Best Electric Car in India: ఎంజీ మోటార్స్ తన విండ్సర్ ఈవీ (MG Windsor EV) ధరలను ప్రకటించింది. ఇది టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Tata Punch EV) రేంజ్‌లో వస్తుంది. బీవైడీ అట్టో 3 (BYD Atto 3)... ఎంజీ విండ్సర్ కంటే కొంచెం ఖరీదైనది. కానీ కొనుగోలుదారులకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ మూడు కార్లను పోల్చి చూద్దాం.


సైజు, స్పేస్
సైజు పరంగా చూసుకుంటే ఎంజీ విండ్సర్ వీటిలో అతిపెద్ద కారు. ఇది 4295 మిల్లీమీటర్ల పొడవు, 2700 మిల్లీమీటర్ల వీల్‌బేస్ కలిగి ఉంది. అయితే నెక్సాన్ ఈవీ పొడవు 3994 మిల్లీమీటర్లు కాగా, 2498 మిల్లీమీటర్ల వీల్‌బేస్ కలిగి ఉంది. ఇక బీవైడీ అట్టో 3 పొడవు 4455 మిల్లీమీటర్లు కాగా, 2720 మిల్లీమీటర్ల వీల్‌బేస్ కలిగిన పొడవైన కారు ఇది. విండ్సర్ బూట్ స్పేస్ 604 లీటర్లుగా ఉంది. ఇది నెక్సాన్ ఈవీ బూట్ స్పేస్ 350 లీటర్లు కాగా, బీవైడీ అట్టో 3 బూట్ స్పేస్ 440 లీటర్లుగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా విండ్సర్ 184 మిల్లీమీటర్లతో ముందుంది. Nexon EV (190 మిల్లీమీటర్లు), బీవైడీ అట్టో 3 (175 మిల్లీమీటర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


ఫీచర్లు, సెక్యూరిటీ ఇలా...
ఫీచర్ల గురించి చెప్పాలంటే ఎంజీ విండ్సర్‌లో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, ఫిక్స్‌డ్ పనోరమిక్ సన్‌రూఫ్, కూల్డ్ సీట్లు, పవర్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీ కెమెరా వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీలో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. బీవైడీ అట్టో 3లో 12.8-అంగుళాల తిరిగే టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను చూడవచ్చు. సెక్యూరిటీ విషయానికి వస్తే టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. బీవైడీ అట్టో 3లో మాత్రం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు చూడవచ్చు.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


రేంజ్ పరంగా ఏది బెస్ట్?
రేంజ్ పరంగా చూసుకుంటే టాటా నెక్సాన్ ఈవీ ఎల్ఆర్ మోడల్ 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 465 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. BYD Atto 3 మాత్రం 49.92 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 468 కిలోమీటర్ల రేంజ్‌ని డెలివర్ చేయగలదు. మరోవైపు ఎంజీ విండ్సర్ ఈవీ 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 332 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఎంజీ విండ్సర్ 136 పీఎస్, 200 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయగలదు. టాటా నెక్సాన్ 145 హెచ్‌పీ, 215 ఎన్ఎం టార్క్‌ను, బీవైడీ అట్టో 3... 204 హెచ్‌పీ, 310 ఎన్ఎం టార్క్‌ను కలిగి ఉంది.


ధర విషయంలో ఏది ముందంజలో ఉంది?
ఈ మూడు కార్లలో బీవైడీ అట్టో 3 అత్యంత ఖరీదైనది. దీని ధర ఎక్స్ షోరూం  ధర రూ. 24.99 లక్షలుగా నిర్ణయించారు. టాటా నెక్సాన్ ఈవీ ఎల్ఆర్ ఎక్స్ షోరూం ధర రూ. 19.9 లక్షలు. కానీ తగ్గింపుల కారణంగా ఇది మరింత చవకగా మారుతుంది. ఇక ఎంజీ విండ్సర్ ఎక్స్ షోరూం ధర రూ. 13.4 లక్షల నుంచి రూ. 15.4 లక్షల మధ్య ఉంది.


ఓవరాల్‌గా ఏది బెస్ట్?
మీకు స్పేస్, ఫీచర్లు కావాలనుకుంటే ఎంజీ విండ్సర్ మంచి ఆప్షన్. అలా కాకుండా పవర్, రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే టాటా నెక్సాన్ ఈవీ, బీవైడీ అట్టో 3 బెటర్ అని చెప్పవచ్చు. మీ అవసరాన్ని బట్టి వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే