Tata Curvv EV Waiting Time: టాటా మోటార్స్ భారత మార్కెట్లో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తోంది. ఇటీవల కంపెనీ టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని తరువాత కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లను కూడా తీసుకురావడానికి ప్రణాళిక ఉంది. అదే సమయంలో టాటా కర్వ్ ఈవీ బుకింగ్స్‌లో సంచలనం సృష్టించింది. ఈ వాహనం కోసం వెయిటింగ్ పీరియడ్ పెరిగింది కూడా.
టాటా కర్వ్ ఈవీ వెయిటింగ్ పీరియడ్ ఎంత?
కర్వ్ ఈవీ అనేది టాటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లైనప్‌లో తాజా మోడల్. ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ400, ఎంజీ జెడ్ఎస్ ఈవీలకు గట్టి పోటీనిస్తోంది. టాటా కర్వ్ ఈవీని విడుదల చేసి నెల కూడా కాలేదు. ఆటోకార్ నివేదిక ప్రకారం ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు రెండు నెలలకు చేరుకుంది. ఆగస్ట్ 7వ తేదీన టాటా కర్వ్ ఈవీని లాంచ్ చేసిన తర్వాత, ఆగస్ట్ 12 నుండి కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభించింది.
మీరు ఈరోజే టాటా కర్వ్‌ను బుక్ చేసుకుంటే రెండు నెలల తర్వాత ఈ కారు డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దాని టాప్ స్పెక్ వేరియంట్‌లు కస్టమర్‌లకు డెలివరీ అయ్యాయి. టాటా మొదట ఈ వేరియంట్‌లను డెలివరీ చేయడం ప్రారంభించింది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
టాటా కర్వ్ ఈవీ పవర్ ఎంత?
టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు బ్యాటరీ ప్యాక్ 45 కేడబ్ల్యూహెచ్, మరొకటి 55 కేడబ్ల్యూహెచ్. దీని 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 502 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి తొమ్మిది సెకన్లు పడుతుంది. ఈ వేరియంట్‌లో అమర్చిన ఇంజన్ 150 పీఎస్ శక్తిని ఇస్తుంది. అలాగే 215 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టాటా కర్వ్ ఈవీ 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్‌ను కూడా కలిగి ఉంది. ఈ వేరియంట్‌లోని ఇంజన్ 167 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 215 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
టాటా కర్వ్ ఈవీ ధర, రేంజ్ ఎంత?
టాటా కర్వ్ ఈవీ ఐదు కలర్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. టాటా లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 17.49 లక్షల నుంచి మొదలవుతుంది. దాని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 21.99 లక్షల వరకు ఉంటుంది. టాటా కర్వ్ ఈవీ మనదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే