ఐపీఎల్ 2026 (IPL 2026)లో అద్భుత ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ప్రేమికుల మనసుల్ని గెలుచుకున్నాడు. వైభవ్‌కు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ అనంతరం 'స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' టైటిల్ లభించింది. ఆ తర్వాత టాటా మోటార్స్ అతడికి కొత్త టాటా సియెరా SUV బహుమతిగా ఇచ్చింది.
'స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డు టోర్నమెంట్ మొత్తంలో అత్యంత ప్రభావవంతమైన స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాటర్‌కు దక్కుతుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి టాటా సియెరా లభించినప్పటికీ, అతను ప్రస్తుతం ఈ కారును నడిపేందుకు అర్హుడు కాదని తెలిసిందే. అందుకు అతడి వయసు అడ్డంకిగా మారింది.
టాటా సియెరాను వైభవ్ ఎప్పటి వరకు నడపలేడు?
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసు ప్రస్తుతం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వయోపరిమితి 18 సంవత్సరాలు. కనుక వైభవ్ దాదాపు 3 సంవత్సరాల వరకు కారు డ్రైవింగ్ చేయడం కుదరదు. అతనికి అధికారికంగా డ్రైవింగ్ లైసెన్స్ 2029లో లభిస్తుంది.
టాటా సియెరా డిజైన్, ఫీచర్లు
టాటా సియెరా ఎస్‌యూవీని మోడ్రన్ డిజైన్, అధునాతన సాంకేతికత, అద్భుతమైన ఫీచర్లతో తీసుకొచ్చారు. టాటా గత సంవత్సరమే ఓల్డ్ జనరేషన్ ఫేమస్ సియెరాను కొత్త లుక్‌లో ప్రవేశపెట్టింది. టాటా సియెరా డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో క్లాసిక్ సియెరా షేడ్స్ కనిపిస్తాయి. కానీ దీనికి పూర్తిగా మోడ్రన్ లుక్ ఇచ్చారు.
దీని ముందు భాగంలో ఎల్‌ఈడీ లైట్ బార్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్ రోడ్డుపై టాటా సియోరాకు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ఎస్‌యూవీ క్యాబిన్ కూడా ప్రీమియంగా ఇచ్చారు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ కనెక్టివిటీ, పలు మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.
కారు సేఫ్టీ, పవర్
కారు సేఫ్టీ విషయంలో టాటా సియెరా చాలా స్ట్రాంగ్ అని భావిస్తున్నారు. ఇందులో పలు ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, ఇతర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తాయి.
టాటా సియెరా అద్భుతమైన పవర్‌ట్రైన్ కారణంగా బాగా ఫేమస్ అయింది. కంపెనీ ఈ కారులో 1.5 లీటర్ సామర్థ్యం గల TGDi ఇంజిన్‌ను ఇచ్చింది. ఈ ఇంజిన్ కారుకు 158 బీహెచ్‌పీ శక్తితో పాటు 255 న్యూటన్ మీటర్ల టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కారులో 6 గేర్ల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది.
టాటా సియెరా కారు ధర ఎంత?
హైదరాబాద్‌లో సియెరా కారు ఎక్స్-షోరూమ్ ధర 11.49 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ విషయానికి వస్తే, సుమారు రూ. 21.29 లక్షలు. హైదరాబాద్‌లో బేస్ మోడల్ కొనుగోలు చేస్తే ఆన్ రోడ్ ధర రూ. 14,33,361 గా ఉంది. మోడల్, వేరియంట్ బట్టి ధరలు మారుతుంటాయి. ఒక్కో రాష్ట్రంలో పన్నులు రిజిస్ట్రేషన్ ఛార్జీల కారణంగా కార్ల ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
