Triumph bikes prices hiked again: దేశీయ మార్కెట్లో ప్రీమియం మిడ్-కెపాసిటీ మోటార్‌సైకిళ్లకు మంచి ఆదరణ లభిస్తున్న వేళ, ట్రయంఫ్ తన 350cc రేంజ్‌పై మరోసారి ధరలను పెంచింది. జూన్‌లో ధరల సవరణ చేసిన ఈ కంపెనీ, ఆ తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరోసారి అన్ని మోడళ్ల ధరలను పెంచడం గమనార్హం. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న మొత్తం ఆరు మోడళ్లు ఇప్పుడు మరింత ఖరీదయ్యాయి.
GST తగ్గింపు అమల్లోకి వచ్చిన తర్వాత ట్రయంఫ్ తన 399cc ఇంజిన్‌ను 350cc ఇంజిన్‌గా మారుస్తూ ధరలను తగ్గించింది. అయితే, ఇప్పుడు వరుసగా రెండోసారి ధరలు పెరగడంతో, కొన్ని మోడళ్లు 399cc ఇంజిన్‌తో విక్రయించిన సమయంలో ఉన్న ధరల కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ధరకు చేరుకున్నాయి.
తాజా ధరల పెంపులో అత్యధిక ప్రభావం Triumph Speed T4 పై పడింది. ఈ మోడల్ ధర ఏకంగా రూ.10,000 పెరిగి రూ.2.09 లక్షలకు చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరతో పోలిస్తే ఇప్పుడు ఈ బైక్ మొత్తం రేటు రూ.14,000 పైకి చేరింది. ఒకప్పుడు ధర పెంపు నుంచి తప్పించుకున్న ఈ మోడల్‌కు ఇప్పుడు భారీ పెంపు వర్తించడం కొనుగోలుదారులకు షాక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: హీరో Xoom 110 ధర, వేరియంట్లు, ఫీచర్లు - కొనే ముందే తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
Triumph Speed 400 ధర కూడా పెరిగింది. ఈ మోడల్‌పై సుమారు రూ.6,000 పెంపు చేసి కొత్త ధరను రూ.2.40 లక్షలుగా నిర్ణయించారు. అదే విధంగా అడ్వెంచర్ స్టైల్‌ను ఇష్టపడే వారికి అందుబాటులో ఉన్న Triumph Scrambler 400 X ధర కూడా సుమారు రూ.6,000 పెరిగి రూ.2.65 లక్షలకు చేరుకుంది.
ప్రీమియం వేరియంట్‌గా ఉన్న Triumph Scrambler 400 XC ధర సుమారు రూ.5,000 పెరిగి ఇప్పుడు రూ.2.99 లక్షలకు విక్రయించబడుతోంది. మరోవైపు క్లాసిక్ కేఫే రేసర్ స్టైల్‌తో వచ్చిన Triumph Thruxton 400 ధర కూడా సుమారు రూ.5,000 పెరిగి రూ.2.75 లక్షలకు చేరింది.
గత ధరల పెంపులో ప్రభావం లేకుండా కొనసాగిన Triumph Tracker 400 కూడా ఈసారి ధరల పెంపు నుంచి తప్పించుకోలేదు. ఈ మోడల్ ధర సుమారు రూ.3,000 పెరిగి రూ.2.49 లక్షలకు చేరింది. అయితే మొత్తం రేంజ్‌లో అతి తక్కువ పెంపు ఇదే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: యమహా R2పై భారీ అంచనాలు, కేటీఎం RC 200కు కొత్త ఛాలెంజ్! - పవర్, ఫీచర్లు, ధర ఎలా ఉండొచ్చు?
తాజా ధరల ప్రకారం Speed T4 రూ.2.09 లక్షలు, Speed 400 రూ.2.40 లక్షలు, Tracker 400 రూ.2.49 లక్షలు, Scrambler 400 X రూ.2.65 లక్షలు, Scrambler 400 XC రూ.2.99 లక్షలు & Thruxton 400 రూ.2.75 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
తక్కువ కాలంలో వరుసగా రెండుసార్లు ధరలు పెరగడం వల్ల ట్రయంఫ్ 350cc రేంజ్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ బ్రాండ్‌కు ఉన్న ఆదరణ, ప్రీమియం ఫీచర్లు, ఆధునిక డిజైన్ & పనితీరు కారణంగా ఈ మోడళ్లకు మార్కెట్లో డిమాండ్ కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
