Royal Enfield Motoverse 2025 Registrations Open : రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులంటే చాలా మందికి ఓ క్రేజ్. అ బైకులపై జర్నీలంటే మహా ఇష్టం. ఇలాంటి  వారి కోసం  రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటోవర్స్ జరుగుతూ ఉంటుంది. ఈ సారి కూడా  రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటోవర్స్ 2025 రెడీ అయింది. రిజిస్ట్రేషన్లను ఆ సంస్థ ప్రారంభించింది. 

రాయల్ ఎన్ ఫీల్డ్ మోటోవర్స్ అంటే ఓ పండుగ

రాయల్ ఎన్ ఫీల్డ్   సంస్థ  వార్షిక మోటార్‌సైకిల్, మ్యూజిక్  ఫెస్టివల్, నవంబర్ 21-23, 2025 తేదీలలో గోవాలోని వాగాటర్ హిల్‌టాప్‌లో జరగనుంది.  ఈ ఈవెంట్‌కు రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమయ్యాయి.  రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్ (www.royalenfield.com) ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.  రిజిస్ట్రేషన్ సమయంలో  పాల్గొనేవారికి ఒక యూనిక్ మోటోవర్స్ ID ఇస్తారు. వ్యక్తిగతంగా గ్రూపులుగా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.  మూడు వేల రూపాయల వరకూ రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు.  ఈ  ఫెస్టివల్‌లో  రాయల్ ఎన్‌ఫీల్డ్  కొత్త మోటార్‌సైకిల్‌లను ప్రదర్శనకు ఉంచుతారు.  వీటిలో హిమాలయన్ 750 ,  ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ బ్రాండ్‌లోని HIM-E ఎలక్ట్రిక్ టెస్ట్ బెడ్ కూడా ఉంటాయి. [  గత ఎడిషన్‌లో గోవన్ క్లాసిక్ 350 , స్క్రామ్ 440  మోడల్స్ ను ప్రదర్శించారు.  ఈ సంవత్సరం రెండు స్టేజ్‌లతో మెయిన్ స్టేజ్ ,  హిల్‌టాప్ స్టేజ్ మీద సంగీత కార్యక్రమాలు జరుగుతాయి.  మెయిన్ స్టేజ్‌లో హనుమాన్‌కైండ్, ది యెల్లో డైరీ, పర్వాజ్, యూఫోరియా, థైకుడం బ్రిడ్జ్,   కుట్లే ఖాన్ , కర్ష్ కాలే  బ్యాండ్ ప్రదర్శనలు ఉంటాయి. హిల్‌టాప్ స్టేజ్‌లో ఆది & దిశాన్, కావ్య త్రేహన్, డాట్ & ది సిలబుల్స్, రామన్ నేగి, సుదాన్,   అర్జున్ సి వంటి స్వతంత్ర కళాకారులు ప్రదర్శన ఇస్తారు.  ఒక అంతర్జాతీయ కళాకారుడు కూడా పాల్గొననున్నారు, అయితే వారి పేరు ఇంకా వెల్లడి కాలేదు.

 కొత్త క్లబ్ ఛాంపియన్‌షిప్‌తో డర్ట్ ట్రాక్ రేసింగ్ జరుగుతుంది, ఇందులో వర్క్‌షాప్‌లు, కలెక్టివ్‌లు,   రైడింగ్ కమ్యూనిటీలు పాల్గొంటాయి. ఫ్లాట్ ట్రాక్‌లో నైపుణ్యాలను నేర్చుకోవడానికి కొత్త కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు.  హిల్ క్లైంబ్, హంటర్ మేజ్ చేస్,   ట్రైల్ స్కూల్ వంటి ఈవెంట్‌లు రైడర్‌ల నైపుణ్యాలను పరీక్షించే కార్యక్రమం ఉంటుంది.  అలాగే ప్రపంచవ్యాప్తంగా కస్టమ్ బైక్ బిల్డర్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచుతారు.  

 ఈ ఫెస్టివల్‌కు 30,000 కంటే ఎక్కువ మంది తమ బైకులతో హాజరయ్యే అవకాశం ఉంది.   ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల నుంచి పాల్గొనేవారు ఉంటారని అంచనా.   ఈవెంట్‌లో పాల్గొనేవారు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.