Affordable Riding Jackets: బైక్ కొనుగోలు చేసినప్పుడు చాలామంది హెల్మెట్‌తోనే తమ రైడింగ్ సేఫ్టీ పూర్తయిందని భావిస్తారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు చేతులు, భుజాలు, మోచేతులు, వెన్నెముక, కాళ్లకు కూడా గాయాలయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సిటీ రోడ్లపై తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నా.. బైక్ అదుపు తప్పితే రోడ్డుపై జారిపడే అవకాశం ఉంటుంది. అప్పుడు సాధారణ దుస్తులు శరీరాన్ని రక్షించలేవు.

Continues below advertisement

రైడింగ్ గేర్ కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సిందేనని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కొన్ని బ్రాండ్లలో రూ.15 000 లోపే జాకెట్, గ్లౌజులు, రైడింగ్ షూస్ లేదా బూట్లతో కూడిన మూడు భాగాల సేఫ్టీ కిట్‌ను సిద్ధం చేసుకోవచ్చు. అయితే, ధర కంటే ముందు వాటిలో ఉండే రక్షణ ప్రమాణాలను తెలుసుకోవడం ముఖ్యం.

 CE Level 2 ఆర్మర్ అంటే ఏమిటి?

Continues below advertisement

రైడింగ్ జాకెట్లు, ప్యాంట్లు కొనేటప్పుడు CE Certified Armour అనే పదం కనిపిస్తుంది. CE అంటే Conformité Européenne. యూరప్‌లో నిర్దేశించిన భద్రతా పరీక్షల్లో ఆ రక్షణ ప్యాడ్లు ఉత్తీర్ణత సాధించాయని దీని అర్థం. బైక్ రైడింగ్ గేర్‌లో ప్రధానంగా రెండు ప్రమాణాలు ఉపయోగిస్తారు.

EN 1621-1 ప్రమాణం భుజాలు, మోచేతులు, మోకాళ్లు, తుంటి భాగాలకు ఉపయోగించే రక్షణ ప్యాడ్లను పరీక్షిస్తుంది. EN 1621-2 వెన్నెముకకు ఉపయోగించే బ్యాక్ ప్రొటెక్టర్లకు వర్తిస్తుంది.

ఈ పరీక్షల్లో ప్యాడ్‌పై 50 జౌల్స్ శక్తితో దెబ్బ పడేలా చేస్తారు. ఆ ప్రభావంలో ఎంత బలం శరీరానికి చేరుతుందో కొలుస్తారు. ఈ బలాన్ని కిలోన్యూటన్స్‌ (kN)లో లెక్కిస్తారు. ఈ సంఖ్య ఎంత తక్కువగా ఉంటే అంత మెరుగ్గా దెబ్బ తీవ్రతను తగ్గించినట్లు.

 CE Level 1, Level 2 మధ్య తేడా

లింబ్ ప్రొటెక్టర్ల విషయంలో CE Level 1 గరిష్ఠ సగటు బలాన్ని 35 kN వరకు అనుమతిస్తుంది. అదే CE Level 2లో అది 20 kN కంటే తక్కువగా ఉండాలి. అంటే Level 2 ప్యాడ్లు మరింత మెరుగైనవి.

బ్యాక్ ప్రొటెక్టర్లలో Level 1 పరిమితి 18 kN కాగా, Level 2 పరిమితి 9 kN. అంటే వెన్నెముకకు చేరే ప్రభావాన్ని సగానికి సగం తగ్గించే స్థాయిలో Level 2 రక్షణ పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

జాకెట్‌లో ఆర్మర్ ఒక్కటే సరిపోదు

ప్యాడ్లు ఎముకలకు తగిలే దెబ్బను తగ్గిస్తాయి. కానీ రోడ్డుపై జారినప్పుడు చర్మం గాయపడకుండా కాపాడేది జాకెట్ బయటి వస్త్రం. అందుకే జాకెట్‌కు EN 17092 గార్మెంట్ సర్టిఫికేషన్ ఉందో లేదో చూడాలి. Class A జాకెట్లు నగర ప్రయాణాలకు, తక్కువ వేగపు రైడింగ్‌కు అనుకూలం. వీటిలో గాలి బాగా ప్రసరించే మెష్ వస్త్రం ఉంటుంది. Class AA జాకెట్లు హైవే ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉంటాయి. వీటిలో బలమైన వస్త్రాలు, అదనపు కుట్టు బలం ఉంటాయి. Class AAA సాధారణంగా రేసింగ్ కోసం రూపొందించే లెదర్ గేర్‌లో కనిపిస్తుంది.

 రూ.15,000 బడ్జెట్‌ను ఎలా విభజించాలి?

ఈ బడ్జెట్‌లో జాకెట్‌కు రూ.5,900 నుంచి రూ.6,350 వరకు, గ్లౌజులకు రూ.2,100 నుంచి రూ.2,650 వరకు, రైడింగ్ షూస్ లేదా బూట్లకు రూ.5,300 నుంచి రూ.6,000 వరకు కేటాయించవచ్చు. మొత్తం ఖర్చు సుమారు రూ.13,300 నుంచి రూ.15,000 మధ్య ఉంటుంది.

