Ola S1 Pro Scooter Burning Incident: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి మరో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఏడు నెలల పాటు సర్వీస్ సెంటర్‌ చుట్టూ తిరిగిన ఓ వ్యక్తి, ఇక తన కోపాన్ని పట్టలేక, తన ఓలా S1 ప్రో స్కూటరుకు నిప్పంటించాడు. 

నిజానికి, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు - వాటి యజమానుల మధ్య చాలా విచిత్రమైన సంబంధం ఉంది. వాళ్లు తమ స్కూటర్‌ను ఇష్టపడతారు లేదా ద్వేషిస్తారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఓలా కస్టమర్లు మొదటి రోజు నుంచే సమస్యలను ఎదుర్కోవడం & వారికి కావలసిన పరిష్కారం లభించకుపోవడం వంటి చాలా కేసులను మనం ఇప్పటికే చూశాం. ఈ సిరీస్‌లో ఇది మరొక ఇన్సిడెంట్‌. సర్వీస్ సెంటర్ తన వాహనాన్ని 7 నెలలకు పైగా పట్టించుకోకపోవడంతో నిరాశ చెందిన ఒక వ్యక్తి, తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు నిప్పంటించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ వీడియోను, Gulbarga Eagle Eye News తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో, ఓలా సర్వీస్ సెంటర్ నుంచి స్కూటర్‌ను లాక్కొచ్చిన ఒక వ్యక్తి,  బాటిల్‌లో తెచ్చిన పెట్రోలును స్కూటర్‌పై పోసి నిప్పంటించాడు. సర్వీస్ సెంటర్ సిబ్బంది అతన్ని ఆపడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అతను స్కూటర్‌కు నిప్పంటించాడు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.

సమస్య ఏంటి?కస్టమర్, దాదాపు ఒక సంవత్సరం క్రితం ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఐదు నెలల తర్వాతి నుంచి ఆ స్కూటర్‌ సమస్య పెట్టింది. స్కూటర్‌ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిందని తేలింది. ఓలా ఎలక్ట్రిక్‌, తన పాలసీలో, బ్యాటరీ డిశ్చార్జ్ పై వారంటీ లేదని స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతానికి, బ్యాటరీ డిశ్చార్జ్ కు కూడా కస్టమర్లకు వారంటీని అందిస్తున్న ఏకైక బ్రాండ్ అథర్. 

ఎదురు చూపుల్లో 7 నెలలుఓలా S1 ప్రో బ్యాటరీలో సమస్యను గుర్తించిన తర్వాత, స్కూటర్ యజమాని పరిష్కారం కోసం కంపెనీని సంప్రదించాడు. బ్యాటరీ భర్తీ కోసం రూ. 30,000 చెల్లించమని కంపెనీ చెప్పింది. అంగీకరించడం తప్ప ఆ కస్టమర్‌కు వేరే మార్గం కనపించలేదు. అతను అంగీకరించిన రోజు నుంచి కొత్త బ్యాటరీ ప్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూపుల్లోనే 7 నెలలు గడిపోయాయి. తన స్కూటర్‌ సర్వీస్ సెంటర్‌లో ఇరుక్కుపోయింది. ఈ 7 నెలలుగా అతను EMIలు కడుతూనే ఉన్నాడు. 

సర్వీస్ సెంటర్ మేనేజర్‌ను తాను క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నానని కస్టమర్ చెప్పాడు. ప్రతిసారీ అతనికి వినిపించే ఒకే మాట “రేపు రండి.”

7 నెలలు ఎదురు చూసి విసిగిపోయిన కస్టమర్‌, సహనం కోల్పోయి, తన స్కూటర్‌కు నిప్పంటించాడు. సర్వీస్ సరిగా లేకపోవడం వల్ల డజన్ల కొద్దీ ఓలా స్కూటర్లు సర్వీస్ సెంటర్ వెలుపల పడి ఉన్నాయని కూడా ఆ కస్టమర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చాలా ఓలా డీలర్‌షిప్‌లు, షోరూమ్ లోపల కంటే బయటే ఎక్కువ స్కూటర్లను పార్క్‌ చేయడం మనం చూసే ఉంటాం. అవన్నీ కొత్తవి కాదు, మరమ్మతుల కోసం వచ్చినవి కూడా వాటిలో కలిసి ఉంటాయి.

ఓలా సర్వీస్ సెంటర్‌, ప్రమాదవశాత్తు దెబ్బతిన్న వాహనాల నుంచి విడిభాగాలను తీసి ఇతర వాహనాల్లో ఉపయోగిస్తోందని కూడా ఆ కస్టమర్ ఆరోపించాడు. 

ఓలా డీలర్‌షిప్ సిబ్బంది, స్కూటర్‌ అమ్మకం వరకు మాత్రమే కస్టమర్‌ పట్ల దయతో ఉంటారు & అమ్మకం పూర్తయిన తర్వాత, బండిలో ఏదైనా సమస్య వస్తే కస్టమర్ పూర్తిగా డీలర్‌షిప్ సిబ్బంది దయపై ఆధారపడాల్సిందే అన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. దీనికి, తాజా సంఘటన మరొక ఉదాహరణ.