New Maruti Dzire Launched: మారుతి డిజైర్ నాలుగో తరం మోడల్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. కొత్త డిజైర్ (New Maruti Dzire Price) రూ.6.79 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కారు నాలుగు వేరియంట్లతో మార్కెట్లోకి వచ్చింది. దీని టాప్ ఎండ్ ఏఎంటీ వేరియంట్ ధర రూ. 10.14 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూం ధరలే. కొత్త డిజైర్‌లో పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. కొత్త డిజైర్ సీఎన్‌జీ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 8.74 లక్షలుగా నిర్ణయించారు. సీఎన్‌జీ వేరియంట్‌లో ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది.


కొత్త మారుతి డిజైర్ లాంచ్
మారుతి సుజుకి కొత్త డిజైర్ నాలుగు వేరియంట్లను కలిగి ఉంది. ఇందులో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్‌లు ఉన్నాయి. ఈ కారు పొడవు గురించి చెప్పాలంటే మారుతి ఈ కారును నాలుగు మీటర్ల రేంజ్‌లో లాంచ్ చేసింది. కొత్త డిజైర్ పొడవు 3995 మిల్లీమీటర్లు కాగా వెడల్పు 2450 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ కారు 163 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కలిగి ఉంది. దీంతో పాటు ఈ కారు 382 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది.



Also Read: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?


కొత్త మారుతి డిజైర్ పవర్
మారుతి డిజైర్ కొత్త మోడల్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు అయింది. ఈ కారులో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. దీంతో పాటు ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. కొత్త మారుతి డిజైర్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.79 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 25.71 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.


కొత్త డిజైర్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లు
మారుతి డిజైర్ కొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు ముందు, వెనుక... రెండు భాగాల్లో ఎల్ఈడీ లైట్లు అందించారు. ఈ కారులో 15 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మారుతి లాంచ్ చేసిన ఈ కొత్త కారులో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా, సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీ రేటింగ్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ రేటింగ్‌ను పొందిన మొదటి మారుతి కారు ఇదే. గతంలో కొన్ని మారుతి కార్లు ఫోర్ స్టార్ రేటింగ్ వరకు వెళ్లాయి. కానీ ఫైవ్ స్టార్ మాత్రం పొందలేదు.


డిసెంబర్ 4వ తేదీన విడుదల కానున్న కొత్త తరం హోండా అమేజ్‌కి ఈ కొత్త మారుతి డిజైర్ గట్టి పోటీనిస్తుంది. దీంతో పాటు ఈ కారు టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరాకు కూడా ప్రత్యర్థిగా మారింది. మారుతి డిజైర్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్లలో ఒకటి. ఇప్పుడు ఈ కారు మెరుగైన మైలేజీ, ఎక్సలెంట్ సెక్యూరిటీ ఫీచర్లతో భారతదేశానికి వచ్చింది.



Also Read: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!