Tata Motors Cuts EV Prices: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన నెక్సాన్, టియాగో ఈవీ ధరలను రూ. 1.2 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీలో ఉపయోగించే బ్యాటరీ సెల్స్ ధరలు స్వల్పంగా తగ్గడంతో టాటా ధరలను తగ్గించింది. ప్రస్తుతానికి నెక్సాన్, టియాగో ఈవీ ధరల్లో మాత్రమే ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే ఇటీవల లాంచ్ అయిన పంచ్ ఈవీ ధరలో ఎటువంటి మార్పు లేదు.
ధర తగ్గింపు తర్వాత టాటా టియాగో ఈవీ భారతదేశంలో రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ. 14.49 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ నెక్సాన్ ఈవీ ధర రూ. 16.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఈ ధర తగ్గింపుపై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ ఒక పత్రికా ప్రకటనలో ‘ఈవీ మొత్తం ధరలో బ్యాటరీ ధర చాలా భాగం. బ్యాటరీ సెల్ ధరలు ఇటీవలి కాలంలో మోడరేట్ చేశారని చెప్పారు.
టాటా టియాగో ఈవీ 2022 అక్టోబర్‌లో రూ.8.49 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. టాటా టియాగో ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఆప్షన్ 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇది 315 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. రెండో ఆప్షన్ 9.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 250 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
టాటా నెక్సాన్ కారు ఆధిపత్యం భారతీయ మార్కెట్లో కొనసాగుతోంది. ఇటీవలే టాటా మోటార్స్ నెక్సాన్ ఆరు లక్షల యూనిట్‌ను ఉత్పత్తి చేయడం విశేషం. కంపెనీ ఈ సబ్ ఫోర్ మీటర్ ఎస్‌యూవీని మొదటిగా 2017లో విడుదల చేసింది. ఈ కారు భారతీయ వినియోగదారుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడంలో విజయవంతమైంది. 2023 ఏప్రిల్‌లో ఈ మోడల్ ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి మార్కును అధిగమించింది. టాటా నెక్సాన్ ప్రస్తుతం దేశంలో ఐసీఈ, ఈవీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఐసీఈ వేరియంట్ ధర రూ. 8.10 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈవీ కార్ల ధర రూ. 14.74 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
టాటా నెక్సాన్‌లో 118 బీహెచ్‌పీ పవర్, 170 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందించారు. దీంతో పాటు 113 బీహెచ్‌పీ పవర్, 260 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ, 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. 2023 సెప్టెంబరులో కంపెనీ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రారంభించింది. ఇది కొత్త రూపాన్ని, సరికొత్త డిజైన్‌ను కూడా పొందింది. అనేక ఫీచర్లు కూడా యాడ్ చేశారు. దీని విభాగంలో నెక్సాన్ ఎస్‌యూవీ... మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్ కార్లతో పోటీపడుతుంది.