YSR Rythu Bharosa 2022: ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5,500 నగదు మే 16వ తేదీన జమ కానుంది. ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్. ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500ల రైతు భరోసా సాయం అందిస్తుండగా.. వరుసగా నాలుగో ఏడాది మొదటి విడతగా వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ నిధులను సీఎం వైఎస్ జగన్ సోమవారం విడుదల చేయనున్నారు.
వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయాన్ని అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ మొదటి విడతగా మే నెలలో రూ.7500 ఇవ్వనున్నారు. ఇందులో రూ.5,500లను సోమవారం నాడు ఏలూరు జిల్లా గణపవరంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హులైన రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో లిస్ట్ చేశారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడానికి అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. ఈ నెల 31న పీఎం కిసాన్ నిధులు మరో 2వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో మొత్తంగా మే నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ కానున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్‌ఆర్(అటవీ), దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు ఏటా రూ.13,500 సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతి ఏటా దాదాపు దాదాపు 50 లక్షల మంది రైతులకు సుమారు రూ.7 వేల కోట్లు రైతు భరోసా సాయంగా అందిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ.3,758 కోట్లతో కలిసి ఈ మూడేళ్లలో రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా సాయం రూ.23,875 కోట్లు. ఖరీఫ్ సాగు నేపథ్యంలో అంతకుముందుగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొదటి విడత సాయంగా మే నెలలో రైతుల ఖాతాల్లో రూ.7500 జమ చేస్తోంది.
జూన్ నెలలో వైయస్సార్ ఉచిత పంటల బీమా క్రింద గత ఖరీప్ 2021కి సంబంధించి, చెప్పిన విధంగా 2022 ఖరీప్ ప్రారంభసమయానికే బీమా పరిహారం కూడా ప్రభత్వం అందించనుంది. మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లకు రూ.50 వేలు ఇస్తామని హామీ ఇవ్వగా.. ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లకు బదులుగా ఏకంగా ఐదేళ్లకు రూ.67,500 అందిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా ఈమూడేళ్లలో రైతులకు ఏపీ ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి దాదాపు రూ.1,10,099.21 కోట్లు. వైఎస్సార్ రైతు భరోసా తొలి విడతలో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, మిగిలిన రూ.2 వేలు జనవరి మాసంలో జమ చేస్తోంది. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
Also Read: CM Jagan Tour: 17న కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన- విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన