టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ Altroz CNG వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ కారు

    బుకింగ్స్ ను టాటా సంస్థ ప్రారంభించింది.  దీనిని కొనుగోలు చేయాలి అనుకునే వినియోగదారులు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెలలో డెలివరీ ఇచ్చే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ CNG వెర్షన్లు XE, XM+, XZ, XZ+  లాంటి నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌ పో 2023లో టాటా సంస్థ ఆల్ట్రోజ్ CNG హ్యాచ్‌ బ్యాక్‌ ను ప్రదర్శించింది. ఈ కారు ఇదే  కేటగిరీలోని ఇతర మోడళ్లు అయిన మారుతి సుజుకి బాలెనో,  టయోటా గ్లాంజాకు సంబంధించిన CNGకు పోటీగా ఉండబోతోంది.   


వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లు


ఆల్ట్రోజ్ CNG వెర్షన్ టాటా  కార్లలో మూడో మోడల్ గా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది.  ఇండియన్ కార్‌ మేకర్ ఇంతకు ముందు టిగోర్ సెడాన్,  టియాగో హ్యాచ్‌ బ్యాక్‌లను iCNG టెక్నాలజీతో విడుదల చేసింది. అయితే, Altroz iCNG వెర్షన్ మిగతా రెండింటికి భిన్నంగా ఉంటుంది. కారు లోపల  మరింత స్థలాన్నిఅందించేలా, టాటా మోటార్స్ భారతదేశంలో మొదటిసారిగా కొత్త ట్విన్-సిలిండర్ CNG సాంకేతికతను పరిచయం చేసింది. ఒక్కొక్కటి 30 లీటర్ల రెండు CNG సిలిండర్‌లను కలిగి ఉన్న CNG కిట్, లగేజీ స్థలాన్ని ఎక్కువగా తగ్గించకుండా బూట్ స్పేస్‌లో తక్కువగా ఉంచబడుతుంది. CNG కిట్ ఉన్నప్పటికీ Altroz CNG 300 లీటర్లకు పైగా బూట్ స్పేస్‌ను అందిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.  Tiago, Tigor వంటి సాంప్రదాయ CNG వాహనాలలో, బూట్ స్పేస్ లోపల ఉంచబడిన పెద్ద CNG సిలిండర్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.  Altroz CNG  పోటీదారులైన  Baleno, Glanza వంటివి ఈ ఫీచర్‌ను అందించవు.


ఆల్ట్రోజ్ CNG హ్యాచ్‌ బ్యాక్  స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే చూడటానికి పెద్దగా మార్పులు ఏమీ లేవు.  iCNG బ్యాడ్జింగ్, ఫ్యూయల్ మోడ్‌ల మధ్య మారడానికి లోపల కన్సోల్‌లోని CNG స్విచ్ గుర్తించదగిన మార్పుగా చెప్పుకోవచ్చు. టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జిని నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది. ఒపెరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ రంగుల్లో లభించనునాయి.  ఆల్ట్రోజ్ iCNG   లీథరెట్ సీట్లు, iRA కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందిస్తుంది.






టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి ఇంజన్‌ ప్రత్యేకత, మైలేజ్


టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది టియాగో,  టిగోర్ సిఎన్‌జి మోడళ్లకు కూడా శక్తినిస్తుంది. మాన్యువల్ గేర్‌ బాక్స్‌తో జతచేయబడిన ఇంజన్, iCNG మోడ్‌లో 73 bhp,  95 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. CNG కిట్ లేకుండా, ఇంజిన్ 84.82 bhp శక్తిని, 13 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.  ఆల్ట్రోజ్ iCNG   ఇంధన సామర్థ్యం దాదాపు 27 కిమీ/కిలో ఉంటుందని అంచనా.  ఇది టియాగో iCNG ఆఫర్‌ల మాదిరిగానే ఉంటుంది.


Read Also: వేసవిలో వేడిని తట్టుకునే బెస్ట్ కార్లు ఇవే, వెంటిలేటెడ్ సీట్లే కాదు, తక్కువ ధర కూడా!