Tips For Keeping A New Bike In Good Condition: ధూమపానం & మధ్యపానం ఆరోగ్యానికి హానికరం - అధిక వేగం కొత్త బండికి అపాయకరం. మీరు ఒక కొత్త బైక్ కొని, గంటకు 80–100 కి.మీ. స్పీడ్‌తో నడుపుతూ ఆ థ్రిల్‌ను ఎంజాయ్‌ చేస్తుంటే.. మీ జోరుకు వెంటనే బ్రేకులు వేయండి. లేదంటే ఇంజిన్‌ ఎందుకూ పనికిరాకుండా పోవచ్చు & పాత సామాను కింద దానిని అమ్మేయాల్సి రావచ్చు. 

కొత్త బైకును కొన్ని వేల కిలోమీటర్ల వరకు సరిగ్గా ట్రీట్ చేయడం చాలా ముఖ్యం. దీనిని వాహన పరిశ్రమలో "రన్నింగ్-ఇన్ పీరియడ్" (Running-in Period) అని పిలుస్తారు. ఈ నిర్దిష్ట కాలంలో జాగ్రత్తగా ఉంటేనే బండి ఆయుష్షు పెరుగుతుంది, బైకు కోసం మీరు ఖర్చు చేసిన డబ్బు నిలబడుతుంది.

రన్-ఇన్ పీరియడ్ ఎందుకు అవసరం?ఏదైనా కొత్త బైక్‌కి రన్నింగ్-ఇన్ పీరియడ్ చాలా కీలకం. ఆ సమయంలో ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ & ఇతర మెకానికల్ భాగాలు ఒకదానికొకటి రుద్దుకుంటూ సెట్‌ అవుతాయి. ఈ భాగాలు కొత్తవి కాబట్టి వాటి మధ్య సమన్వయం నెమ్మదిగా పెరుగుతుంది. రన్నింగ్-ఇన్ పీరియడ్‌లో మీరు కొత్త బైక్‌ను అధిక వేగంతో నడిపితే ఈ భాగాలు అరిగిపోవడం ప్రారంభం కావచ్చు. ఇది ఇంజిన్ పనితీరుపై చెడు ప్రభావం చూపుతుంది, ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది & బైక్ జీవితకాలం కూడా తగ్గుతుంది. అందువల్ల, ప్రారంభ కాలంలో బైక్‌ను నెమ్మదిగా, బ్యాలెన్స్‌డ్‌గా & జాగ్రత్తగా నడపడం ముఖ్యం.

మొదటి 2,000 కి.మీ. వరకు బైక్‌ను ఎలా నడపాలి?మొదటి 2,000 కి.మీ. సమయంలో బైక్‌ను నడపడానికి ఒక్కో కంపెనీ ఒక్కో విధానం రూపొందించింది, ఈ విషయం చాలా మందికి తెలీదు. ఉదాహరణకు, బజాజ్ పల్సర్ 150 విషయానికి వస్తే... గేర్ & వేగాన్ని బట్టి పరిమితులను నిర్ణయించింది. మొదటి 1,000 కి.మీ. సమయంలో... మొదటి గేర్‌లో గరిష్టంగా 10 కి.మీ/గం, రెండో గేర్‌లో 20, మూడో గేర్‌లో 30, నాలుగో గేర్‌లో 35 & ఐదో గేర్‌లో గరిష్టంగా 45 కి.మీ/గం వేగంతోనే వెళ్లాలని సిఫార్సు చేసింది. మిగిలిన 1,000 కి.మీ. విషయంలో ఈ వేగ పరిమితి... మొదటి గేర్‌లో 15 కి.మీ/గం, రెండో గేర్‌లో 30, మూడో గేర్‌లో 40, నాలుగో గేర్‌లో 45 & ఐదో గేర్‌లో గరిష్టంగా 55 కి.మీ/గం. వరకు పెంచింది. ఈ సమయంలో వెంటవెంటనే ఆక్సిలరేషన్‌ రైజ్‌ చేయడం  లేదా హఠాత్తుగా బ్రేక్‌లు వేయడం వంటివి కూడా చేయకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్‌పై అధిక ఒత్తిడి ఉండదు.

బైక్ స్టార్ట్ చేసిన వెంటనే ఈ పని చేయకూడదుచాలా మంది బైక్ స్టార్ట్ చేసిన వెంటనే ఫుల్‌ రైజ్‌ ఇచ్చి వేగంగా నడపడం ప్రారంభిస్తారు, ఇది ఇంజిన్‌కు అత్యంత హాని చేసే అలవాట్లలో ఒకటి. బైకును స్టార్ట్ చేసినప్పుడు, ఇంజిన్ ఆయిల్ అన్ని భాగాలకు పూర్తిగా చేరి లూబ్రికేషన్ అందించడానికి కొంత సమయం పడుతుంది. మీరు వెంటనే స్పీడ్‌ అందుకుంటే ఆయిల్ ప్రతి భాగానికి సరిగ్గా చేరదు, ఇంజిన్‌ భాగాలు అరిగిపోవడం ప్రారంభమవుతుంది. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇంజిన్ ఆయిల్ పూర్తిగా ప్రసరించేలా & అన్ని భాగాలకు సరైన లూబ్రికేషన్ లభించేలా కనీసం 1 నిమిషం పాటు దానిని స్టాండ్‌పైనే ఉంచాలి.

కొత్త బండి విషయంలో విస్మరించకూడని ఇతర జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం & మొదటి 500 నుంచి 1,000 కి.మీ. మధ్య మొదటి సర్వీస్ ఆయిల్‌ను మార్చడం వంటివి చేయాలి. ప్రారంభంలోనే బైక్‌ మీద భారీ లోడ్ వేయకూడదు. సర్వీస్ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, మొదటి మూడు ఉచిత సర్వీసులను సకాలంలో పూర్తి చేయాలి. చైన్ టెన్షన్, టైర్ ప్రెజర్ & బ్రేకింగ్ సిస్టమ్‌ను తరచుగా చెక్‌ చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ భద్రత & బండి పనితీరు బాగుంటుంది.