Bajaj Pulsar 180 Stopped: భారత మార్కెట్లో పల్సర్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా పాతతరం బైక్ ప్రియుల్లో పల్సర్ 180కి మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ మోడల్‌కు మరోసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. బజాజ్ ఆటో తన అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పల్సర్ 180ని తొలగించింది. దీంతో ఈ బైక్‌ను కంపెనీ నిలిపివేసినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2022లో నిలిపివేసిన ఈ బైక్‌ను బజాజ్ మళ్లీ 2025 ఏప్రిల్‌లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. తిరిగి లాంచ్ చేసిన ఆరు నెలలు కూడా పూర్తికాకముందే మరోసారి ఉత్పత్తి నిలిపివేత దిశగా అడుగులు పడినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

- 2022లో నిలిపివేసిన పల్సర్ 180ని 2025 ఏప్రిల్‌లో తిరిగి లాంచ్ చేశారు.- ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ బైక్ కనిపించడం లేదు. అయితే డీలర్ల వద్ద ఉన్న స్టాక్ విక్రయాలు కొనసాగవచ్చు.- పల్సర్ 125, 150 మోడళ్ల తరహాలో పల్సర్ 180కి భారీ అప్‌డేట్ వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవా?

Continues below advertisement

బజాజ్ ఆటో, ఆశించిన అమ్మకాలు సాధించని మోడళ్లను నిలిపివేసిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఇటీవల N125 మోడల్‌ను కూడా కంపెనీ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఇప్పుడు క్లాసిక్ పల్సర్ 180 విషయంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

బజాజ్, KTM అధికారిక వెబ్‌సైట్లకు ఇటీవల కొత్త రూపు ఇచ్చారు. ఈ అప్‌డేట్ తర్వాత పల్సర్ మోడళ్లను పరిశీలిస్తే.. Original విభాగంలో పల్సర్ 125, పల్సర్ 150, పల్సర్ 220F కనిపిస్తున్నాయి. కానీ పల్సర్ 180 మాత్రం కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి: Bajaj Pulsar N250 SS ఫస్ట్ రైడ్ రివ్యూ: పవర్, టెక్నాలజీ.. కొత్త అప్‌డేట్స్‌తో ఈ బండి మరింత స్పెషల్!

2025 ఏప్రిల్‌లో పల్సర్ 180ను తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు.. TVS Apache RTR 180కి పోటీగా ఈ మోడల్‌ను రీలాంచ్‌ చేసినట్లు భావించారు. ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలు చూస్తే, బజాజ్ ఆశించిన స్థాయిలో ఈ బైక్‌ విక్రయాలు సాగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై బజాజ్ ఆటోను సంప్రదించినప్పటికీ, కంపెనీ నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు. కాబట్టి నిలిపివేతపై కంపెనీ స్పష్టమైన ప్రకటన చేసినట్లు చెప్పలేం. 

పల్సర్ 125, 150కు అప్‌డేట్స్.. 180కు మాత్రం?

బజాజ్ ఇటీవల పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లలో గణనీయమైన మార్పులు చేసింది. 2025 ఆగస్టులో వాటి ప్లాట్‌ఫామ్, ఇంజిన్‌కు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్స్ తీసుకొచ్చింది. అయితే పల్సర్ 180కు కూడా ఇలాంటి సమగ్ర మార్పులు చేసే ఉద్దేశం కంపెనీకి ప్రస్తుతం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ బైక్ కొనాలనుకునేవారికి ఒక అవకాశం ఉంది. సమీపంలోని బజాజ్ డీలర్‌షిప్‌లలో మిగిలిన స్టాక్ ఉండవచ్చు, ఆ స్టాక్ ఉన్నంతవరకు కొనుగోలు చేయవచ్చు.

బజాజ్ పల్సర్ 180 ఇంజిన్, ధర వివరాలు

ప్రస్తుతం విక్రయించిన పల్సర్ 180లో 178.6cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8,500rpm వద్ద 17hp పవర్, 6,500rpm వద్ద 15Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు.

ఈ బైక్ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.22 లక్షలు. TVS Apache RTR 180తో పోలిస్తే ఇది రూ.4,000 తక్కువ ధరకు లభించింది.

ఇది కూడా చదవండి: రూ.15 వేలల్లోనే పూర్తి రైడింగ్ గేర్.. CE Level 2 ఆర్మర్ అంటే ఏమిటి?

పల్సర్ 180 మళ్లీ వస్తుందా?

బజాజ్, గతంలో నిలిపివేసిన మోడళ్లను తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. పల్సర్ 180ని కూడా 2022లో నిలిపివేసి, 2025 ఏప్రిల్‌లో మళ్లీ లాంచ్ చేసింది. భవిష్యత్తులో ఈ బైక్‌కు లేదా ఇలాంటి మోడల్‌కు తగినంత డిమాండ్ ఉంటే కంపెనీ మరోసారి తీసుకొచ్చే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.