Vehicle fitness test Telangana: తెలంగాణలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల విధానం పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు, రవాణా శాఖ అధికారులు వాహనాలను మాన్యువల్‌గా పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఈ విధానానికి క్రమంగా ముగింపు పలకాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల సామర్థ్యాన్ని యంత్రాల ద్వారా మాత్రమే పరీక్షించే విధానాన్ని తీసుకురానుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో 15 చోట్ల వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కేంద్రాల్లో వాహనాల ఫిట్‌నెస్‌ను శాస్త్రీయ పద్ధతిలో పరీక్షిస్తారు. పరీక్షల కోసం సెన్సర్లు, ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు.
కారు నుంచి లారీ వరకు..లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలతో పాటు మధ్యతరహా వాహనాలు కూడా ఈ పరీక్షలకు హాజరుకావాలి. కార్లు, జీపులు వంటి తేలికపాటి వాహనాలకూ ఈ విధానం వర్తిస్తుంది. వాహనం రోడ్డుపై సురక్షితంగా తిరిగే స్థితిలో ఉందా లేదా అనేది పరికరాల ద్వారా నిర్ధారిస్తారు.
ఇప్పటివరకు MVIల పర్యవేక్షణలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు జరిగేవి. కొన్ని సందర్భాల్లో వాహనాన్ని పైపైన పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (FC) జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాహనాల అసలు పరిస్థితి పూర్తిగా తెలియకుండా పోతోంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల విషయంలో దళారుల ప్రమేయం, అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
సెన్సర్లతో పరీక్షకొత్త విధానంతో ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల బ్రేక్‌ల పనితీరు, ఇంజిన్ సామర్థ్యం, కాలుష్య ఉద్గారాలు & ఇతర కీలక అంశాలను సెన్సర్లతో పరీక్షిస్తారు. పరీక్షలో వచ్చిన ఫలితాలు నేరుగా వాహన్ పోర్టల్‌లో నమోదవుతాయి.
దీంతో ఫిట్‌నెస్ పరీక్షల్లో మానవ జోక్యం తగ్గుతుంది. ఫలితాలు డిజిటల్‌గా నమోదు కావడంతో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది. వాహనం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. దీంతో రోడ్డుపై తిరిగే వాహనాల భద్రత మెరుగుపడే అవకాశం ఉంది. ప్రమాదాలను తగ్గించడంలోనూ ఈ విధానం కీలకంగా మారవచ్చు.
రాష్ట్రంలో మొత్తం 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే తొలి దశలో 15 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డీటీసీ, ఆర్టీవో కార్యాలయాల పరిధిలోని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: నిస్సాన్ గ్రావైట్ CNG రియల్ మైలేజ్ టెస్ట్.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
ఎక్కడెక్కడ..తొలి క్లస్టర్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హనుమకొండ & సంగారెడ్డిలోని డీటీసీ కార్యాలయాల పరిధిలో కేంద్రాలు వస్తాయి. మేడ్చల్, దుండిగల్-1, దుండిగల్-2 ప్రాంతాల్లోని ఆర్టీవో కార్యాలయాల పరిధిలోనూ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ క్లస్టర్‌కు సుమారు రూ.61.60 కోట్ల వ్యయం అంచనా వేశారు.
రెండో క్లస్టర్‌లో ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇబ్రహీంపట్నం, కొండాపూర్, నాగోల్ & పటాన్‌చెరు ప్రాంతాల్లోనూ ఆటోమేటెడ్ పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్లస్టర్‌కు సుమారు రూ.53.68 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
టెండర్ల ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రాలు అందుబాటులోకి వస్తే వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల్లో కీలక మార్పు రానుంది. ముఖ్యంగా వాణిజ్య వాహనాల విషయంలో ఈ విధానం రోడ్డు భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
