Triumph Speed T4 Vs Triumph Speed 400 ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్‌ (Triumph Motorcycles) ఇటీవలె తన 400 సీసీ లైనప్‌లో రెండు సరికొత్త బైక్‌లను విడుదల చేసింది. తాజాగా కంపెనీ విడుదల చేసిన ట్రయంఫ్ స్పీడ్ టీ4 (Triumph Speed T4) బైక్‌ ఆ కంపెనీ లైనప్‌లోనే అత్యంత చౌకైన బైక్‌గా అందుబాటులో ఉంది. దీనితో పాటు స్పీడ్‌ 400 (Triumph Speed 400) అప్‌డేటెడ్‌ బైక్‌ కొన్ని మార్పులతో విడుదల చేసింది. 400 సీసీ విభాగంలో లభించే ఈ బైక్స్‌లో ఏదీ బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.. 


ట్రయంఫ్ స్పీడ్ T4 వర్సెస్ స్పీడ్ 400

ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ తన 400 సీసీ లైనప్స్‌ని విస్తరిస్తోంది. అందులో భాగంగా కొత్త స్పీడ్ టీ4, అప్‌డేటెడ్ స్పీడ్ 400 బైక్‌లను ఒకే రోజు మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ రెండు బైక్స్‌ డిజైన్లు, ఇతర ఫీచర్లు ఒకేలా ఉన్నప్పటికీ ధరల్లో కొద్దిపాటి తేడా ఉంది. ట్రయంఫ్ టీ4 ఎక్స్ షోరూమ్ ధర రూ.2.17 లక్షలు కాగా, అప్‌డేటెడ్ ట్రయంఫ్ స్పీడ్ 400 ప్రారంభ ధర రూ.2.40 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ రెండు బైకుల మధ్య రూ .23,000 వ్యత్యాసం ఉంది.


ట్రయంఫ్ బైక్స్‌ డిజైన్


ట్రయంఫ్ స్పీడ్ టీ4, స్పీడ్ 400 చూడటానికి ఒకే రకమైన పోలికలను కలిగి ఉంటాయి. అయితే ఈ బైక్స్‌లో చిన్నపాటి కాస్మోటిక్‌ తేడాలు ఉన్నాయి. స్పీడ్ టీ4 వీల్స్‌పై బ్రైటర్‌ లైన్స్‌, ఫ్యూయల్ ట్యాంక్‌పై '400' నంబర్‌తో పెద్ద లోగోను కలిగి ఉంటుంది. ఇక స్పీడ్ 400లో గోల్డ్‌ కోటెడ్‌ ఇన్వర్టెడ్ ఫోర్క్స్‌ని కలిగి ఉంటుంది. రెండు బైక్‌ల అల్లాయ్ వీల్స్, రౌండ్ హెడ్ లైట్స్‌, సింగిల్ పీస్ సీట్లు, ఫ్యూయల్ ట్యాంక్ ఒకే విధమైన డిజైన్‌ని కలిగి ఉన్నాయి. స్పీడ్ టీ4 మెటాలిక్ వైట్, ఫాంటమ్ బ్లాక్, కాక్టెయిల్ రెడ్ వైన్ అనే మూడు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది.


డైమెన్షన్స్‌


స్పీడ్ టీ4 హ్యాండిల్ బార్ 827 మిమీ, స్పీడ్ 400 829 మిమీగా ఉంది. స్పీడ్ 400 బరువు స్పీడ్ T4 కంటే 1 kg తక్కువగా ఉంటుంది. రెండు బైకులు ఒకే విధమైన బ్రేకింగ్‌ సిస్టమ్‌ని కలిగి ఉన్నాయి. వీటి ముందు భాగంలో 300 మిమీ డిస్క్స్‌, వెనుక భాగంలో 230 మిమీ డిస్క్స్ , స్టాండర్డ్ ఏబీఎస్‌ ఉన్నాయి. ఇక టైర్ల విషయానికొస్తే, స్పీడ్ టీ4 ఎంఆర్ఎఫ్ నైలోగ్రిప్ జాపర్ టైర్లను కలిగి ఉంటుంది. స్పీడ్ 400 ఎంఆర్ఎఫ్ స్టీల్ బ్రేస్ లేదా అపోలో ఆల్ఫా హెచ్ 1 రేడియల్ టైర్లను పొందుతుంది.


ఇంజిన్, ఫర్ఫామెన్స్ మధ్య తేడాలు


ఈ రెండు బైకులు 399 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. అయితే వీటి ట్రాన్స్‌మిషన్‌లో తేడా ఉంది. స్పీడ్ టీ4లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ అందించగా.. స్పీడ్ 400లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి వస్తుంది. స్పీడ్ 400 39.5 bhp పవర్, 37.5nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.. ఇక స్పీడ్ టీ4 30.6 bhp పవర్, 36 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.


ఫీచర్లలో తేడాలు..


ఈ రెండు బైకుల్లో రైడ్ బై వైర్ థ్రోటిల్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్స్‌ ఉన్నాయి. అయితే స్పీడ్ 400లో స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. ఇది స్పీడ్ టీ4 లో అందుబాటులో లేదు. స్పీడ్ 400 కంటే ట్రయంఫ్ స్పీడ్ టీ4 ఎక్కువ పవర్‌ని పొందుతుంది.