Second-hand Kia Sonet Facelift: స్టైలిష్ లుక్, ప్రీమియం ఇంటీరియర్, అధునాతన ఫీచర్లు, స్మూత్ ఇంజిన్లు.. ఇవన్నీ కలిపి కాంపాక్ట్ SUV విభాగంలో కియా సోనెట్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అందుకే కొత్త కారు కొనలేనివారు సెకండ్ హ్యాండ్ మార్కెట్లోనూ ఈ మోడల్‌ను పరిశీలించవచ్చు. ముఖ్యంగా 2024 జనవరిలో పరిచయమైన సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ మార్పులతో పాటు ఇంటీరియర్, ఫీచర్ల పరంగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి.
యూజ్డ్/ సెకండ్ హ్యాండ్/ ప్రి-ఓన్డ్ సోనెట్ కొనేముందు ఇంజిన్, గేర్‌బాక్స్, వేరియంట్, సర్వీస్ హిస్టరీతో పాటు కొన్ని ప్రత్యేక సమస్యలను కూడా పరిశీలించాలి. ముఖ్యంగా డీజిల్ కార్లలో DPF సమస్య, DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేడెక్కడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ ఆప్షన్లు
సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
- 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 83hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.- 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120hp పవర్ ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ క్లచ్‌లెస్ iMT లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.- 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 116hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, iMT లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
ఎక్కువ దూరాలు ప్రయాణించేవారికి డీజిల్ వెర్షన్ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వేరియంట్ సౌకర్యవంతంగా ఉంటుంది. మంచి పనితీరు కోరుకునేవారు టర్బో పెట్రోల్‌ను పరిశీలించవచ్చు. నగర ప్రయాణాలే ఎక్కువగా ఉండి, బడ్జెట్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారికి 1.2-లీటర్ పెట్రోల్ సరిపోవచ్చు.
వేరియంట్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
సోనెట్ ఫేస్‌లిఫ్ట్ టెక్ లైన్, GT లైన్, X-లైన్ రూపాల్లో అందుబాటులో ఉంది. టెక్ లైన్లో HTE, HTK, HTK+, HTX, HTX+ వేరియంట్లు ఉన్నాయి. టాప్ ఎండ్‌లో GTX+ & X-Line వేరియంట్లు ఉంటాయి.
బేస్ HTE వేరియంట్లోనే ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కలర్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
హైయ్యర్ వేరియంట్లకు వెళ్లే కొద్దీ అల్లాయ్ వీల్స్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి సదుపాయాలు లభిస్తాయి.
HTX+లో 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బోస్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీట్ ఉంటాయి. GTX+ & X-Line వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా, ADAS ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
అయితే, సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఫీచర్ల జాబితాను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవద్దు. ఎక్కువ ఫీచర్లు ఉన్న టాప్ వేరియంట్ కంటే మంచి కండిషన్లో ఉన్న మిడ్ వేరియంట్ కొనడం మంచిది కావచ్చు. మీరు ఎక్కువగా ఉపయోగించని ఫీచర్ల కోసం అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
సోనెట్ క్యాబిన్ ఈ విభాగంలో ప్రీమియంగా అనిపించినా, వెనుక సీటులో స్థలం కొంత పరిమితంగా ఉంటుంది. వెనుక సీటులో పెద్దవాళ్లు తరచూ ప్రయాణిస్తే, కొనేముందే అక్కడ కూర్చుని సౌకర్యాన్ని పరిశీలించాలి. కాంపాక్ట్ సైజ్, ఎక్కువ ఫీచర్లు ఉండటంతో నగర ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.
