Tata Sierra Launch : భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన సియెర్రా సరికొత్త రూపంలో ఆధునిక హంగులతో మార్కెట్లోకి తిరిగి అడుగుపెట్టింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్  ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో ఈ ఐకానిక్ మోడల్‌ను తిరిగి తీసుకొచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత 25 నవంబర్ 2025న ముంబైలో జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కొత్త సియెర్రా ధరలను, పూర్తి వివరాలను టాటా మోటార్స్ ప్రకటించింది.

Continues below advertisement

కొత్త సియెర్రా ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాటా మోటార్స్ దీనిని ‘రీబర్త్ ఆఫ్ ఏ లెజెండ్’ గా అభివర్ణించింది, పాత సియెర్రా రెట్రో లుక్‌ను కొనసాగిస్తూనే, నేటి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతను యాడ్ చేసింది. ఈ కారు కంపెనీ లైనప్‌లో 'కర్వ్' కంటే అధికంగా, 'హారియర్' (Harrier) కంటే కొంచెం తక్కువ అప్‌డేట్స్‌తో వచ్చింది.  

Continues below advertisement

ట్రిపుల్ స్క్రీన్ సంచలనం

కొత్త టాటా సియెర్రా కేవలం మరొక మధ్య తరహా ఎస్‌యూవీ కాదు. ఈ విభాగంలో సరికొత్త ప్రమాణాలను సెట్ చేసే లక్షణాలను కలిగి ఉంది, ముఖ్యంగా దాని టెక్నాలజీ భద్రత పరంగా టాప్ నాచ్‌లో ఉంటోంది.

1. ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్: సియెర్రా అత్యంత ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన ఫీచర్లలో ఒకటి దాని ప్రీమియం ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్. ఈ విభాగంలో (4.2 మీటర్ల నుంచి 4.4 మీటర్ల ఎస్‌యూవీ సెగ్మెంట్) ఇలాంటి డాష్‌బోర్డ్‌ను మొదటిసారిగా టాటా మోటార్స్ పరిచయం చేస్తోంది. ఈ స్క్రీన్‌లు ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ సమాచారం ఇతర వాహన వివరాలు అందిస్తాయి.

2. రోడ్‌ ప్రజెన్స్‌: సియెర్రా వెడల్పు, ఎత్తులో ప్రత్యర్థులపై స్పష్టమైన పైచేయి సాధించింది. ఇతర ఎస్‌యూవీల కంటే  పొడవుతోపాటు దాని డిజైన్, పరిమాణంతో మరింత ప్రత్యేకంగా మారుతోంది. ఈ డిజైన్‌కు 19-అంగుళాల చక్రాలు, ఆకర్షణీయమైన 'ఫంకీ డిజైన్'తోడై, వాహనానికి పటిష్టమైన రూపాన్ని ఇస్తాయి.

3. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు: భద్రత విషయంలో టాటా మోటార్స్ ఎప్పుడూ రాజీపడదనే భావన ఉంది. సియెర్రా విషయంలో కూడా అది నిరూపితమైంది. కొత్త సియెర్రా 5-స్టార్ రేటింగ్‌ను మించిన భద్రతను కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీన్ని నిరూపించడానికి, కంపెనీ ఈ వాహనాన్ని మరో సియెర్రాతో రియల్ లైఫ్‌లో ఢీకొట్టి పరీక్షించింది.

భద్రతా ప్యాకేజీలో లెవల్-2 అడాస్ ఫీచర్లు, ఆరు ఎయిర్‌బ్యాగులు, మెరుగైన రక్షణ కోసం సీట్‌బెల్ట్ యాంకర్ ప్రీ టెన్షనర్లు వంటివి ఉన్నాయి. మొత్తం 20 కంటే ఎక్కువ భద్రతాపరమైన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

ఇంజిన్ -సాంకేతిక వివరాలు

కొత్త సియెర్రా మొత్తం ఆరు రంగుల్లో లభిస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే, కంపెనీ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ఆప్షన్లను అందించింది.

1. పెట్రోల్ ఇంజిన్లు:

• 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (డైరెక్ట్ ఇంజెక్షన్): ఈ ఇంజిన్ 160 పీఎస్‌ పవర్‌ను, 255 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్, మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తుంది.

• 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ (NA పెట్రోల్): ఇది 106 పీఎస్‌ పవర్‌ను, 145 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డీసీఏ (DCA) ట్రాన్స్‌మిషన్‌కు సపోర్ట్ చేస్తుంది.

