New PUC Certificate Norms 2026: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద గుడ్‌న్యూస్ చెప్పింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (Pollution Under Control - PUC) సర్టిఫికెట్ గడువుపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా, BS-VI వాహనాల వయసు, వాహనం రకాన్ని బట్టి సర్టిఫికెట్ రెన్యువల్ గడువును నిర్ణయించింది. దీంతో కొత్త BS6 ప్రైవేట్ వాహనాలకు ఇకపై ప్రతి మూడు నెలలకో, ఆరు నెలలకో లేదా ఏడాదికో PUC సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మూడేళ్లకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.
కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2026 నవంబర్ 13న సెంట్రల్ మోటార్ వెహికల్స్ (16వ సవరణ) రూల్స్, 2026ను నోటిఫై చేసింది. ఈ నిబంధనలతో 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌లో మార్పులు చేశారు. అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
BS6 ప్రైవేట్ వాహనాలకు కొత్త గడువు
- కొత్త నిబంధనల ప్రకారం, మొదటి రిజిస్ట్రేషన్ తేదీ నుంచి ఆరేళ్లలోపు వయస్సున్న BS-VI నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు PUC సర్టిఫికెట్ మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.- వాహనం వయసు ఆరేళ్లు దాటి - పదేళ్లలోపు ఉంటే ఏడాదికి ఒకసారి సర్టిఫికెట్ రెన్యువల్ చేయించుకోవాలి. - పదేళ్లు దాటిన BS6 ప్రైవేట్ వాహనాలకు ప్రతి ఆరు నెలలకోసారి కొత్త PUC సర్టిఫికెట్ తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: River Indieకి కొత్త వెర్షన్ రాబోతోందా? RX02, RX03 స్కూటర్ల ఫోటోలు లీక్.. డిజైన్‌లో మార్పులివే!
BS6 కమర్షియల్ వాహనాలకు వేరే గడువు
రవాణా అవసరాల కోసం ఉపయోగించే BS6 వాహనాలకు కేంద్రం ప్రత్యేక గడువులను నిర్ణయించింది.
- ఆరేళ్లలోపు వయసున్న BS6 ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు PUC సర్టిఫికెట్ రెండేళ్లపాటు చెల్లుతుంది.- ఆరేళ్లు దాటి పదేళ్లలోపు ఉన్న వాహనాలకు ప్రతి ఏడాది రెన్యువల్ తప్పనిసరి.- పదేళ్లు దాటిన BS6 ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ప్రతి ఆరు నెలలకోసారి కొత్త సర్టిఫికెట్ తీసుకోవాలి.
BS1, BS2, BS3, BS4 వాహనాలకు పాత గడువులే
BS6 వాహనాలకే కాకుండా, ఇతర ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాల PUC గడువులనూ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
BS-I, BS-II, BS-III ప్రమాణాలు కలిగిన అన్ని మోటార్ వాహనాలకు PUC సర్టిఫికెట్ మూడు నెలలపాటు చెల్లుబాటు అవుతుంది. BS-IV వాహనాలకు ఈ గడువు ఆరు నెలలు.
ఇది కూడా చదవండి: పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
PUC సర్టిఫికెట్ రెన్యువల్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది?
సర్టిఫికెట్ గడువు ముగిసే తేదీకి ముందు 10 రోజుల్లోపు రెన్యువల్ కోసం దరఖాస్తు చేస్తే, పాత సర్టిఫికెట్ ముగిసిన తేదీ నుంచే కొత్త సర్టిఫికెట్ అమల్లోకి వస్తుంది. పాత సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ కోసం దరఖాస్తు చేస్తే, ఆ దరఖాస్తు చేసిన తేదీ నుంచే చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసిన తర్వాత - దరఖాస్తు చేసిన తేదీకి మధ్యకాలంలో, మీరు చెల్లుబాటు అయ్యే PUC లేకుండా డ్రైవ్ చేస్తున్నట్లు లెక్కలోకి వస్తుంది. అందువల్ల గడువు ముగిసేలోపు రెన్యువల్ చేసుకోవడం మంచిది.
ఇప్పటికే PUC సర్టిఫికెట్ ఉన్నవారి పరిస్థితి ఏంటి?
ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే జారీ చేసిన PUC సర్టిఫికెట్ల గడువు మారదు. ప్రస్తుతం ఉన్న సర్టిఫికెట్లు వాటిపై పేర్కొన్న గడువు ప్రకారమే కొనసాగుతాయి. ఇక నుంచి రెన్యువల్ చేయించుకునే వాహనాలకు కొత్త నిబంధనల ప్రకారం గడువు తేదీ వర్తిస్తుంది.
ప్రతి వాహనానికీ PUC తప్పనిసరి
ప్రతి మోటార్ వాహనానికి చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికెట్ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఏజెన్సీ నుంచే సర్టిఫికెట్ తీసుకోవాలి లేదా రెన్యువల్ చేయించుకోవాలి. అధికారులు అడిగినప్పుడు దానిని చూపించాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
