South Korea President Bag Scandal: దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇటీవల అకస్మాత్తుగా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. ముంచుకొస్తోన్న అభిశంసన ముప్పు నుంచి తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. అయితే, ఆయన ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వివాదాస్పద నిర్ణయాలతో ప్రజల చేతిలో ఛీత్కారాలకు గురయ్యారు. ఆ మధ్య ఆయన సతీమణి అందుకున్న ఓ కానుక ఆయన్ను చిక్కుల్లో పడేసింది. ఇంతచేసి కుంభకోణానికి కారణమైన ఆ బ్యాగ్ ఖరీదు కేవలం 2260 అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే అటు ఇటుగా రూ.2 లక్షల వరకూ ఉంటుంది. 

పాస్టర్ నుంచి బహుమతి స్వీకరణ..

ఈ కుంభకోణానికి మూల పురుషుడు ఒక పాస్టర్ కావడం విశేషం. ఉత్తరకొరియాపై ప్రెసిడెంట్ కఠిన వైఖరిని వ్యతిరేకించే పాస్టర్ చాయ్ జే యంగ్.. దక్షిణ కొరియా ఫస్ట్ లేడీ కిమ్ కియోన్ హీకి రెండేళ్ల క్రిత ఖరీదైన డియర్ బ్యాగ్(Dior Bag)ను గిఫ్టుగా బహూకరించారు. ఇందుకు సంబంధించిన ఫుటేజీ గతేడాది నవంబరులో వెలుగులోకి వచ్చి తీవ్ర దుమారం రేపింది. నిజానికి 2022లో కిమ్ కియోన్ ఆఫీసుకు వెళ్లి, ఈ బ్యాగ్ ఇచ్చారు. అందుకు స్పందనగా..**ఎందుకు దీన్ని తీసుకొచ్చారు..? ఇలాంటి రిచ్ ఐటమ్‌ని నేనేప్పుడు కొనలేదు** అని ఆశ్చర్యంగా కిమ్ కియోన్ వాయిస్ అందులో రికార్డైంది. ఈ వీడియోను తన చేతికున్న రహస్య కెమెరా ద్వారా చిత్రీకరించారు. మరుసటి ఏడాది ఇది వైరల్‌గా మారడంతో ప్రెసిడెంట్ యేల్‌కు ఇబ్బందికరంగా మారింది. దీన్నిఎలా టాకిల్ చేయాలో తెలియక నానా తంటాలు పడ్డారు. 

కఠినమైన చట్టాలు..

సౌత్ కొరియా చట్టాలు కఠినంగా ఉంటాయి. ఒకేసారి 750 అమెరికన్ డాలర్లు లేదా ఒక ఏడాదిలో 2200 డాలర్లకు మించి విలుమైన బహుమతులు తీసుకోరాదని నిబంధనలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకునేందుకు కొందరు కియోన్‌కు లంచం ఇచ్చారని ప్రతిపక్షాలు రచ్చ చేశాయి. దీంతో అక్కడి రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు గిఫ్టు స్వీకరించడం నిజమేనని అధ్యక్ష కార్యాలయం కూడా అంగీకరించడంతో కియోన్‌ను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. అయితే ఇందులో లంచం కోణం ఏమీ లేదని తేలడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. ఆ బ్యాగును ప్రభుత్వ ఆస్తి కింద భద్రపరిచినట్లు ప్రభుత్వం వివాదాన్ని చల్లార్చే పనిలో పడింది. ఇలా బ్యాగ్ కారణంగా యోల్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అప్పట్లోనే ప్రజల్లో అతనిపై విశ్వసనీయత పలుచనైంది. 

ఎమర్జెన్సీ ప్రకటనతో రగడ..

బ్యాగు వివాదం (Bag Scandal) మదిలోనే ఉండగానే, ఒక్కసారిగా యేల్ మార్షల్‌లా ప్రకటించడంతో ప్రజల్లో ఆగ్రహం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది బుమరాంగ్‌గా మారింది. స్వపార్టీ నేతలకు కూడా ఎమర్జెన్సీ నిర్ణయం రుచించకపోవడంతో పార్లమెంట్‌లో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు. దీంతో యోల్‌కు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. అధ్యక్షుడి ప్రతిష్ట దిగజారిన క్రమంలో ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన్ను దించడానికి కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నాయి. మార్షల్ లాతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు.. ప్రెసిడెంట్ హక్కుల్లో కోతకు సుముఖంగా ఉంది. మొత్తానికి త్వరలోనే యోల్‌కు పదవీ గండం ఉందని, ఈ పరిణామాలు గమనిస్తున్న విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: lady Teacher: 15 ఏళ్ల విద్యార్థితో శృంగారానికి ప్రయత్నించిన 33 ఏళ్ల టీచర్ - తర్వాత ఏమయిందంటే ?