ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకవైపు ‘పుష్ప2’తో బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడేస్తున్నాడు. ఫస్ట్ వీక్‌లోనే బాక్సాఫీస్‌కి వెయ్యి కోట్లను పరిచయం చేసి.. సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండటం చూస్తుంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు మొత్తం పుష్పరాజ్ పేరిట లిఖించబడటం కాయం అనేలా అప్పుడే బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ అంటూ బుధవారం ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో బాగా వైరల్ అయింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని అల్లు అర్జున్ రహస్యంగా కలిశాడని, ఆయన సలహాతో త్వరలోనే అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడనేలా గురువారం ఉదయం నుండి ఒకటే వార్తలు. తాజాగా ఈ వార్తలపై అల్లు అర్జున్ అండ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలను అల్లు అర్జున్ టీమ్ ఖండించింది. ‘‘రాజకీయాల్లోకి అల్లు అర్జున్ వస్తున్నట్లుగా వినిపిస్తున్న వార్తలలో ఎటువంటి వాస్తవం లేదు. ఎలాంటి ఆధారం లేని ఇలాంటి వార్తలపై జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నాం. మా నుండి ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ఈ సందర్భంగా మీడియా సంస్థలను, వ్యక్తులను కోరుతున్నాము. నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే.. మేమే అందరికీ తెలియజేస్తాం’’ అని అల్లు అర్జున్ టీమ్ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
అసలు విషయం ఏమిటంటే.. ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన భార్య స్నేహితురాలైన భర్త, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి తరుపున ప్రచారానికి వెళ్లడమే కాకుండా, అక్కడాయన మాట్లాడిన మాటలు మెగాభిమానులకు, జనసేన అభిమానులకు కోపాన్ని తెప్పించాయి. స్వయంగా తన మామయ్య పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి, బరిలోకి దిగితే.. బన్నీ వెళ్లి ఆయనకు వ్యతిరేక వర్గమైన వైసీపీకి సపోర్ట్ చేయడం మెగా అభిమానులే కాకుండా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. బన్నీ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు కూడా. అయినా కూడా తను చేసినా పనే కరెక్ట్ అంటూ మరో వేదికపై కూడా అల్లు అర్జున్ బిగ్గరగా ప్రకటించాడు.
అప్పటి నుండి మెగా యూనిట్‌లో అల్లు అర్జున్‌పై వ్యతిరేకత వ్యక్తం అవుతూ వస్తోంది. ‘పుష్ప 2’ రిలీజ్ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఇన్ డైరెక్ట్‌గా, సాయిదుర్గ తేజ్ డైరెక్ట్‌గా సపోర్ట్ చేశారు కానీ.. మిగతా మెగా హీరోలెవరూ చిన్న కామెంట్ కూడా చేయలేదు. ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత అన్ని చోట్లా రికార్డులు నమోదు అవుతున్నాయి కానీ.. ఏపీలో మాత్రం కలెక్షన్ల అనుకున్నంతగా అయితే లేవు. వైసీపీ అభిమానులు తప్పితే.. ‘పుష్ప 2’కు ఏపీలో మిగతా అభిమానుల ఆదరణ కరువైందనే చెప్పాలి. మరి ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడో ఏమో.. తను కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. తన పవర్ ఏంటో చూపించాలని అల్లు అర్జున్ భావించాడని, అందుకే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని రహస్యంగా మీట్ అయ్యాడనేలా వార్తలు వైరల్ అయ్యాయి.
Also Read: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!
ఇప్పుడు అల్లు అర్జున్ టీమ్ కూడా రాజకీయాలలోకి రావడం లేదని వివరణ ఇచ్చింది కానీ.. పీకేని కలవలేదని మాత్రం చెప్పలేదు. నిప్పులేనిదే పొగ రాదంటారు. సడెన్‌గా పీకేని అల్లు అర్జున్ కలిశాడని వార్త వచ్చిందంటే.. ఇందులో ఇంతో కొంత నిజం అయితే ఉండే ఉండొచ్చు. అసలు అల్లు అర్జున్ మనసులో ఏముందనే విషయం మాత్రం భవిష్యత్‌లోనే తెలుస్తుంది. అప్పటి వరకు వారు ఇచ్చిన వివరణ కాస్త ఈ రూమర్స్‌కు బ్రేక్ వేస్తుంది అంతే.