2026 Maruti Suzuki Brezza Facelift Spotted Testing: మారుతి సుజుకి తన కార్ల లైనప్‌ను రిఫ్రెష్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా బాలెనోతో పాటు బ్రెజ్జా (Brezza) కొత్త మోడళ్లను టెస్టింగ్ చేస్తోంది. తాజాగా 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కింది. ఈ స్పై షాట్స్ ద్వారా కారులో రాబోయే కొన్ని కీలక మార్పులు బయటపడ్డాయి. ముఖ్యంగా సీఎన్‌జీ కార్ల ప్రేమికులకు మారుతి ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వబోతోంది. సాధారణంగా సీఎన్‌జీ కార్లలో సిలిండర్ వల్ల డిక్కీలో (Boot Space) అస్సలు ఖాళీ ఉండదు. కానీ ఈ కొత్త బ్రెజ్జాలో అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ సెటప్ ఉండబోతోంది.
కొత్త టెక్నాలజీతో సీఎన్‌జీ..మారుతి సుజుకి గత ఏడాది సెప్టెంబర్ 2025లో 'విక్టోరిస్' మోడల్ ద్వారా అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను బ్రెజ్జాకు కూడా అప్లై చేస్తోంది. దీనివల్ల కారు లోపల లగేజీ పెట్టుకోవడానికి ఫుల్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ తో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో బ్రెజ్జా తన పట్టును మరింత పెంచుకోనుంది.
ఇంజిన్ - పర్ఫార్మెన్స్..2026 బ్రెజ్జాలో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 99 హెచ్‌పీ పవర్, 137 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే రిపోర్ట్స్ ప్రకారం ఈసారి బ్రెజ్జాలో హైబ్రిడ్ సెటప్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. గేర్‌బాక్స్ విషయంలోనూ ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కనిపిస్తోంది. ఇప్పటివరకు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కే పరిమితమైన మారుతి, ఈ కొత్త బ్రెజ్జాలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టేలా ఉంది. దీనివల్ల హైవేలపై ప్రయాణం మరింత స్మూత్ గా, ఫ్యూయల్ ఎఫిషియెంట్‌గా మారుతుంది.
డిజైన్ మార్పులు..
బయటి నుంచి చూస్తే కొత్త బ్రెజ్జా లుక్ ప్రస్తుత మోడల్ లాగే ఉన్నా, కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ డిజైన్ దాదాపు పాతదే అయినా.. బంపర్, ఫ్రంట్ గ్రిల్ లో మార్పులు ఉండొచ్చు. టెస్టింగ్ కార్ ను పూర్తిగా కవర్ చేయడం వల్ల లోపల ఏముందో స్పష్టంగా తెలియడం లేదు కానీ, సరికొత్త అలాయ్ వీల్స్ రావడం పక్కా అని తెలుస్తోంది.
ఇంటీరియర్ - ఫీచర్లు..కారు లోపలి భాగంలో టెక్నాలజీకి పెద్ద పీట వేశారు. ప్రస్తుతం బ్రెజ్జాలో 9 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉండగా, కొత్త మోడల్ లో 10.25 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను అమర్చారు. దీని యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా అప్‌డేటెడ్ గా ఉండబోతోంది. కారు అద్దాల (ORVMs) కింద కెమెరాలు ఉండటం గమనిస్తే, ఇందులో 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ ఉంటుందని స్పష్టమవుతోంది. ఇది పార్కింగ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది.
మార్కెట్ పోటీ..మారుతి బ్రెజ్జా మార్కెట్లోకి వచ్చిన తర్వాత టాటా నెక్సాన్ (Nexon), హ్యుందాయ్ వెన్యూ (Venue), మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (XUV 3XO), కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి బ్రాండ్ వాల్యూ, తక్కువ మెయింటెనెన్స్ తో పాటు ఈ కొత్త ఫీచర్లు తోడైతే సేల్స్ లో బ్రెజ్జా మళ్ళీ టాప్ లో నిలవడం ఖాయం. మారుతి సుజుకి తీసుకొస్తున్న ఈ మార్పులు కారు ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ముఖ్యంగా అండర్‌బాడీ సీఎన్‌జీ కాన్సెప్ట్ సక్సెస్ అయితే మాత్రం ఇండియన్ ఆటో సెక్టార్ లో ఇదొక గేమ్ చేంజర్ అవుతుంది.