యూజ్డ్ సోనెట్‌లో తప్పనిసరిగా చెక్ చేయాల్సిన సమస్యలు
1. డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF) బ్లాక్ అవ్వడం
సోనెట్ డీజిల్ యజమానుల్లో కొందరు DPF తరచూ రీజెనరేషన్ అవసరమవుతోందని నివేదించారు. ముఖ్యంగా తక్కువ దూరాలు, తక్కువ వేగంతో కారును ఎక్కువగా నడిపితే ఈ సమస్య రావచ్చు. అప్పుడు DPF తగినంత వేడెక్కకపోవడంతో అందులో పేరుకున్న మసి పూర్తిగా కాలిపోదు. ఇలాంటి సమయంలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో హెచ్చరిక లైట్ కనిపిస్తుంది. దానిని పరిష్కరించడానికి రీజెనరేషన్ సైకిల్ అవసరం కావచ్చు. సాధారణంగా 50kph కంటే ఎక్కువ వేగంతో సుమారు 20 నిమిషాలు కారు నడపాల్సి ఉంటుంది.
కారు పనితీరు మందగించడం, ఇంధన సామర్థ్యం తగ్గడం వంటివి DPF బ్లాక్ అయినట్లు సూచించే లక్షణాలు. అందుకే యూజ్డ్ డీజిల్ సోనెట్ కొనేముందు ఈ అంశాన్ని పరిశీలించాలి.
2. DCT గేర్‌బాక్స్ వేడెక్కడం
భారీ ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు కొందరు యజమానులు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేడెక్కినట్లు నివేదించారు. ఇలా జరిగితే గేర్‌బాక్స్ చల్లబడే వరకు కారును ఆపి వేచి ఉండాల్సి రావచ్చు.
ఎక్కువసేపు వాహనం ఒకేచోట నిలిచినప్పుడు గేర్‌ను న్యూట్రల్‌లోకి మార్చడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు. కాబట్టి DCT వేరియంట్ కొనాలనుకునేవారు టెస్ట్ డ్రైవ్ సమయంలో గేర్‌బాక్స్ పనితీరును జాగ్రత్తగా గమనించాలి.
ఇది కూడా చదవండి: Kia Seltos సరికొత్త రికార్డ్.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
3. టర్బో పెట్రోల్ ఫ్యూయల్ పంప్
1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో ఫ్యూయల్ పంప్ సమస్యలు ఎదురైనట్లు కొంతమంది చెప్పారు. అయితే, ఇవి తరచూ సాధారణంగా కనిపించే సమస్యలు కావు. కారు స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఆలస్యం లేదా ఇబ్బంది లేకుండా స్టార్ట్ అవుతోందో చూడాలి. స్టార్ట్ కావడంలో తడబాటు ఫ్యూయల్ పంప్ సమస్యకు సంకేతం కావచ్చు.
ఇది డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్ కావడంతో మంచి నాణ్యత గల ఇంధనం అవసరం. నాణ్యత లేని పెట్రోల్ వల్ల కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
కొనేముందు ఈ తనిఖీలు చేయండి
కారు పూర్తి సర్వీస్ హిస్టరీని పరిశీలించాలి. టైర్లు, బ్రేకుల పరిస్థితి ఎలా ఉందో చూడాలి. బాడీపై ప్రమాదానికి గురైన ఆనవాళ్లు, మరమ్మతులు చేసిన గుర్తులు ఉన్నాయా? అని తనిఖీ చేయాలి. అన్ని ఎలక్ట్రికల్ ఫీచర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో పరీక్షించాలి.
అలాగే ఒరిజినల్ వారంటీ ఇంకా అమల్లో ఉందా? ఎక్స్టెండెడ్ వారంటీ పొందే అవకాశం ఉందా? అనే వివరాలు తెలుసుకోవాలి. సోనెట్ విశ్వసనీయమైన కారుగా పేరు తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా కియా సర్వీస్ నెట్వర్క్ కూడా విస్తృతంగా ఉంది.
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత?
2024 తర్వాత వచ్చిన సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు యూజ్డ్ కార్ల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మోడల్ సంవత్సరం, వేరియంట్, ఇంజిన్, గేర్‌బాక్స్, ప్రయాణించిన దూరం, కారు కండిషన్‌ను బట్టి వాటి ధర రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంది.
మంచి కండిషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కొనాలంటే సుమారు రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే రూ.12 లక్షలకు మించి ఖర్చు చేయడం మంచిది కాకపోవచ్చు. మరికొన్ని లక్షలు జోడిస్తే కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
