Driving Safety Tips: దేశంలో దాదాపు 75 శాతానికి పైగా వాహన ప్రమాదాలు వాతావరణ పరిస్థితుల కారణంగానే జరుగుతాయి. వీటిలో సుమారు 50 శాతం యాక్సిడెంట్లు వర్షం పడుతున్న సమయంలోనే జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వర్షం సమయంలో రోడ్డు స్వభావానికి తోడు డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


1. వర్షం తగ్గేంత వరకు ఆగాలి


వర్షం కురిసే సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. వాతావరణం మెరుగుపడేంత వరకు వెయిట్ చేయడం ఉత్తమం. లేదు, కచ్చితంగా వెళ్లాలి అనుకుంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.


2. మీ కారులోని ఎక్యుప్మెంట్స్ పని చేస్తున్నాయో? లేదో చూసుకోండి


వర్షంలో బయటకు వెళ్లాల్సి వస్తే, కారులోని ఎక్యుప్మెంట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో? లేదో? చూసుకోవాలి. కారు హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు, విండ్ షీల్డ్ వైపర్లను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. టైర్ల గ్రిప్ ఎలా ఉందో పరిశీలించాలి.  ఒకవేళ టైర్లు అరిగిపోయి ఉంటే బ్రేకులు పడక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వేర్ బార్ లు, ట్రెడ్ పూర్తిగా అరిగిపోతే వెంటనే మార్చుకోవాలి.  


3. నెమ్మదిగా డ్రైవ్ చేయాలి


వర్షంలో డ్రైవింగ్ చేసే సమయంలో వీలైనంత వరకు నెమ్మదిగా వెళ్లాలి. సాధారణ సమయంలో వెళ్లే వేగంతో పోల్చితే సగానికిపైగా తగ్గించి వెళ్లడం మంచిది. తడి వాతావరణంలో రోడ్డులోపల ఉన్న ఆయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్డు ఉపరితలం మరింత మృదువుగా మారుతుంది. బ్రేకులు సరిగా పడవు. అందుకే, వీలైనంత నెమ్మదిగా వెళితే వాహనం కంట్రోల్ అవుతుంది.


4. విండ్‌ షీల్డ్ వైపర్లను ఉపయోగించాలి


వర్షం పడుతున్న సమయంలో విండ్ షీల్డ్ వైపర్లను ఉపయోగించాలి. వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో ఆన్ చేసి అలాగే ఉంచడం మంచిది. లేదంటే, రోడ్డు ముందు భాగం కనిపించదు. వైపర్లు ఉపయోగించడం వల్ల సేఫ్ జర్నీ చేసే అవకాశం ఉంటుంది.  


5. హెడ్ లైట్లు ఆన్ చేయాలి


విండ్‌ షీల్డ్ వైపర్లు ఆన్‌లో ఉన్న సమయంలో హెడ్‌ లైట్లను కూడా ఆన్ లో ఉంచడం మంచింది. హెడ్ లైట్లు రోడ్డు సరిగా కనిపించేందుకు సాయపడుతాయి.   


6. ఇతర వాహనాలకు దూరంగా వెళ్లాలి


తడిగా ఉన్న సమయంలో బ్రేకింగ్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు మీ వాహనం ముందు వాహనాలకు దూరంగా వెళ్లడం మంచింది. ఎక్కువ గ్యాప్ ఉండటం వల్ల పెద్ద వాహనాల ద్వారా మీ విండ్ షీల్డ్ పైకి నీళ్లు తగలకుండా ఉంటుంది.  


7. సడెన్ బ్రేకులు వేయకండి


వర్షం పడుతున్న సమయంలో బ్రేకులు నెమ్మదిగా వేయాలి. మీ స్టాప్ వచ్చినప్పుడు కారు వేగాన్ని నెమ్మదిగా తగ్గించాలి. బ్రేకులు నెమ్మదిగా వేస్తూ, సైడుకు తీసుకోవాలి. అలా కాకుండా సడెన్ బ్రేకులు వేయడం వల్ల మీ వాహనం గ్రిప్ కోల్పోవడంతో పాటు వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టే అవకాశం ఉంటుంది.


8. నీటిలో నుంచి కారును తీసుకెళ్లకండి


నీరు నిలబడి ఉన్న ప్రాంతం నుంచి కారును తీసుకెళ్లకూడదు. టైర్లు రోడ్డుతో ట్రాక్షన్ కోల్పోయినప్పుడు హైడ్రోప్లానింగ్ జరుగుతుంది. కారు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయే అవకాశం ఉంది. అంతేకాదు అదుపు తప్పి పల్టీలు కొట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ నీరు నిల్చున్న చోట రోడ్డుపై గుంతలు ఉంటే మరింత ప్రమాదం జరుగుతుంది. వీలైనంత వరకు నీరు నిలవని వైపు నుంచి వెళ్లడం మంచిది.


9. హైడ్రోప్లానింగ్ తో జాగ్రత్త   


కారు ప్రమాదాలకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి హైడ్రోప్లానింగ్. నీటిలో నుంచి కారు వెళ్లే సమయంలో హైడ్రోప్లానింగ్ కారణంగా కారు నియంత్రణ కోల్పోతుంది. వెంటనే గ్యాస్ పెడల్ నుంచి కాలు తీసి మీరు వెళ్లాలి అనుకున్న వైపును కారును మళ్లించాలి. ఆకస్మిక మలుపులు, బ్రేకులు వేయకుండా చూసుకోవాలి.


10.కారును వెంటిలేట్ చేయండి


వర్షం కురిసే సమయంలో కారులో తేమ పెరుగుతుంది. విండోలు ఫాగ్ తో నిండిఉంటాయి.డీఫ్రాస్టర్‌ని ఉపయోగించడం వల్ల కొంత తేమను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.



Also Read: ‘గ్రాండే పాండా’ను రివీల్ చేసిన ఫియట్ - వావ్ అనిపిస్తున్న కొత్త కారు!