VinFast Made-for-India Electric Scooters: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లో మరింత స్ట్రాంగ్‌గా పాతుకుపోయే ప్రయత్నాల్లో ఉంది. గత ఏడాది చివర్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చిన ఈ కంపెనీ.. ఇక టూ వీలర్ విభాగంలోకి అడుగుపెట్టనుంది. మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను వచ్చే ఏడాది భారతదేశంలో విడుదల చేయాలని భావిస్తోంది.

Continues below advertisement

విన్‌ఫాస్ట్ ప్రస్తుతం వియత్నాంలో విక్రయిస్తున్న Evo, Kyo, Kinet మోడళ్ల ఆధారంగా ఈ స్కూటర్లను అభివృద్ధి చేయనుంది. అయితే అక్కడి మోడళ్లను యథాతథంగా భారత్‌కు తీసుకురావడం లేదు. భారత రోడ్లు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఛాసిస్, డిజైన్ సహా చాలా అంశాల్లో మార్పులు చేయనుంది. అంటే, భారత్‌ కోసమే ప్రత్యేక మార్పులు చేయనుంది. ఇండియా వెర్షన్ల పేర్లు కూడా మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

మూడు స్కూటర్లలోనూ హబ్ మౌంటెడ్ మోటార్లను ఉపయోగించనున్నారు. అయితే ఒక్కో మోడల్‌లో ఒక్కో స్థాయి పనితీరు ఉండనుంది. భారత వెర్షన్లలో మోటార్ పనితీరులోనూ మార్పులు ఉండొచ్చు. రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఛాసిస్‌ను రూపొందిస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ పెంచడంతో పాటు, సీటు కింద లగేజ్ పెట్టుకునే స్థలాన్ని కూడా పెంచే చేసే అవకాశం ఉంది. ఈ మూడు స్కూటర్లనూ భారత్‌లోనే తయారు చేయనున్నారు.

Continues below advertisement

VinFast Evo: తక్కువ ధరలో అందుబాటులోకి?

ఈ మూడు మోడళ్లలో Evo ఇ-స్కూటర్‌ బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటుంది. వియత్నాం వెర్షన్‌లో రెండు రిమూవబుల్ బ్యాటరీలు ఉన్నాయి. ఇందులో 1.5kWh సామర్థ్యం గల LFP బ్యాటరీ స్టాండర్డ్‌గా వస్తుంది. అదనంగా మరో 1.5kWh బ్యాటరీని ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. అయితే భారత్‌లోనూ ఇదే బ్యాటరీ సామర్థ్యాలను అందిస్తారా అనేది విన్‌ఫాస్ట్ ఇంకా వెల్లడించలేదు.

ఈ స్కూటర్‌లోని హబ్ మోటార్ గరిష్ఠంగా 2.45kW పవర్‌ను అందిస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 16 సెకన్లు పడుతుంది.

రెండు బ్యాటరీలతో కలిపి సీటు కింద 12 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది. LCD డిస్‌ప్లే, ముందు డిస్క్ బ్రేక్, రెండు వైపులా 12 అంగుళాల వీల్స్ ఉన్నాయి. మొబైల్ యాప్ ద్వారా వెహికల్ ట్రాకింగ్, ట్రిప్ వివరాలను తెలుసుకోవచ్చు.

వియత్నాంలో ఈ స్కూటర్ ప్రారంభ ధర VND 18.8 మిలియన్లు. భారత కరెన్సీలో సుమారు రూ.68,349. Evo Grand, Evo Grand II, Evo Premiere, Evo Grand Limited పేర్లతో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో టాప్ వేరియంట్ ధర VND 29.9 మిలియన్లు. అంటే సుమారు రూ.1.08 లక్షలు.

ఇది కూడా చదవండి: మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!

VinFast Kyo: ఎక్కువ ఫీచర్లు, మెరుగైన స్టోరేజ్

Kyo స్కూటర్‌లోనూ Evo మాదిరిగానే బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. అయితే ఇందులో మరికొంచెం శక్తిమంతమైన 3kW హబ్ మోటార్‌ను అందించారు. దీని క్లెయిమ్డ్ రేంజ్ 160 కిలోమీటర్లు. రెండు బ్యాటరీలను 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల 30 నిమిషాలు పడుతుందని కంపెనీ చెబుతోంది.

ఈ మోడల్‌లో 14 అంగుళాల వీల్స్ ఉంటాయి. సీటు కింద స్టోరేజ్ సామర్థ్యం 21 లీటర్లకు పెరిగింది. LCD స్థానంలో TFT డిస్‌ప్లే ఇచ్చారు. కీ లెస్ ఫంక్షన్, హిల్ హోల్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. Evoలోని ఇతర ఫీచర్లను ఇందులో కొనసాగించారు. వియత్నాంలో Kyo ధర VND 30 మిలియన్లు. భారత కరెన్సీలో సుమారు రూ.1.09 లక్షలు.

VinFast Kinet: స్పోర్టీ లుక్, ఎక్కువ పవర్

ఈ మూడు స్కూటర్లలో Kinet స్పోర్టీ మోడల్‌గా నిలవనుంది. Kyoలో ఉన్న బ్యాటరీ సామర్థ్యం, 14 అంగుళాల వీల్స్, ఫీచర్లను ఇందులోనూ అందించారు. అయితే మరింత స్పోర్టీ డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్‌ 5.2kW హబ్ మోటార్‌ను అమర్చారు.

దీంతో దీని గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లకు చేరుతుంది. 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని ఆరు సెకన్లలోపే అందుకుంటుంది. అయితే ఎక్కువ పనితీరు కారణంగా రేంజ్ 145 కిలోమీటర్లకు తగ్గింది. 0 నుంచి 100 శాతం ఛార్జింగ్‌కు తొమ్మిది గంటలు పడుతుంది. Kyoతో పోలిస్తే సీటు కింద స్టోరేజ్ కొంచెం ఎక్కువగా 22 లీటర్లు ఉంది. వియత్నాంలో దీని ధర VND 40 మిలియన్లు. అంటే సుమారు రూ.1.45 లక్షలు.

ఇది కూడా చదవండి: హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?

 భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారీ

గతంలో భారత్‌లోకి Evo మోడల్ మాత్రమే వస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు Kyo, Kinet మోడళ్లను కూడా భారత్‌ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు స్కూటర్లు ప్రస్తుతం వియత్నాంలో ఉన్న రూపంలోనే భారత్‌కు రావు. భారతీయుల అవసరాలకు తగ్గట్లు మార్పులు చేసిన తర్వాతే ఇండియాలోకి తీసుకురానున్నారు. భారత్‌లో వీటి లాంచ్‌కు సంబంధించి ఖచ్చితమైన తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 

ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో TVS iQube, Orbiter, Ather, Chetak వంటి మోడళ్లు ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.