Nissan Magnite SUV: సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ భారత మార్కెట్లో వృద్ధి చెందుతూనే ఉంది. ఈ విభాగంలో టాటా నెక్సాన్, కియా సోనెట్‌లకు ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌లు అందించారు. స్కోడా కూడా ఈ విభాగంలో చేరడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో నిస్సాన్ తన మాగ్నైట్‌కి అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేట్ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో లాంచ్ అవుతుంది.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేట్‌లు
కొత్త అల్లాయ్ వీల్స్‌తో కారు కనిపించినప్పటికీ దీని టెస్టింగ్ మోడల్‌ను పూర్తిగా కవర్ చేశారు. ప్రధాన డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. బంపర్‌కి ఫ్రెష్ లుక్ వచ్చేలా మార్పులు చేయవచ్చు. నిస్సాన్ ఈ ఎస్‌యూవీలో రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లను కూడా చేర్చవచ్చు.
మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో అనేక కొత్త ఫీచర్లు అందిస్తారని అంచనా. ఇది ఆటో డిమ్మింగ్ ఐవీఆర్ఎం, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫీచర్‌లను కలిగి ఉండవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ 72 హెచ్‌పీ, టర్బో పెట్రోల్ 100 హెచ్‌పీ ఇంజన్ ఆప్షన్లను నిలుపుకోవాలని భావిస్తున్నారు.
ఎప్పుడు లాంచ్?
మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సంబంధించి నిస్సాన్ ఇంకా ఎటువంటి వార్తలను ధృవీకరించలేదు. అయినప్పటికీ ఎస్‌యూవీ డెవలప్‌మెంట్ చివరి దశలో ఉందని ప్రోటోటైప్ చూపిస్తుంది. మాగ్నైట్ ఈ డిసెంబర్‌తో భారతదేశంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఇప్పుడు ఇది మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను పొందబోతోంది.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత ఉండవచ్చు?
రూ.6 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో అత్యంత సరసమైన ఎస్‌యూవీల్లో ఒకటిగా ఉంది. అందుబాటు ధర అనేది మాగ్నైట్‌కి కీలకమైన అంశం. ఇది ఫేస్‌లిఫ్ట్‌తో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇది మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్‌లతో పోటీపడుతుంది.