Discount Offer December 2024: 2024 సంవత్సరం చివరి నెల ప్రస్తుతం కొనసాగుతోంది. కానీ చాలా మంది కార్ల డీలర్‌ల వద్ద ఇప్పటికీ 2023 సంవత్సరానికి సంబంధించిన స్టాక్ ఉంది. ఈ స్టాక్‌ను క్లియర్ చేయడానికి డీలర్లు ఇప్పుడు ఈ వాహనాలపై అనేక ప్రయోజనాలను అందిస్తున్నారు. టాటా హారియర్, సఫారీ, పంచ్, నెక్సాన్, టియాగో, ఆల్ట్రోజ్, టిగోర్... ఇలా అన్ని కార్లపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నారు. టాటా కర్వ్ కాకుండా వాహన తయారీదారులు తమ అన్ని ఐసీఈ వేరియంట్లపై ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు.
రూ.3.5 లక్షల కంటే ఎక్కువ ప్రయోజనాలు
2024 డిసెంబర్‌లో టాటా హారియర్, సఫారీపై అత్యధిక తగ్గింపు అందిస్తున్నారు. ఈ వాహనాలకు సంబంధించిన ఎంవై23 మోడల్‌పై (2023లో తయారైన మోడల్) రూ. 3.7 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్రీమియం కార్లపై ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తారు. ఈ టాటా కార్లలోని ఎంవై24 మోడల్‌పై రూ.45 వేల వరకు బెనిఫిట్‌లను అందజేస్తున్నారు.
టాటా హారియర్, సఫారీ... ఈ రెండు కార్లు 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అమరుస్తూ ఉంటారు. ఇది 170 హెచ్‌పీ పవర్‌ని అందిస్తుంది. ఈ కార్ల ఇంజన్‌తో పాటు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా చూడవచ్చు. 5 సీటర్ హారియర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.99 లక్షల నుంచి మొదలై రూ. 25.89 లక్షల వరకు ఉంటుంది. మూడు వరుసల సఫారీ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 26.79 లక్షల మధ్య ఉంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
టాటా నెక్సాన్‌పై తగ్గింపు ఆఫర్లు ఇవే...
టాటా నెక్సాన్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై రూ. 2.85 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై రూ. 2.10 లక్షల వరకు తగ్గింపు ఆఫర్ అందిస్తారు. టాటా నెక్సాన్ ఎంవై24 మోడల్‌పై రూ.45 వేల వరకు తగ్గింపు లభించనుంది. ఈ టాటా కారుకు సంబంధించి మొత్తం 100 వేరియంట్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి మొదలై రూ. 15.80 లక్షల వరకు ఉంటుంది. దాని సీఎన్‌జీ మోడల్‌పై ఎటువంటి తగ్గింపు అందుబాటులో లేదు.
వీటిపై రెండు లక్షల కంటే ఎక్కువ తగ్గింపు
టాటా టియాగో, టిగోర్‌లపై రూ. 2.05 లక్షల వరకు బెనిఫిట్‌లను అందజేస్తున్నారు. దీని ఎంవై24 మోడల్‌పై రూ. 25 వేల నుంచి రూ. 45 వేల వరకు ఆఫర్లు ఉంటాయి. అదే సమయంలో, ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ 2023 మోడల్‌కు సంబంధించిన అన్ని వేరియంట్లపై రూ. 2.05 లక్షల వరకు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని కొత్త మోడళ్లపై రూ.60 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ బేస్డ్ అల్ట్రోజ్ రేసర్‌పై రూ. 80 వేల వరకు తగ్గింపు అందిస్తున్నారు.
టాటా టిగోర్ ప్రస్తుత ధర రూ. ఆరు లక్షల నుంచి మొదలై రూ. 9.40 లక్షల వరకు ఉంది. టాటా టియాగో ఎక్స్ షోరూమ్ ధర రూ.ఐదు లక్షల నుంచి రూ.8.75 లక్షల మధ్య ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.50 లక్షల నుంచి మొదలై రూ. 11.16 లక్షల వరకు ఉంటుంది.
టాటా పంచ్‌పై డిస్కౌంట్ ఆఫర్లు
టాటా పంచ్ ఎంవై23 మోడల్స్‌పై ప్రస్తుతం రూ. 1.55 లక్షల వరకు తగ్గింపు అందిస్తున్నారు. గత నెలలో ఈ తగ్గింపు రూ.40 వేల వరకు మాత్రమే ఉంది. మరోవైపు ఎంవై24 మోడల్స్‌పై వేరియంట్లను బట్టి రూ.20 వేల వరకు ప్రయోజనాలు అందజేస్తున్నారు. టాటా పంచ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.13 లక్షల నుంచి మొదలై రూ. 10.15 లక్షల వరకు ఉంటుంది.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?