3-Cylinder Car Vs 4-Cylinder Car: కొత్త కారు కొనేవాళ్లు.. ఇంజిన్‌లో ఎన్ని సిలిండర్లు ఉన్నాయో కూడా గమనించాలి. ఇటీవల కొన్ని ప్రముఖ కార్లలో 4 సిలిండర్ల ఇంజిన్ స్థానంలో 3 సిలిండర్ల ఇంజిన్లు వస్తున్నాయి. 2024లో మారుతి సుజుకి స్విఫ్ట్ 4 సిలిండర్ల ఇంజిన్ నుంచి 3 సిలిండర్ల ఇంజిన్‌కు మారింది. 2026 అప్డేట్స్తో బలెనో, టయోటా గ్లాంజా కూడా ఇదే బాట పట్టాయి. దీంతో కారు కొనుగోలుదారుల్లో ఒక సందేహం మొదలైంది. మూడు సిలిండర్ల ఇంజిన్ ఉన్న కారు కొనడం మంచిదా? నాలుగు సిలిండర్ల ఇంజిన్ ఉన్న కారు మెరుగైనదా? మైలేజ్, పెర్ఫార్మెన్స్, వైబ్రేషన్స్ విషయంలో వీటి మధ్య తేడాలేంటి?.
3 సిలిండర్, 4 సిలిండర్ ఇంజిన్ల మధ్య తేడా ఏంటి?
ఇంజిన్‌లో ఉండే సిలిండర్ల సంఖ్యే వీటి మధ్య ప్రధాన తేడా. ప్రతి సిలిండర్‌లో ఒక పిస్టన్ ఉంటుంది. ఇది పైకి, కిందికి కదులుతూ ఇంధనాన్ని మండించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితోనే కారు ముందుకు కదులుతుంది. 3 సిలిండర్ ఇంజిన్‌లో మూడు పిస్టన్లు ఉంటాయి. 4 సిలిండర్ ఇంజిన్‌లో నాలుగు పిస్టన్లు ఉంటాయి. భారత మార్కెట్లో ఈ రెండు రకాల ఇంజిన్లతో కార్లు అందుబాటులో ఉన్నాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్, బలెనో, టయోటా గ్లాంజా ప్రస్తుతం 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్లతో వస్తున్నాయి. టాటా టియాగోలోనూ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది.
హ్యుందాయ్ ఎక్స్టర్లో 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా 1.5 లీటర్ వేరియంట్లలోనూ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది.
అయితే సిలిండర్ల సంఖ్యను బట్టి ఇంజిన్ పవర్ లేదా మైలేజ్‌ను నిర్ణయించలేం. ఇంజిన్ సామర్థ్యం, ట్యూనింగ్, టర్బోచార్జింగ్, కారు బరువు, గేర్‌బాక్స్ వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చదవండి: ప్రయాణానికి 'సేఫెస్ట్ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మైలేజ్ విషయంలో ఏ ఇంజిన్ మెరుగు?
3 సిలిండర్ ఇంజిన్ల వైపు కార్ల కంపెనీలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాల్లో మెరుగైన ఇంధన సామర్థ్యం ఒకటి. ఒక సిలిండర్ తక్కువగా ఉండటంతో కదిలే భాగాలు తగ్గుతాయి. అంతర్గత ఘర్షణ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న కార్లలో ఇది ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అయితే 3 సిలిండర్ ఇంజిన్ ఉంటే తప్పనిసరిగా ఎక్కువ మైలేజ్ వస్తుందని అనుకోవద్దు. ఇంజిన్ డిజైన్, ట్యూనింగ్, కారు బరువు, డ్రైవింగ్ విధానం వంటి అంశాలపై కూడా మైలేజ్ ఆధారపడి ఉంటుంది.
2026 మారుతి సుజుకి బలెనో దీనికి ఓ ఉదాహరణ. కొత్త 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్‌తో మాన్యువల్ వేరియంట్ లీటరుకు 23.80 కిలోమీటర్లు, AMT వేరియంట్ 24.77 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. గతంలో వచ్చిన 4 సిలిండర్ వెర్షన్ మాన్యువల్‌లో 22.35 కిలోమీటర్లు, AMTలో 22.94 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేది. అంటే కొత్త ఇంజిన్‌లో క్లెయిమ్డ్ మైలేజ్ పెరిగింది. అయితే పవర్ మాత్రం కొంత తగ్గింది.
అదే సమయంలో, 4 సిలిండర్ ఇంజిన్లు కూడా మంచి మైలేజ్ ఇవ్వగలవు. హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి కార్లు ఇందుకు ఉదాహరణ. కాబట్టి మైలేజ్ విషయంలో సిలిండర్ల సంఖ్య ఒక్కటే ప్రామాణికం కాదు.
పెర్ఫార్మెన్స్లో ఏది మెరుగ్గా ఉంటుంది?
ఇంజిన్‌లో ఎన్ని సిలిండర్లు ఉన్నాయన్నదానికంటే అది ఎంత పవర్, ఎంత టార్క్ ఉత్పత్తి చేస్తుందన్నది ముఖ్యం. అలాగే ఆ శక్తిని ఎలా అందిస్తుందన్నదీ కీలకమే. సాధారణంగా, నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) 3 సిలిండర్ ఇంజిన్ నగర ప్రయాణాల్లో చురుగ్గా అనిపించవచ్చు. అయితే వేగంగా యాక్సిలరేట్ చేసినప్పుడు లేదా కారులో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నప్పుడు కొంత ఒత్తిడికి గురైనట్లు అనిపించవచ్చు.