 రైడింగ్ జాకెట్లు

Rynox Cypher GT 2 ధర సుమారు రూ.5,950. ఛాతీ, చేతులు, వెనుక భాగాల్లో 3D మెష్ ప్యానెల్స్ ఉండటంతో గాలి ప్రసరణకు అనుకూలంగా ఉంటుంది. కీలక భాగాల్లో 600D PU కోటెడ్ పాలిస్టర్ వస్త్రాన్ని ఉపయోగించారు. భుజాలు, మోచేతులు, వెన్ను భాగాలకు CE Level 2 రక్షణ ప్యాడ్లు అందించడం దీని ప్రత్యేకత. నగర ప్రయాణాలు, వారాంతపు రైడ్లకు ఇది సరైన ఎంపికగా ఉంటుంది.

Axor Cruise 2 ధర సుమారు రూ.5,912. భుజాలు, చేతుల బయటి భాగాల్లో బలమైన 600D వస్త్రం ఉంటుంది. శరీరానికి గాలి అందేలా వెంటిలేషన్ ప్యానెల్స్ ఇచ్చారు. భుజాలు, మోచేతులకు CE Level 2 ప్రొటెక్టర్లు ఉంటాయి. నడుము, చేతుల వద్ద సర్దుబాటు పట్టీలు ఉండటంతో జాకెట్‌ను శరీరానికి సరిపోయేలా ధరించవచ్చు. రాత్రి వేళల్లో కనిపించేలా రిఫ్లెక్టివ్ భాగాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 3 సెకన్లలో 100km స్పీడ్‌, 670km రేంజ్‌, 1156hp పవర్‌.. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మరో సంచలనం!

 రైడింగ్ గ్లౌజులు

Rynox Helium GT 2 ధర సుమారు రూ.2,150. ప్రమాద సమయంలో చాలామంది సహజంగానే చేతులను ముందుకు చాపి నేలను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో చేతులకు రక్షణ అవసరం. ఈ గ్లౌజుల్లో TPR నకిల్ గార్డ్, మణికట్టు దగ్గర కార్పస్ బోన్ ప్రొటెక్టర్, అరచేతి భాగంలో రాపిడిని తట్టుకునే వస్త్రం ఉన్నాయి. గాలి ప్రసరణకు మెష్ కూడా అందించారు.

Solace Vento V2 ధర సుమారు రూ.2,650. చేతి పైభాగంలో 3D ఎయిర్ మెష్, అరచేతి భాగంలో బలమైన సింథటిక్ లెదర్ ఉపయోగించారు. TPR నకిల్ గార్డ్‌తో పాటు అరచేతికి అబ్రేషన్ రెసిస్టెంట్ స్లైడర్ ఉంది. చిటికెన వేలు దగ్గర అదనపు కుట్టు బలం ఇచ్చారు. డ్యూయల్ స్పోర్ట్ రైడింగ్ చేసే వారికి ఇది ఉపయోగపడుతుంది.

 రైడింగ్ షూస్, బూట్లు

Clan Scout D3O ధర సుమారు రూ.5,399. సాధారణ హైటాప్ షూస్‌లా కనిపించినా, బైక్ రైడింగ్ కోసం అవసరమైన రక్షణ లక్షణాలు ఇందులో ఉన్నాయి. D3O అనే ప్రత్యేక పదార్థం నడిచేటప్పుడు మృదువుగా ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు మాత్రం గట్టిపడి ప్రభావ శక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. షూ సోల్‌లో బలమైన కాంపోజిట్ షాంక్ ఉండటం వల్ల పాదం పక్కకు నలిగే ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. మడమ, వేళ్ల భాగాల్లోనూ గట్టి రక్షణ కల్పించారు.

Cramster Flux బూట్ల ధర సుమారు రూ.5,999. హైవే ప్రయాణాలు, వర్షాకాల రైడ్లకు ఇవి ఉపయోగపడతాయి. ఆయిల్ నిరోధకత, మంచి గ్రిప్ ఉన్న రబ్బర్ సోల్‌తో పాటు స్టీల్ షాంక్ అందించారు. మడమ, చీలమండ, కాలి కింది భాగానికి గట్టి రక్షణ ప్యానెల్స్ ఉన్నాయి. గేర్ మార్చేందుకు ఎడమ బూటుపై ప్రత్యేక ప్యాడ్ కూడా ఇచ్చారు.

 ఏ కిట్ కొనడం మంచిది?

నగర ప్రయాణాలు, వారాంతపు రైడ్ల కోసం Rynox Cypher GT 2 జాకెట్, Rynox Helium GT 2 గ్లౌజులు, Clan Scout D3O షూస్ కలిపి కొనుగోలు చేస్తే మొత్తం సుమారు రూ.13,499 అవుతుంది.

ఎక్కువగా హైవే ప్రయాణాలు చేసేవారు Axor Cruise 2 జాకెట్, Solace Vento V2 గ్లౌజులు, Cramster Flux బూట్లను ఎంచుకోవచ్చు. ఈ మూడు కలిపి సుమారు రూ.14,561 ఖర్చవుతుంది.

మొత్తానికి రైడింగ్ గేర్ కొనేటప్పుడు ధరతో పాటు సరైన సర్టిఫికేషన్, శరీరానికి సరిపోయే ఫిట్, రక్షణ ప్యాడ్ల నాణ్యతను పరిశీలించాలి. ముఖ్యంగా మోచేతి, భుజం ప్యాడ్లు కదలకుండా సరైన స్థానంలో ఉండాలి. ఈ ధరలు అంచనా మాత్రమే. బ్రాండ్ల ధరల మార్పులు, విక్రేతను బట్టి మారవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.