Maruti Suzuki Eeco Star Edition Launched: ఇండియాలో మాస్ మార్కెట్ వ్యాన్ సెగ్మెంట్ లో మారుతి సుజుకికి తిరుగులేదు. ఈకో (Eeco) మోడల్ కు సరైన పోటీ లేకపోవడంతో ప్రతినెలా 10 వేలకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. గత మార్చి 2026 నెలలో ఏకంగా 11,333 వాహనాలను విక్రయించి మారుతి తన సత్తా చాటింది. ఈ జోరును ఇలాగే కొనసాగించడానికి, ముఖ్యంగా ఫ్యామిలీ కస్టమర్లను ఆకర్షించడానికి మారుతి సుజుకి ఇప్పుడు ఈకో 'స్టార్ ఎడిషన్'ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా కమర్షియల్ లుక్ లో ఉండే ఈకోను ఈ స్టార్ ఎడిషన్ కాస్త విలాసవంతంగా మార్చేస్తుంది.
ధర - ఆఫర్ వివరాలు..ఈ స్టార్ ఎడిషన్ ప్యాకేజీ ధరను మారుతి చాలా ఇంట్రెస్టింగ్ గా నిర్ణయించింది. కారు అసలు ధరపై అదనంగా రూ. 19,999 చెల్లిస్తే ఈ స్పెషల్ ఎడిషన్ సొంతం చేసుకోవచ్చు. గతంలో ఇలాంటి ప్యాకేజీ కోసం రూ. 37,000 వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ధరను దాదాపు సగానికి తగ్గించడంతో బడ్జెట్ లో కారు కొనేవారికి ఇది ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. ఈ ఎడిషన్ మెటాలిక్ బ్రిస్క్ బ్లూ, మెటాలిక్ గ్లిస్టనింగ్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
స్టార్ ఎడిషన్ లో ఏమేం వస్తాయి?ఈ స్పెషల్ ఎడిషన్ లో మొత్తం 18 రకాల యాక్సెసరీలను మారుతి ఆఫర్ చేస్తోంది. వీటిలో హైలైట్ గా చెప్పుకోవాల్సింది బాడీ కలర్ బంపర్లు. సాధారణ ఈకో మోడళ్లలో బంపర్లు బ్లాక్ కలర్ లో ఉంటే, స్టార్ ఎడిషన్ లో కారు బాడీ రంగులోనే వస్తాయి. దీనివల్ల కారు చూడటానికి చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. అలాగే కారు వెనుక భాగంలో స్పోర్టీ లుక్ ఇచ్చే రియర్ స్పాయిలర్, గార్నిష్ తో కూడిన ఫాగ్ ల్యాంప్స్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కొత్త సీట్ కవర్లు, స్టైలిష్ వీల్ కవర్లు, క్రోమ్ ఎంబ్లమ్, డోర్ వైజర్లు, మడ్ ఫ్లాప్స్ వంటి మరెన్నో ఐటమ్స్ ఈ ప్యాకేజీలో భాగం. ఈ యాక్సెసరీలన్నీ డీలర్ లెవల్ లో అమర్చే అవకాశం ఉంది.
ఇంజిన్ - మైలేజ్..మెకానికల్ గా ఈకోలో ఎటువంటి మార్పులు లేవు. ఇందులో నమ్మకమైన 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 81 బీహెచ్‌పీ పవర్, 105.5 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వచ్చే ఈ కారు పెట్రోల్ వెర్షన్ లో లీటరుకు 19.71 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఇక సీఎన్‌జీ వెర్షన్ లో అయితే ఏకంగా కిలో గ్యాస్ కు 26.78 కిమీ మైలేజ్ ఇస్తుండటం విశేషం. పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
వేరియంట్లు - ఫీచర్లు..మారుతి ఈకో ప్రస్తుతం రూ. 5.21 లక్షల నుండి రూ. 6.36 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తోంది. ఇందులో 5 సీటర్ స్టాండర్డ్, 5 సీటర్ ఏసీ, 7 సీటర్ వంటి రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. స్లైడింగ్ డోర్ల సౌకర్యం ఉండటం వల్ల ఇరుకైన ప్రదేశాల్లో కూడా కారు ఎక్కడం, దిగడం చాలా సులభం. లాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మించిన ఈ వాహనం రియర్ వీల్ డ్రైవ్ (RWD) సిస్టమ్ తో పనిచేస్తుంది. ప్రస్తుతం షోరూమ్ లో ఉన్న ఏ వేరియంట్ కైనా ఈ స్టార్ ఎడిషన్ ప్యాకేజీని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం తక్కువ ధరలో మంచి లుక్ ఉన్న కారు వెతుకుతుంటే ఈ కొత్త ఈకో స్టార్ ఎడిషన్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది.
