Charan Prabhas NTR: సౌత్ ఇండస్ట్రీ వరుస హిట్స్ తో దూసుకెళ్తుంటే..నార్త్ ఇండస్ట్రీ వరుస డిజాస్టర్స్ తో కొట్టుకుంటోంది. మధ్య మధ్యలో అడపా దడపా హిట్స్ వచ్చినా చెప్పుకోదగిన స్థాయిలో ఉండడం లేదు. అందుకే బాలీవుడ్ హీరోలంతా దక్షిణాది దర్శకులను నమ్ముకుంటున్నారు. అట్లీతో షారుక్ ఖాన్ జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకరిద్దరు కాదు బీటౌన్ హీరోలంతా సౌత్ దర్శకులను నమ్ముకుంటున్నారు. అయితే నేరుగా మూవీ చేస్తున్నారు లేదంటే సౌత్ మూవీస్ లో గెస్ట్ రోల్, నెగెటివ్ రోల్ చేసేందుకు అయినా ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరాది హీరోలకు దక్షిణాది దర్శకులు హిట్ ఇస్తే..మన హీరోలకు మాత్రం అక్కడి దర్శకులు డిజాస్టర్స్ ఇస్తున్నారు.
ఇక్కడ సరైన సక్సెస్ లేక తెలుగు హీరోలకు అక్కడకు వెళ్లడం లేదు..ఇక్కడ స్టార్ హీరోలుగా వెలుగుతున్న టైమ్ లో అక్కడ ప్రయోగాలు చేసి ఫెయిలవుతున్నారు. ఆయా దర్శకుల ట్రాక్ రికార్డ్ కూడా చూడకుండా ధైర్యంగా దూకేస్తున్నారు. అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్ చరణ్..అపూర్వ లఖియాతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా జంజీర్. 2013లో వచ్చిన జంజీర్ చరణ్ కెరీర్లోనే బ్యాడ్ మూవీగా నిలిచింది. ఆ టైమ్ లో చరణ్ ని ట్రోల్ చేస్తూ ముంబై మీడియాలో వరుస ఆర్టికల్స్ వచ్చాయ్. వాస్తవానికి ఆ మూవీలో చరణ్ తన క్యారెక్టర్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు ..సినిమా ఫ్లాప్ అవడానికి రామ చరణ్ కి సంబంధం లేదు..అక్కడ దర్శకుడి ఫెయిల్యూర్ ని చరణ్ అకౌంట్లో వేశారంతే.
పాన్ ఇండియా హీరోగా వెలుగుతున్న ప్రభాస్ మానియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాహుబలితో భారీ మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇదే పొరపాటు చేశాడు. టి సిరీస్ నిర్మాణ సంస్థ, తానాజీ లాంటి హిట్ తీసిన ఓం రౌత్ కాంబో చూసి రాముడిగా నటించేందుకు ఓకే చెప్పేశాడు. దారుణమైన VFX తో పాటూ టేకింగ్ సహా అన్ని విషయాల్లోనూ ఆదిపురుష్ ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. వసూళ్ల సంగతి పక్కనపెట్టేస్తే చివరకు ఓటీటీ, టీవీల్లోనూ ప్రేక్షకులు తిరస్కరించారు. ప్రభాస్ లాంటి హీరో, టాలీవుడ్ లో క్రేజీ దర్శకులంతా తన డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు..అలాంటప్పుడు బాలీవుడ్ దర్శకుడిని నమ్ముకుని అడుగేయడంతో డార్లింగ్ డిజాస్టర్స్ లో టాప్ లో నిలిచింది ఆదిపురుష్.
ఇప్పుడు వార్ 2 కూడ ఇంచుమించు ఇదే కోవకు చెందుతుంది. సినిమా డిజాస్టర్ కాదు..ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వస్తోంది. తారక్ క్రేజ్ తో కలెక్షన్లు కూడా అదిరాయ్. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో లేదన్నది ప్రేక్షకుల అభిప్రాయం. కాలర్ ఎగరేసి చెప్పిన తారక్, హృతిక్ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోవడంలో ఫెయిలయ్యారన్నది టాక్. RRRతో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ దేవరతో మరో హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ లాంటి దర్శకులు లైన్లో ఉన్నారు..ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ ఎంట్రీ అని ట్రై చేయడం అవసరమా అంటున్నారు నెటిజన్లు. పైగా బాలీవుడ్ స్వింగ్ లో ఉంటే సరే కానీ..అక్కడి హీరోలే తెలుగు దర్శకులను నమ్ముకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ వార్ 2 చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. పైగా వార్ ని హ్యాండిల్ చేసిన సిద్దార్థ్ ఆనంద్ కి కాకుండా అయాన్ ముఖర్జీకి ఇవ్వడం కూడా ఎఫెక్ట్ పడిందంటున్నారంతా.
ఈ మూడు సినిమాల్లోనూ హీరోల వైపు నుంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు.. కేవలం దర్శకుల తప్పులు, స్టార్ హీరోల ఫాలోయింగ్ ని గ్రాంటెడ్ గా తీసుకున్నట్టు కనిపిస్ోతంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్తరాది ట్రాప్ లో మన హీరోలకు పడకుండా ఉండడం మంచిది.