Challan On Kia SUV For Having Sunshade: కారు లోపలకు ఎండ రాకుండా వాహనం విండో గ్లాస్‌కు సన్‌షేడ్‌ను అమర్చుకోవడం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇప్పుడు చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల విండో అద్దాలకు సన్‌షేడ్‌ను డిఫాల్ట్ ఫీచర్‌గా అందిస్తున్నాయి. అయితే, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక కేసు ఈ ఫెసిలిటీ గురించి మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది.

అసలు ఏం జరిగింది?ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఒక కారు యజమాని తన KIA కారు రియర్‌ వ్యూ మిర్రర్ & సైడ్ విండోకు సన్‌షేడ్ అమర్చినందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఆ కారును ఆపారు. అద్దాలకు సన్‌షేడ్‌ ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించారు. ఆ సన్‌షేడ్‌ను కియా కంపెనీ పర్మినెంట్‌గా ఇన్‌స్టాల్ చేసిందని & దానిని తొలగించడం సాధ్యం కాదని కారు యజమాని చెప్పాడు. అయినప్పటికీ, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడని పేర్కొంటూ పోలీసులు ఆ కారుకు చలాన్ జారీ చేశారు. ఈ సంఘటన ఛండీఘర్‌లో జరిగినప్పటికీ, ట్రాఫిక్‌ రూల్స్‌ గురించి దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు తమకు తోచినట్లు స్పందిస్తున్నారు, అభిప్రాయాలు చెబుతున్నారు.

చట్టం ఏం చెబుతోంది?2012లో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం - భారతదేశంలోని ఏదైనా కారు కిటికీ లేదా అద్దంపై సన్‌షేడ్ లేదా టింట్ అమర్చుకుంటే, ఆ సన్‌షేడ్ లేదా టింట్ 'VLT' (విజిబుల్ లైట్ ట్రాన్స్‌మిషన్) ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే (అది కంపెనీ అమర్చినా లేదా కారు యజమాని/డ్రైవర్‌ సొంతంగా ఇన్‌స్టాల్ చేసుకున్నా), దానిని చట్టవిరుద్ధంగా పరిగణించాలి. ఆ కారుపై చట్టపరంగా చర్యలు (జరిమానా వంటివి) తీసుకోవచ్చు.

కంపెనీ అమర్చిన సన్‌షేడ్‌లు చెల్లుబాటు అవుతాయా, లేదా?ఇప్పుడు, Kia, Hyundai, Toyota వంటి చాలా కార్‌ కంపెనీలు తమ వాహనాలకు ఫ్యాక్టరీ-ఫిటెడ్‌ సన్‌షేడ్‌ లేదా గ్లాస్ టింట్‌ను స్టాండర్డ్‌ ఫీచర్‌గా అందిస్తున్నాయి. అయితే, కంపెనీ ఏర్పాటు చేసినంత మాత్రాన అవన్నీ చట్ట సమ్మతమే అని పరిగణించకూడదు. సాధారణంగా, కార్‌ కంపెనీలు ట్రాఫిక్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఉండే ఎలాంటి ఉపకరాణాలను బిగించవు. ఒకవేళ, కంపెనీ అమర్చిన సన్‌షేడ్‌ లేదా టింట్‌ 'VLT' ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే, దానిని చట్టవిరుద్ధమైదివిగా పరిగణించాలి. దీని అర్థం, అలాంటి సన్‌షేడ్‌ లేదా టింట్‌ను కంపెనీ ఇన్‌స్టాల్ చేసినప్పటికీ చలాన్ జారీ చేయవచ్చు.

అలాంటి పరిస్థితిలో ఇబ్బంది ఎందుకు వస్తుంది?ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ, ప్రతి పోలీసు వద్దా VLTని కొలిచే పరికరం (మీటర్) ఉండదు. ఈ కారణంగా, కారుకు 'కంపెనీ అమర్చిన సన్‌షేడ్' ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ పోలీసులు చలాన్ జారీ చేస్తున్నారు. దీనివల్ల సామాన్య పౌరులకు అనవసరమైన ఇబ్బందికి & గందరగోళానికి గురవుతున్నారు.

మీ కారుకు కూడా సన్‌షేడ్ లేదా టింట్‌ ఉంటే ఏం చేయాలి?మీ కారుకు కంపెనీ సన్‌షేడ్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే, ఆ సన్‌షేడ్‌ను కంపెనీ ఫ్యాక్టరీలో అమర్చిందని ధృవీకరించే కారు బిల్లు & వారంటీ పత్రాన్ని ఎప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. వీలైతే, VLT సర్టిఫికేట్‌ను మీ వద్ద ఉంచుకుని అవసరమైనప్పుడు ట్రాఫిక్ పోలీసులకు చూపించండి. అయినా మీ కారుపై చలాన్‌ రాస్తే స్థానిక ట్రాఫిక్ విభాగంలో లేదా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు.