భారతదేశపు అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీదారు టాటా మోటార్స్ కొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. ఎంతో సక్సెస్‌ఫుల్ అయిన చిన్న కమర్షియల్ వాహనం టాటా ఏస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీన్ని ఎంతో అడ్వాన్స్‌డ్‌గా రూపొందించామని కంపెనీ తెలిపింది.


టాటా ఏస్ లాంచ్ అయిన సరిగ్గా 17 సంవత్సరాలకు దీన్ని కంపెనీ లాంచ్ చేసింది. చిన్న కమర్షియల్ వాహనాల విభాగంలో ఇది ఎంతో సక్సెస్ ఫుల్ వాహనం. ఈ టాటా ఏస్ ఈవీ స్మార్ట్ రవాణా సౌకర్యాలను అందించనుంది. అయితే దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.


ఈ కారు సర్టిఫైడ్ రేంజ్ 154 కిలోమీటర్లుగా ఉంది. అంటే ఒకసారి చార్జ్ పెడితే 154 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయవచ్చన్న మాట. 21.3 కిలోవాట్ బ్యాటరీని ఈ కొత్త టాటా ఏస్‌లో అందించారు. ఈ బ్యాటరీ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మెరుగ్గా పనిచేయనుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టం, రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా అందించనున్నారు.


ఫాస్ట్ చార్జింగ్, రెగ్యులర్ చార్జింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. రెగ్యులర్ చార్జింగ్ మోడ్‌లో 20 శాతం నుంచి 80 శాతం చార్జ్ కావడానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టనుంది. ఫాస్ట్ చార్జింగ్ మోడ్‌లో అయితే కేవలం 105 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం చార్జింగ్ ఎక్కనుంది. దీని ఎలక్ట్రిక్ మోటర్ 36 బీహెచ్‌పీ, 130 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది.


తేలికైన పదార్థాలతో ఈ ఏస్ ఈవీని రూపొందించారు. దీని కార్గో వాల్యూమ్ 208 క్యూబిక్ మీటర్లుగా ఉంది. పేలోడ్ కెపాసిటీ 600 కేజీలుగా ఉంది. ఈ టాటా ఏస్ ఈవీ సక్సెస్ కావడం కోసం అమెజాన్, బిగ్ బాస్కెట్, సిటీ లింక్, మోఈవింగ్, ఏలో ఈవీ, ఫ్లిప్‌కార్ట్, లెట్స్ ట్రాన్స్‌పోర్ట్, డాట్ కంపెనీలతో టాటా ఒప్పందం కుదుర్చుకుంది. ఎంవోయూ ప్రకారం ఈ కంపెనీ 39 వేల ఏస్ ఈవీలను డెలివరీ చేయనుంది.