2. టర్బో డీజిల్ ఇంజిన్:

  • ఈ 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 118 పీఎస్‌ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • టార్క్‌ విషయానికొస్తే, మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 260 ఎన్‌ఎం, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 280 ఎన్‌ఎం టార్క్‌ను ఇది అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
  • కొత్త సియెర్రా డీజిల్ ఇంజిన్, 'హారియర్' (2.0L) లేదా 'కర్వ్' (1.5L) ఇంజిన్‌లలో దేనితోనైనా పంచుకునే అవకాశం ఉంది.

EV భవిష్యత్తు: టాటా మోటార్స్ సియెర్రా ఎలక్ట్రిక్ వెర్షన్ (EV)ను కూడా తీసుకురానున్నట్లు ధృవీకరించింది. అయితే, ఇది కొద్దికాలం తర్వాత మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది.

సౌకర్యం -ఇతర ఫీచర్లు: సియెర్రాలో ప్రయాణీకుల సౌకర్యం కోసం అత్యుత్తమ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ అండ్‌ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ మెమరీ ఫంక్షన్, సర్దుబాటు సీట్లు వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, ఇది డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, ఇన్-బిల్ట్ 5జీ కనెక్టివిటీ వంటి అధునాతన కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చింది. సియెర్రా ఈ విభాగంలో అతిపెద్ద బూట్ స్పేస్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

ధరల పోటీలో సియెర్రా ఎక్కడుంది?

సియెర్రా ప్రవేశించిన ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ , టాటా సొంత కర్వ్. సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు ఈ విభాగంలోని పెట్రోల్ ప్రత్యర్థులతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది అందించే ప్రీమియం ఫీచర్లు ఆ ధర సమర్థనీయంగా కనిపిస్తుంది.

  • పెట్రోల్ ఇంజిన్‌లో ప్రత్యర్థులు: ఎంజీ ఆస్టర్  అత్యంత సరసమైన పెట్రోల్ ఎస్‌యూవీ, దీని ధర రూ. 9.56 లక్షల నుంచి మొదలవుతుంది. టాటా కర్వ్ పెట్రోల్ వేరియంట్లు రూ. 9.66 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
  • ప్రధాన పోటీదారుల ధరలు: క్రెటా, సెల్టోస్, విటారా, హైరైడర్, కుషాక్ వంటి వాహనాల పెట్రోల్ ప్రారంభ ధరలు రూ. 10.5 లక్షల నుంచి రూ. 11 లక్షల మధ్య ఉన్నాయి. ఈ వాహనాల టాప్ వేరియంట్లు రూ. 20 లక్షలు దాటే అవకాశం ఉంది.
  • డీజిల్ పోలిక: సియెర్రా డీజిల్ ఆప్షన్ కూడా ఉంది. ఈ విభాగంలో కర్వ్ తర్వాత, క్రెటా, సెల్టోస్ మాత్రమే డీజిల్ ఇంజిన్‌ అందిస్తున్నాయి. వాటి ప్రారంభ ధరలు రూ. 12.25 లక్షలు, రూ. 12.32 లక్షలు. సియెర్రా డీజిల్ వేరియంట్లు ఈ ప్రత్యర్థులతో పోటీ పడతాయి.

హైబ్రిడ్ -CNG ఆప్షన్: ప్రస్తుతానికి సియెర్రా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రాలేదు. గ్రాండ్ విటారా, హైరైడర్ వంటి ప్రత్యర్థులు హైబ్రిడ్ ఆప్షన్లను దాదాపు రూ.16.5 లక్షల ప్రారంభ ధరతో అందిస్తున్నాయి. సియెర్రాకు CNG వేరియంట్ లభిస్తుందా అనేది స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ టాటా మోటార్స్ తన విజయవంతమైన వాహనాలకు CNG వెర్షన్లు అందించడంలో ప్రసిద్ధి చెందింది.

బుకింగ్ డెలివరీ వివరాలు

వినియోగదారులకు శుభవార్త ఏమిటంటే కొత్త సియెర్రా కోసం బుకింగ్‌లు ప్రారంభతేదీలను సంస్థ ప్రకటించింది.  

  • బుకింగ్‌లు ప్రారంభం: డిసెంబర్ 16 నుంచి టాటా డీలర్‌షిప్‌ల వద్ద లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
  • డెలివరీ ప్రారంభం: 2026 జనవరి 15 నుంచి వాహన డెలివరీలు మొదలవుతాయి.

మొత్తం మీద, కొత్త టాటా సియెర్రా తన చారిత్రక వారసత్వాన్ని ఆధునికతతో మిళితం చేసింది. ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్ వంటి అత్యాధునిక ఫీచర్లు, 5-స్టార్ భద్రతా హామీతో, సియెర్రా మధ్య తరహా ఎస్‌యూవీ విభాగంలో ఒక శక్తివంతమైన ఆటగాడిగా మారేందుకు వచ్చింది.