Prashant Kishor BJP proxy debate:   కేంద్రంలో భారతీయ జనతా పార్టీ  నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలో పగ్గాలు చేపట్టిన తర్వాత, దేశ రాజకీయ సమీకరణాల్లోనూ ,  ప్రజా పోరాటాల సరళిలోనూ స్పష్టమైన, అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. 2014, 2019 నాటి సంపూర్ణ మెజారిటీ రోజులకు భిన్నంగా, ప్రస్తుతం బీజేపీ సొంత బలానికి తోడు మిత్రపక్షాలపై ఆధారపడటం ఒకటైతే, మరోవైపు వీధుల్లో మొదలవుతున్న ప్రజా ఉద్యమాలు, రాజకీయ వ్యూహకర్తల ప్రత్యక్ష పొలిటికల్ ఎంట్రీలు అధికార పక్షానికి సరికొత్త సవాళ్లను విసురుతున్నాయి. 

Continues below advertisement

రాజకీయ రహిత పోరాటాల కొత్త రూపు 

గతంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు లేదా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, బంద్‌లు జరిగేవి. కానీ, మూడో విడత బీజేపీ పాలనలో జెన్ జీ యువత ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమాలు ఏ పార్టీ జెండా లేకుండా, సోషల్ మీడియా వేదికగా  బ్లాస్ట్ అవుతున్నాయి.  జాతీయ స్థాయి పోటీ పరీక్షల లోపాలు పై డిజిటల్ వేదికల నుంచి మొదలై జంతర్ మంతర్ వీధుల వరకు వెళ్లిన కాక్రోచ్ జంతా పార్టీ, జెన్ జీ ఉద్యమాలు  ఇందుకు బలమైన ఉదాహరణ. జాతీయ ఛానెళ్లను పక్కనపెట్టి మీమ్‌లు, డార్క్ హ్యూమర్, జెన్ జీ స్లాంగ్‌లతో ప్రభుత్వంపైకి విరుచుకుపడటం, సోనమ్ వాంగ్‌చుక్ వంటి సామాజిక వేత్తలు దీనికి అండగా నిలవడంతో ప్రభుత్వం తన నిర్ణయాలను సవరించుకోవాల్సి రావడం, చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు వెళ్లడం నేటి యువశక్తి నిరసనలకు నిదర్శనంగా మారింది.

Continues below advertisement

 ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్  మోడల్ - కంచుకోటల బద్దలు! 

మరోవైపు, దశాబ్దాలుగా పాతుకుపోయిన సాంప్రదాయ రాజకీయ కోటలు బద్దలవుతున్నాయి. బీహార్ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన  ప్రశాంత్ కిషోర్  నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ సాధిస్తున్న పురోగతి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పాట్నాలోని  బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో  గడిచిన 35 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న స్థానంలో.. బీజేపీ జాతీయ స్థాయి కీలక నేతల ప్రాతినిధ్యం ఉన్న స్థానాన్ని ప్రశాంత్ కిషోర్ ఉపఎన్నికల్లో భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడం జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సిద్ధాంతాల కంటే ప్యాడ్ యాత్రలు, ప్రత్యామ్నాయ పరిపాలనా వాగ్దానాల ఆధారంగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా సాంప్రదాయ ఓటు బ్యాంకులను దెబ్బతీయవచ్చని పీకే నిరూపించారు.

 ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఈ  జెన్ జీ  నాటకమా? 

