44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ఎలాన్ మస్క్ తన ప్లాన్ నుంచి సడెన్ డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో లోపాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తాజాగా ఆయన ట్విట్టర్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మీ ట్విట్టర్ ఫీడ్‌ను సరిచేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. మొదట హోం బటన్‌ను ట్యాప్ చేయండి. స్క్రీన్ పైన కుడివైపు ఉన్న చుక్కలను ట్యాప్ చేయండి. అక్కడ లేటెస్ట్ ట్వీట్స్‌ను ఎంచుకోండి. మీకే తెలియని విధంగా మిమ్మల్ని ట్విట్టర్ అల్గారిథం మోసం చేస్తుంది.’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
అయితే దానికి ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే రిప్లై ఇచ్చాడు. ‘మీరు యాప్‌ను ఉపయోగించకుండా దూరంగా ఉన్న సమయంలో మీ సమయాన్ని ఆదా చేసేందుకు అలా డిజైన్ చేశాం. ఒక్కసారి ఫీడ్‌ను రిఫ్రెష్ చేస్తే మీకు తాజా ట్వీట్లు కనిపిస్తాయి.’ అని రిప్లై ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఆ తర్వాత ఆ థ్రెడ్ కింద మరిన్ని ట్వీట్లు కూడా ఎలాన్ మస్క్ పోస్ట్ చేశాడు. ‘దురుద్దేశంతో అల్గారిథం రూపొందించారని అనడం నా ఉద్దేశం కాదు. కానీ మీరు ఏం చూడాలనుకుంటున్నారో గెస్ చేయడానికి అల్గారిథం ప్రయత్నిస్తుంది. అలా చేసేటప్పుడు మీకు తెలియకుండానే మీ దృక్కోణాన్ని అది ఏమార్చడానికి ప్రయత్నిస్తుంది. కోడ్‌లో ఉన్న బగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకం కలిగించడం, మరింత సమర్థవంతంగా పని చేయడానికి ఓపెన్ సోర్స్ ఒక్కటే మార్గం.’ అని ట్వీట్లలో తెలిపాడు.
ఎలాన్ మస్క్ మొదట పోస్ట్ చేసిన ట్వీట్‌కు 3.65 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. కింద రిప్లైల్లో కూడా చాలా మంది దీన్ని గమనించామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఏ వివాదం దిశగా సాగుతాయో చూడాలి మరి!