4 సిలిండర్ ఇంజిన్ సాధారణంగా మరింత స్మూత్‌గా పవర్ అందిస్తుంది. ముఖ్యంగా యాక్సిలరేషన్, హైవే ప్రయాణాల్లో డ్రైవింగ్ అనుభవం సౌకర్యంగా ఉండొచ్చు. అయితే ఇది కూడా ఇంజిన్ సామర్థ్యం, ట్యూనింగ్పై ఆధారపడి ఉంటుంది.
ప్రతి 3 సిలిండర్ ఇంజిన్ తక్కువ పవర్ ఇస్తుందని, ప్రతి 4 సిలిండర్ ఇంజిన్ వేగంగా ఉంటుందని భావించకూడదు. కొన్ని కంపెనీలు చిన్న 3 సిలిండర్ ఇంజిన్లకు టర్బోచార్జర్ జోడించి పవర్, టార్క్ పెంచుతున్నాయి. టర్బోచార్జ్డ్ 3 సిలిండర్ ఇంజిన్.. పెద్ద సామర్థ్యం లేని నేచురల్లీ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజిన్ కంటే ఎక్కువ పవర్ ఇవ్వగలదు.
ఇది కూడా చదవండి: విన్‌ఫాస్ట్ నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. భారతీయుల కోసమే ప్రత్యేకంగా తయారీ!
వైబ్రేషన్స్, స్మూత్నెస్లో తేడా
డ్రైవింగ్ సమయంలో ఎక్కువమంది గుర్తించే తేడా ఇదే. 3 సిలిండర్ ఇంజిన్‌లో కదిలే భాగాల సమతుల్యత 4 సిలిండర్ ఇంజిన్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. 3 సిలిండర్ ఇంజిన్‌లో ఫైరింగ్ ఈవెంట్స్ 240 డిగ్రీల వ్యవధిలో జరుగుతాయి. 4 సిలిండర్ ఇంజిన్‌లో ఇవి 180 డిగ్రీల వ్యవధిలో ఉంటాయి.
దీంతో.. ఇంజిన్ ఐడిల్లో ఉన్నప్పుడు లేదా తక్కువ వేగంతో నడుస్తున్నప్పుడు 3 సిలిండర్ ఇంజిన్‌లో వైబ్రేషన్స్ ఎక్కువగా ఉండొచ్చు. కారు ఆగి ఉన్నప్పుడు స్టీరింగ్ వీల్, పెడల్స్ లేదా క్యాబిన్లో స్వల్పంగా కంపనాలు కనిపించవచ్చు. వేగంగా యాక్సిలరేట్ చేసినప్పుడు కూడా ఇంజిన్ శబ్దం కూడా కొంత ఎక్కువగా అనిపించవచ్చు.
4 సిలిండర్ ఇంజిన్‌లో ఫైరింగ్ క్రమం మరింత బ్యాలెన్స్డ్గా ఉండటం వల్ల సాధారణంగా వైబ్రేషన్స్ తక్కువగా ఉంటాయి. అందుకే స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునేవారికి ఇవి మంచి ఎంపిక కావచ్చు.
అయితే, ఆధునిక 3 సిలిండర్ ఇంజిన్లు గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాయి. వైబ్రేషన్స్ తగ్గించేందుకు కంపెనీలు ఇంజిన్ మౌంట్స్, బ్యాలెన్స్ షాఫ్ట్స్ వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. మంచి ఇంజినీరింగ్ ఉన్న కార్లలో సాధారణ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ తేడా పెద్దగా కనిపించకపోవచ్చు.
ఇది కూడా చదవండి: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!
ఫ్యామిలీ కారుకు ఏ ఇంజిన్ ఎంచుకోవాలి?
మీరు ఎక్కువగా నగరంలోనే కారు నడుపుతుంటే, మంచి మైలేజ్ కోరుకుంటే 3 సిలిండర్ ఇంజిన్ ఉన్న కారు సరైన ఎంపిక కావచ్చు. మారుతి స్విఫ్ట్, బాలెనో, టయోటా గ్లాంజా, టాటా టియాగో వంటి కార్లు ఈ ఇంజిన్ లేఅవుట్‌తో అందుబాటులో ఉన్నాయి.
హైవేలపై తరచూ ప్రయాణిస్తుంటే లేదా స్మూత్ డ్రైవింగ్ అనుభవం కావాలనుకుంటే 4 సిలిండర్ ఇంజిన్ ఉన్న కారును పరిశీలించవచ్చు. హ్యుందాయ్ ఎక్స్టర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి కార్లలో 4 సిలిండర్ పెట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి.
కేవలం మూడు సిలిండర్లు ఉన్నాయనే కారణంతో కారును పక్కన పెట్టకండి. వీలైతే రెండు రకాల ఇంజిన్లు ఉన్న కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి, ఇంజిన్ పనితీరు మీకు ఎలా అనిపిస్తుందో చూసి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా.. ఇంజిన్ ఐడిల్లో ఉన్నప్పుడు వచ్చే శబ్దం, తక్కువ గేర్లలో/తక్కువ వేగంలో యాక్సిలరేషన్, AC ఆన్ చేసినప్పుడు కారు పనితీరును గమనించండి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