సోషల్ మీడియా, రాజకీయ విశ్లేషణల్లో విస్తృతంగా సాగుతున్న ఒక కీలకమైన సిద్ధాంతం ఏంటంటే..  ఈ అసంఘటిత ఉద్యమాలు నిజంగా ప్రభుత్వంపై దాడి కాదా, లేక వ్యతిరేక ఓటును రక్షించే ఎత్తుగడనా?  అని. కేంద్ర ప్రభుత్వంపై ఉత్పన్నమయ్యే ప్రజా అసంతృప్తిని సాంప్రదాయ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు సొమ్ము చేసుకోకుండా నిరోధించడానికి.. ఇలాంటి  రాజకీయ రహిత, డిజిటల్ ఫ్రంట్లు  ఉపయోగపడతాయనేది ఒక వర్గం విశ్లేషకుల అభిప్రాయం. జెన్ జీ పోరాటాలు ప్రజాసమస్యలపై దృష్టి పెడతాయి తప్ప, ప్రభుత్వాన్ని కూల్చేంత తీవ్ర రాజకీయ ప్రత్యామ్నాయంగా మారవు. ఫలితంగా, ప్రభుత్వ వ్యతిరేకత ఈ చిన్న చిన్న  పాప్-అప్ నిరసనల  వల్ల విభజనగురై , అసలైన ప్రతిపక్షానికి రాజకీయం కలసిరాకుండా పోతోంది.

 ప్రశాంత్ కిషోర్ వెనుక నిజంగానే బీజేపీ హస్తం ఉందా? 

పి.కె. విజయం వెనుక బీజేపీ హస్తం ఉందనే అభిప్రాయం  బలంగానే వినిపిస్తోది.  బీహార్‌లోని సాంప్రదాయ ప్రతిపక్షమైన ఆర్జేడీ   యాదవ-ముస్లిం ఓటు బ్యాంకుతో పాటు, అసంతృప్తిగా ఉన్న అగ్రవర్ణ ఓట్లను పీకే తనవైపు తిప్పుకోవడం వల్ల ఆర్జేడీ ఓటు  తగ్గిపోయిది. బీహార్ బంకిపూర్ వంటి సురక్షిత స్థానంలో పీకే గెలవడం ద్వారా ఆర్జేడీ పూర్తిగా మూడో స్థానానికి పడిపోయింది. పైకి బీజేపీ తన కోటను కోల్పోయినట్లు కనిపించినప్పటికీ, ప్రధాన ప్రత్యర్థి అయిన ఆర్జేడీ, ఇండియా కూటమి పునాదులను దెబ్బతీయడంలో పీకే ఒక  థర్డ్ ఫోర్స్ గా ఉపయోగపడ్డారనేది మరువలేని వాస్తవమని కొందరు వాదిస్తున్నారు.

 మూడో విడత పాలనలో బీజేపీ మారిన వ్యూహం 

గత పదేళ్లలాగా ప్రత్యక్ష ప్రజా వ్యతిరేకతను అధికారికంగా ఎదుర్కోవడం కంటే, దాన్ని చిన్న చిన్న గ్రూపుల ద్వారా 'డిఫ్యూజ్' చేయడం  బీజేపీ   నయా వ్యూహంగా కనిపిస్తోంది. ఒక నిరసన వెల్లువెత్తిన వెంటనే.. అది ఏ రాజకీయ పార్టీ చేతికీ చిక్కకుండా చూసుకోవడం, అవసరమైతే సంబంధిత మంత్రుల చేత రాజీనామా చేయించడం లేదా త్వరితగతిన దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా నష్ట నివారణ చేసుకుంటోంది. ప్రతిపక్షాలు కోలుకోకుండా ఉండేందుకు, కొత్తగా వస్తున్న యువ నాయకులను లేదా స్వతంత్ర శక్తులను  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వదిలి, వ్యతిరేక ఓటు ఏకం కాకుండా చూస్తోంది. అంతర్లీనంగా జరుగుతున్న ఈ పరిణామాలు భారత రాజకీయాల్లో ఒక నయా శకానికి నాంది పలుకుతున్నాయి. జెన్ జీ ఉద్యమాలు యువతలోని నిరాశను బయటకు తీస్తుంటే, ప్రశాంత్ కిషోర్ వంటి వారు సాంప్రదాయ పార్టీల అంధకారంలో ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు. ఇది బీజేపీకి ఒక రకంగా ముప్పులా కనిపించినప్పటికీ, అంతిమంగా ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తూ, వ్యతిరేక ఓటును ముక్కలు చేయడానికి బీజేపీ పరోక్షంగా ఈ సమీకరణలను తన అనుకూలంగా మార్చుకుంటోందనేది కొట్టిపారేయలేని నిజం.