Royal Enfield Sales Report: రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 జూన్‌కు సంబంధించిన విక్రయాల లెక్కలను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. అయితే ఎగుమతుల్లో మాత్రం కంపెనీ పనితీరు ఆశాజనకంగా లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 77,109 యూనిట్ల విక్రయంతో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 రెండో త్రైమాసికంలో విక్రయించిన 1,87,205 యూనిట్ల నుంచి 2023 రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 22 శాతం పెరిగి 2,27,706 యూనిట్లకు చేరుకున్నాయి.
అమ్మకాలు అప్... ఎగుమతులు డౌన్...
2023 జూన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్ 34 శాతం పెరిగి 67,495 యూనిట్లకు చేరుకుంది. ఇది జూన్ 2023లో 50,265 యూనిట్ల కంటే తక్కువే. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, మీటియోర్ వంటి మోడల్‌లు ఉన్నాయి. ఇవి అత్యధికంగా అమ్ముడయ్యాయి.
అయినప్పటికీ 2023 మేలో దేశీయ మార్కెట్‌లలో విక్రయించిన 70,795 మోటార్‌సైకిళ్లతో పోలిస్తే నెలవారీ క్షీణతను రాయల్ ఎన్‌ఫీల్డ్ నమోదు చేసింది. అలాగే 2023 జూన్‌లో ఎగుమతులు కూడా 14 శాతం తగ్గి 9,614 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 జూన్‌లో 11,142 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు సంవత్సరంలో ఎగుమతి చేసిన 29,563 యూనిట్లతో పోలిస్తే, 2023-24 ఆర్థిక సంవత్సర కాలంలో వార్షిక ఎగుమతులు 31 శాతం తగ్గి 20,535 యూనిట్లకు చేరుకున్నాయి.
కొత్త మోడల్స్ ఎంట్రీ
రాబోయే కొన్నేళ్లలో అనేక కొత్త మోటార్‌సైకిళ్లను తన పోర్ట్‌ఫోలియోలోకి తీసుకురానున్నట్లు ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. కంపెనీ ప్లాన్ ప్రకారం 350 సీసీ సెగ్మెంట్లో రెండు, 450 సీసీ సెగ్మెంట్లో ఐదు, 650 సీసీ సెగ్మెంట్లో ఆరు బైకులు విడుదల కానున్నాయి. అంటే ఓవరాల్‌గా 13 బైకులన్న మాట. కంపెనీ ప్రతి సంవత్సరం నాలుగు కొత్త బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది.
నేపాల్‌లో కొత్త ప్లాంట్
ఇటీవల ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 టెస్టింగ్‌లో గుర్తించారు. విడుదల తర్వాత ఇది కేటీయం 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జీ310, రాబోయే హీరో ఎక్స్‌పల్స్ 440తో పోటీ పడనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నేపాల్‌లో కూడా తన వాహనాలను విక్రయించడం ప్రారంభించింది. భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో దాని పనితీరును మరింత మెరుగుపరిచేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఐదో అంతర్జాతీయ సీకేడీ అసెంబ్లీ యూనిట్‌ను దేశంలో ఏర్పాటు చేసింది.
త్రివేణి గ్రూప్‌తో కలిసి నిర్మించిన ఈ కొత్త ఫ్యాక్టరీ నేపాల్‌లోని బిర్‌గంజ్‌లో ఉంది. బ్రెజిల్, థాయిలాండ్, కొలంబియా, అర్జెంటీనా వంటి దేశాల నుండి ఇతర సౌకర్యాలు ఇందులో చేరాయి. ఈ కేంద్రం ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సంవత్సరానికి 20,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. క్లాసిక్ 350, స్క్రాంబ్లర్ 411 అసెంబ్లీ మొదట ఇక్కడ ప్రారంభమవుతుంది.
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!