Telangana government issued notification for liquor shops:  ఒక్క సారి లిక్కర్ దుకాణం లాటరీలో తగిలితే లైఫ్ సెటిల్ అయిపోతుందని కొంత మంది అనుకుంటూ ఉంటారు. అందుకే అప్లికేషన్ ఫీజు కాస్త ఎక్కువైనా.. ఆ వ్యాపారంతో సంబంధం లేని వాళ్లు కూడా అప్లయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరో సారి  తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 

తెలంగాణ ప్రభుత్వం 2025-2027 కాలానికి మద్యం దుకాణాల (A4) లైసెన్సుల జారీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ లైసెన్సులు డిసెంబర్ 1, 2025 నుండి నవంబర్ 30, 2027 వరకు చెల్లుబాటులో ఉంటాయి.  డిసెంబర్ 1, 2025 నుండి నవంబర్ 30, 2027 వరకు  2 సంవత్సరాలు లైసెన్స్ కాలపరిమితి ఉంటుంది.  తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటికి  లైసెన్సులు జారీ చేస్తారు.  ఒక్కో అప్లికేషన్‌కు నాన్-రిఫండబుల్ ఫీజు  రూ. 3 లక్షలుగా ఖరారు చేశారు. గత లైసెన్స్ కాలంలో (2023-25) ఈ ఫీజు రూ. 2 లక్షలు మాత్రమే ఉండేది. ఈ ఏడాది  లక్ష రూపాయలు పెంచారు. 

జనాభా ఆధారంగా ఆరు స్లాబ్‌లలో లైసెన్స్ ఫీజు నిర్ణయించారు.  జనాభా 5,000 వరకు సంవత్సరానికి రూ. 50 లక్షలు లైసెన్స్ ఫీజు చెల్లించారు. 5,000 నుంచి 50,000 జనాభా ఉన్న చోట ఏటా రూ. 55 లక్షలు ఫీజు చెల్లించాలి. అలాగే  50,000 నుంచి 1 లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 60 లక్షలు   లక్ష నుంచి 5 లక్షలు జనాభా ఉన్న ప్రాంతాల్లో  రూ. 65 లక్షలు,  5 లక్షలు నుంచి 20 లక్షలు జనాభా ఉన్న నగరాల్లో  రూ. 85 లక్షలు 20 లక్షల పైబడి జనాభా ఉన్న నగరాల్లో  మద్యం దుకాణానికి  రూ. 1 కోటి 10 లక్షలు ఏడాదికి లైసెన్స్ ఫీజులుగా ఖరారు చేశారు.  ఈ ఫీజును ఏడాదికి ఆరు సమాన వాయిదాల్లో చెల్లించాలి.  అదనంగా, స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (SRET) రూ. 5 లక్షలు సంవత్సరానికి చెల్లించాలి. 

గత ఏడాది  మొత్తం దుకాణాల్లో 15 శాతం గౌడ్ సామాజిక వర్గానికి, 10 శాతం షెడ్యూల్డ్ కులాలకు (SC), 5 శాతం షెడ్యూల్డ్ తెగలకు (ST) రిజర్వ్ చేశారు.  ఈ సారి కూడా ఆ రిజర్వేషన్లు కొనసాగనున్నాయి. రిజర్వేషన్ దుకాణాలు జిల్లాలోని సంబంధిత సామాజిక వర్గ జనాభా ఆధారంగా కేటాయిస్తారు.   లైసెన్సులు లాటరీ విధానం (డ్రా ఆఫ్ లాట్స్) ద్వారా కేటాయిస్తారు. ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది.    ఎక్సైజ్ కమిషనర్ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.

A4 దుకాణాలను వాక్-ఇన్ స్టోర్స్‌గా మార్చుకునేందుకు అవకాశం ఉంది, దీనికి అదనంగా రూ. 5 లక్షలు  ఏడాదికి చెల్లించాల్సి ఉంటుంది. ఏ ప్రాంతంలోఅియనా  కొన్ని దుకాణాలు కేటాయించబడకపోతే, ఎక్సైజ్ శాఖ లేదా తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటిని నిర్వహిస్తుంది. లేకపోతే  రీ-నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. 

గతంలో (2023-25) 1.31 లక్షల అప్లికేషన్ల ద్వారా రూ.2,639 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి, ఫీజు పెంపు కారణంగా ఆదాయం మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా.[ - దరఖాస్తుదారులు వ్యక్తులు, పార్టనర్‌షిప్ ఫర్మ్‌లు, కంపెనీలు ,  ఒకే దుకాణానికి బహుళ అప్లికేషన్లు సమర్పించే అవకాశం ఉంది, ప్రతి అప్లికేషన్‌కు రూ. 3 లక్షల ఫీజు చెల్లించాలి.