Two Wheelers Sales Report 2024: భారతదేశంలో ద్విచక్ర వాహనాల విషయంలో ప్రజలలో భిన్నమైన క్రేజ్ ఉంది. భారతీయ మార్కెట్లో అన్ని రకాల మోటార్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తక్కువ ధర నుంచి బాగా ఎక్కువ ధర వరకు చాలా బైక్స్ ఉన్నాయి. 2024 నవంబర్‌లో జరిగిన ద్విచక్ర వాహనాల విక్రయాల నివేదికను కూడా విడుదల చేశారు. ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఏ కంపెనీ ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా హీరో మోటోకార్ప్ మార్కెట్‌లో అగ్రగామిగా నిలిచింది. ఎఫ్ఏడీఏ నివేదిక ప్రకారం 2024 నవంబర్ నెలలో మొత్తం 9,15,468 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ విక్రయం 8,04,498 యూనిట్లుగా ఉంది. ఈ విధంగా చూసినప్పుడు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో విక్రయాలు ఎక్కువగా జరిగాయి.
Also Read: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
హీరో తర్వాత ఈ కంపెనీలు...
హోండా మోటార్‌సైకిల్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. జపాన్ వాహన తయారీ సంస్థ 2024 నవంబర్‌లో మొత్తం 6,54,564 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాది విక్రయించిన 5,15,128 యూనిట్ల కంటే ఎక్కువ. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో టీవీఎస్ మూడో స్థానంలో ఉంది. కంపెనీ మొత్తం 4,20,990 యూనిట్లను విక్రయించింది. ఇది 2023 నవంబర్‌లో విక్రయించిన 3,66,896 యూనిట్ల కంటే ఎక్కువ.
ఐదో స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్...
బజాజ్ ఆటో ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. బజాజ్ గత నెలలో మొత్తం 3,04,221 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 2,75,119గా ఉంది. ఈ జాబితాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐదో స్థానంలో ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో మొత్తం 93,530 యూనిట్లను విక్రయించింది. ఇది 2023 నవంబర్‌లో అమ్ముడుపోయిన 83,947 యూనిట్ల కంటే ఎక్కువ. ఈ కంపెనీలే కాకుండా సుజుకి, యమహా, ఓలా, ఏథర్ కంపెనీల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.
Also Read: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!