Suzuki Swift Hydrogen Prototype Revealed to Support Green Mobility: ప్రపంచ వ్యాప్తంగా వాహన తయారీ సంస్థలు ఇప్పుడు క్లీన్ ఫ్యూయల్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే హైడ్రోజన్ ఇంధనాన్ని ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. తాజాగా ఆస్ట్రియన్ పవర్‌ట్రెయిన్ ఎక్స్‌పర్ట్ ఏవీఎల్ టెక్నాలజీస్, సుజుకి బ్రాండ్ తో కలిసి ఒక వర్కింగ్ ప్రోటో టైప్‌ను తాజాగా ప్రదర్శించింది. మన దేశంలో అత్యంత పాపులర్ అయిన స్విఫ్ట్ మోడల్ ను ఇందుకు వేదికగా ఎంచుకోవడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

Continues below advertisement

Continues below advertisement

హైడ్రోజన్ ఇంజిన్ ప్రత్యేకతలు..ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న చాలా హైడ్రోజన్ కార్లు ఎలక్ట్రిక్ మోటార్ల సహాయంతో నడుస్తాయి. అయితే ఏవీఎల్ డెవలప్ చేసిన ఈ స్విఫ్ట్ మాత్రం మన సాధారణ పెట్రోల్ కార్ల లాగే ఇంజిన్ లో హైడ్రోజన్ ను మండించి శక్తిని విడుదల చేస్తుంది. ఇది ప్యాసింజర్ వాహనాలకు చాలా తక్కువ ఖర్చుతో కూడిన, ప్రాక్టికల్ పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. ఈ సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ మోడల్ లో అమర్చిన 1.4 లీటర్ల ఇంజిన్, ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఐసీఈ ఇంజిన్ల కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ చూపిస్తోంది. పెట్రోల్ ఇంజిన్ తో పోలిస్తే ఇందులో 13 హెచ్‌పీ పవర్, 20 ఎన్ఎమ్ టార్క్ అదనంగా లభిస్తాయి.

నితిన్ గడ్కరీ విజన్ కు ఊతం..కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశంలో ఎథనాల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ ఇంధన వినియోగాన్ని పెంచాలని పదేపదే చెప్తున్నారు. భవిష్యత్తులో మన రవాణా వ్యవస్థ అంతా గ్రీన్ ఎనర్జీ మీద ఆధారపడాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన స్వయంగా టయోటా మిరాయ్ అనే హైడ్రోజన్ కారును వాడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు స్విఫ్ట్ లాంటి మాస్ మార్కెట్ కారు హైడ్రోజన్ వెర్షన్ లో అందుబాటులోకి వస్తే గడ్కరీ కలలుగన్న స్వచ్ఛమైన ఇంధన విప్లవం వేగవంతం అవుతుంది.

భారత మార్కెట్ లో అంచనాలు..మారుతి సుజుకి ఈ ప్రాజెక్టును గనుక పెద్ద ఎత్తున చేపట్టి ప్రొడక్షన్ లైన్ లోకి తీసుకువస్తే ఇండియన్ ఆటో సెక్టార్ లో పెను మార్పులు రావడం ఖాయం. స్విఫ్ట్ కు ఉన్న క్రేజ్ వల్ల ప్రజలు హైడ్రోజన్ వాహనాలను స్వీకరించడానికి పెద్దగా వెనకాడరు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా హైడ్రోజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయడానికి పైలట్ ప్రాజెక్టులను, పాలసీలను సిద్ధం చేస్తోంది. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి హైడ్రోజన్ కార్లు గేమ్ ఛేంజర్ కానున్నాయి.  ఏవీఎల్ సంస్థ ఈ ఇంజిన్ డిజైన్, డెవలప్‌మెంట్, కాలిబ్రేషన్ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసింది. సుజుకి సంస్థ ఈ టెక్నాలజీని ఎప్పుడు సామాన్యులకు అందుబాటులోకి తెస్తుందో అని ఆటోమొబైల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.