఎస్160 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.46 లక్షలుగానూ, పల్సర్ ఎన్ఎస్200 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.55 లక్షలుగానూ నిర్ణయించారు. ఈ అప్‌డేట్‌తో పాత ఎన్ఎస్ లైనప్‌కి తాజా స్టైలింగ్, కొత్త ఎల్సీడీ డాష్ రూపంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయడం చూడవచ్చు. కొత్త ఎల్సీడీ డాష్ బోర్డు, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. పల్సర్ ఎన్ఎస్160, పల్సర్ ఎన్ఎస్200ల్లో అతిపెద్ద మార్పు కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్ రూపంలో రావడం చూడవచ్చు. దాని చుట్టూ ఉన్న డీఆర్ఎల్స్ ఇప్పుడు థండర్ షేప్‌లో అందించడం విశేషం.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!