టాటా ఎట్టకేలకు మనదేశంలో తన అత్యంత చిన్నదైన ఎస్‌యూవీ కారును లాంచ్ చేసింది. దీని ధర మనదేశంలో వేరియంట్‌ను బట్టి రూ.5.49 లక్షల(ఎక్స్-షోరూం) నుంచి రూ.9.09 లక్షల(ఎక్స్-షోరూం) వరకు ఉండనుంది. వీటిపై కంపెనీ కస్టమైజేషన్ ప్యాక్‌లను కూడా అందించనుంది. ఈ కస్టమైజేషన్ ప్యాక్‌ల ధర రూ.45,000 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇవి లాంచ్ ఆఫర్ ధరలు మాత్రమే. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.


ఈ కారు మనదేశంలో అక్టోబర్ 20వ తేదీన లాంచ్ కావాల్సి ఉండగా.. ఇప్పుడు దాన్ని ముందుకు జరిపి రెండు రోజుల ముందే మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన ధరలను కంపెనీ వెల్లడించగానే.. ఈ కారు బుకింగ్స్ కూడా ప్రారంభం అయిపోయాయి. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


మారుతి సుజుకి ఇగ్నిస్, మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్‌టీల నుంచి పోటీ వచ్చే అవకాశం ఉన్నా.. వీటి కన్నా మంచి ఫీచర్లు, పవర్ ఫుల్ అయిన వాహనం కావడం పంచ్‌కు కచ్చితంగా కలిసొచ్చే అంశం. ఇందులో 366 లీటర్ల బూట్ స్పేస్, 187 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండనున్నాయి.


ఇందులో 1.2 లీటర్, త్రీ సిలెండర్, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌ను అందించారు. 85 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం పీక్ టార్క్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఇంజిన్‌లో డైనా ప్రో టెక్నాలజీ కూడా ఉంది. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, ఏఎంటీ కూడా ఇందులో ఉన్నాయి. ఏఎంటీ వేరియంట్లలో ట్రాక్షన్ ప్రో మోడ్ కూడా ఉంది.


ఈ కారులో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, ఐఆర్ఏ కనెక్టివిటీ సూట్, ఏడు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉన్నాయి. దీంతోపాటు ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, పుష్ బటన్ స్టాప్/స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, టూ డ్రైవింగ్ మోడ్లు కూడా ఇందులో ఉన్నాయి.


టాటా అల్ట్రోజ్ ప్లాట్‌ఫాంపై పంచ్‌ను రూపొందించారు. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ సేఫ్టీని కూడా ఇది సాధించింది. అయితే ఇది టాటా ఆల్ట్రోజ్ కంటే ఎన్నో విషయాల్లో మెరుగైనది. గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్ట్ చేసిన కార్ క్రాష్ టెస్టుల్లో అత్యంత సురక్షితమైన కారుగా ఇదే పేరు తెచ్చుకుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 కంటే ఎక్కువ పాయింట్లను ఇది సాధించింది. స్టాండర్డ్ వెర్షన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, యాబ్స్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ ఉన్నాయి. హయ్యర్ వేరియంట్లలో కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, బ్రేక్ అవే కంట్రోల్ కూడా ఉన్నాయి.


టాటా పంచ్ ధర(అన్ని వేరియంట్లు)
ప్రారంభ వేరియంట్ అయిన టాటా పంచ్ ప్యూర్ ధర రూ.5.49 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. టాటా పంచ్ ప్యూర్ రిథమ్ ధర రూ.5.84 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. ఇక టాటా పంచ్ అడ్వెంచర్‌లో మాన్యువల్ వేరియంట్ ధర రూ.6.39 లక్షలుగానూ (ఎక్స్-షోరూం), ఏఎంటీ వేరియంట్ ధర రూ.6.99 లక్షలుగానూ (ఎక్స్-షోరూం) ఉంది. టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్‌లో మ్యాన్యూవల్ వేరియంట్ ధర రూ.6.74 లక్షలుగానూ (ఎక్స్-షోరూం), ఏఎంటీ వేరియంట్ ధర రూ.7.34 లక్షలుగానూ (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.


ఇక టాటా పంచ్ అకాంప్లిష్డ్‌లో మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.7.29 లక్షలు (ఎక్స్-షోరూం) కాగా, ఏఎంటీ వేరియంట్ ధర రూ.7.89 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. టాటా పంచ్ అకాంప్లిష్డ్ డాజిల్‌లో మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.7.74 లక్షలుగానూ (ఎక్స్-షోరూం), ఏఎంటీ వేరియంట్ ధర రూ.8.49 లక్షలుగానూ (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. టాటా పంచ్ క్రియేటివ్ మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.8.49 లక్షలు (ఎక్స్-షోరూం) కాగా, ఏఎంటీ వేరియంట్ ధర రూ.9.09 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ టాటా పంచ్ క్రియేటివ్ ఐఆర్ఏ మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.8.79 లక్షలు (ఎక్స్-షోరూం) కాగా, ఏఎంటీ వేరియంట్ ధర రూ.9.39 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: Ola Electric Scooter: అమ్మకాల్లో ఓలా స్కూటర్ రికార్డు.. మొత్తం టూవీలర్ ఇండస్ట్రీనే మించేలా.. ఎన్ని అమ్ముడుపోయాయంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి