Independence Day 2025: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన 5 లెజండరీ కార్లు - ఇవి లేకపోతే ఆటో ఇండస్ట్రీ కథ అసంపూర్ణం
Arun Kumar Veera | 15 Aug 2025 02:26 PM (IST)
Indian Auto Industry History: ఈ 5 కార్లు లేకుండా భారతదేశ ఆటో పరిశ్రమ కథ అసంపూర్ణంగా ఉంటుంది. అంబాసిడర్ నుంచి స్కార్పియో వరకు, ఈ కార్లు భారతీయుల హృదయాలను ఏలాయి.
భారతదేశాన్ని మార్చిన కార్లు
Top 5 Legendary Cars In India: స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించింది. అదే సమయంలో, రోడ్ల పరిస్థితిలోనూ పెద్ద మార్పు వచ్చింది. ఆటోమొబైల్ కంపెనీలు అనేక కార్లను పరిచయం చేశాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, మన దేశంలో చాలా కార్లు వచ్చాయి, పోయాయి. కానీ, కొన్ని వాహనాలు మాత్రం నిలిచిపోయాయి. అవి ప్రజలను రవాణా చేయడం మాత్రమే కాదు, అంతకుమించి, భారతదేశ ఆటో పరిశ్రమను కూడా మార్చాయి. ఈ కార్లు దేశ పురోగతి & మార్పునకు కూడా గుర్తింపుగా మారాయి.
స్వతంత్ర భారతదేశంలో 5 లెజండరీ కార్లు
హిందుస్తాన్ అంబాసిడర్ (1958)
1958లో వచ్చిన హిందూస్తాన్ అంబాసిడర్, ఆ కాలంలో ప్రభుత్వ కార్యాలయాలు, సీనియర్ అధికారులు & రాజకీయ నాయకుల మొదటి ఎంపిక. దీనిని సొంతం చేసుకోవడం ఒక స్టేటస్ సింబల్, గర్వకారణం. దాని డిజైన్, బలమైన బాడీ & పెద్ద క్యాబిన్ ఈ కారును చాలా ప్రత్యేకంగా నిలబెట్టాయి. కాలక్రమేణా దాని ఆకర్షణ తగ్గి, 2014లో ఉత్పత్తి ఆగిపోయినప్పటికీ, ఇది ఇప్పటికీ భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో 'రోడ్ క్వీన్'గా గుర్తుండిపోతుంది.
మారుతి 800 (1983)
1983లో లాంచ్ అయిన మారుతి 800 భారతీయ ఆటో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ కారు చాలా చవకగా, నడపడానికి సులభంగా & చాలా తక్కువ నిర్వహణ ఖర్చులతో ఉండేది. కారును సొంతం చేసుకోవాలనే లక్షలాది భారతీయుల కలను ఇది నెరవేర్చింది. ఇది దాదాపు 30 సంవత్సరాలు భారతీయ రోడ్లను ఏలింది & 2014లో ఉత్పత్తి ఆగిపోయింది. నేటికీ, ఇది ఒక భావోద్వేగ సంబంధంగా ప్రజల హృదయాల్లో ఉంది.
హ్యుందాయ్ శాంత్రో (1997)
కొరియన్ కంపెనీ హ్యుందాయ్ 1997లో శాంట్రోను లాంచ్ చేసింది, ఇది అతి తక్కువ కాలంలోనే ప్రతి కుటుంబానికి ఇష్టమైన కారుగా మారింది. కాంపాక్ట్ డిజైన్, ఎత్తైన రియర్ హెడ్‌రూమ్ & నమ్మకమైన పనితీరు హ్యాచ్‌బ్యాక్ విభాగంలో దీనిని అగ్రస్థానానికి తీసుకెళ్లాయి. హ్యుందాయ్ కంపెనీ శాంట్రోను చాలాసార్లు అప్‌డేట్ చేసి, రీరిలీజ్ చేసింది. ఈ కారణంగా, శాంత్రో చాలా ఏళ్ల పాటు ప్రజలకు ఇష్టసఖిలా తోడు నిలిచింది.
హోండా సిటీ (1998)
1998లో రోడ్లపైకి వచ్చిన హోండా సిటీ, భారత మార్కెట్లో ప్రీమియం సెడాన్ల ట్రెండ్‌ను సెట్ చేసింది. స్టైలిష్ డిజైన్, అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం & లగ్జరీ ఫీచర్లు 'ఈ కారు చాలా ప్రత్యేకం గురూ' అనేలా చేశాయి. ఇప్పటికి కూడా, సెడాన్ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన & నమ్మదగిన కార్లలో ఒకటిగా హోండా సిటీ సగర్వంగా తిరుగుతోంది.
మహీంద్రా స్కార్పియో (2002)
2002లో వచ్చిన మహీంద్రా స్కార్పియో భారతీయ SUV మార్కెట్లో పెను సంచలనం సృష్టించింది. దృఢమైన బాడీ డిజైన్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం & శక్తిమంతమైన ఇంజిన్ భారతీయులను బాగా ఆకర్షించాయి. శక్తికి & హోదాకు చిహ్నంగా ఇది నిలబడింది. మహీంద్రా కంపెనీ, స్కార్పియోలో కాలానికి తగ్గట్లుగా కొత్త వెర్షన్లను తీసుకువస్తోంది. ప్రస్తుతం, స్కార్పియో-N & స్కార్పియో క్లాసిక్ దీని తాజా వెర్షన్లు.