Best Mileage Cars: ఈ మధ్య కాలంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీని కారణంగా చాలా మంది ప్రజలు మరింత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్నారు. కాబట్టి రూ. 10 లక్షల లోపు మంచి మైలేజీని కూడా అందించే కారులను ఓసారి చూద్దాం.


మారుతి సుజుకి వ్యాగన్ఆర్
మారుతీ సుజుకి వ్యాగన్ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. అలాగే దీని మైలేజీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ కారులో 1.0 లీటర్, 1.2 లీటర్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా 70 bhp, 90 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 1 లీటర్ ఇంజిన్‌తో సీఎన్‌జీ కిట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 57 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.


కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్‌తో లీటరుకు 24.35 కిలోమీటర్లు, ఆటోమేటిక్‌తో 25.19 కిలోమీటర్ల మైలేజ్‌ను పొందుతుంది. దాని 1.2 లీటర్ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్‌తో లీటరుకు 23.56 కిలోమీటర్లకు, ఆటోమేటిక్‌తో 24.43 కిలోమీటర్ల మైలేజ్‌ను పొందుతుంది. ఇక దీని సీఎన్‌జీ వేరియంట్ కేజీ ఇంధనానికి 34.05 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.


మారుతీ సుజుకి బలెనో సీఎన్‌జీ
మారుతి సుజుకి బాలెనో సీఎన్‌జీని గత ఏడాది కంపెనీ విడుదల చేసింది. ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్‌జీ కిట్ ఆప్షన్‌లో 1.2 లీటర్, 4 - సిలిండర్ K12N డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ సీఎన్‌జీ సెటప్ 77.5 bhp పవర్, 98.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం బలెనో సీఎన్‌జీ 30.61 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. హ్యాచ్‌బ్యాక్ మోడల్లో 55 లీటర్ల CNG ట్యాంక్‌ను అందించారు.


మారుతీ సుజుకి సెలెరియో
మారుతీ సెలెరియో నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. LXi, VXi, ZXi, ZXi+. ఇది 1.0 లీటర్ 3 సిలిండర్ కే10సీ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌, స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌, CNG కిట్‌తో యాడ్ కానుంది. ఈ సెటప్ 5 - స్పీడ్ మాన్యువల్ లేదా 5 - స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం దీని VXi AMT వేరియంట్ లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.


టాటా టియాగో సీఎన్‌జీ
టాటా టియాగోకి సంబంధించి ఆరు ఆప్షన్లు మార్కెట్లో ఉన్నాయి. అవి XE, XT, XZ, XZA, XZ+, XZA+. ఇందులో 1.2 లీటర్, 3 - సిలిండర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది, ఇది 86 bhp పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది మాన్యువల్, AMT రెండు గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది. CNG కిట్‌తో ఈ పెట్రోల్ ఇంజన్ 73 bhp, 95 Nm అవుట్‌పుట్‌లను ఉత్పత్తి చేస్తుంది. టియాగో సీఎన్‌జీ 26.49 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.


హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ
కొత్తగా అప్‌డేట్ అయిన హ్యుందాయ్ ఆరా ఐదు పెట్రోల్, రెండు సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 83 bhp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యాక్టరీ అమర్చిన CNG కిట్‌తో ఇది 69 bhp శక్తిని, 95 Nm టార్క్‌ను పొందుతుంది. ఇది 5 - స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లో లాంచ్ అయింది. ఆరా సీఎన్‌జీ 25 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.10 లక్షల నుంచి రూ. 8.87 లక్షల మధ్యలో ఉంది.