Price List of MG Cars in 2024: ప్రముఖ కార్ల సంస్థ ఎంజీ మోటార్స్ 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. కంపెనీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీ మోటార్ ఇండియా తన 2024 మోడల్ లైనప్ కోసం కొత్త ధరల జాబితాను ప్రకటించింది. 2-డోర్ ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీ ధరను ఏకంగా రూ. 1 లక్ష తగ్గించడం విశేషం. దీని మునుపటి ధర రూ. 7.98 లక్షలు కాగా, ఇప్పుడు రూ. 6.99 లక్షలకు అందుబాటులో ఉంది. ఎంజీ హెక్టర్ ధర రూ.14.94 లక్షలుగానూ, ఎంజీ ఆస్టర్ ధర రూ.9.98 లక్షలుగానూ, ఎంజీ గ్లోస్టర్ ధర రూ.37.49 లక్షలుగానూ ఉన్నాయి.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ కొత్త వేరియంట్
ఎంజీ మోటార్ ఇండియా ఎంజీ జెడ్ఎస్ ఈవీ మోడల్ లైనప్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రిమ్‌ను పరిచయం చేసింది. దీని ధర రూ. 18.98 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఎంజీ మోటార్ ఇండియా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ విస్తరణ జరిగింది. జెడ్ఎస్ ఈవీ 50.3 కేడబ్ల్యూహెచ్ ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీతో ఆధారితమైనది. సింగిల్ ఛార్జ్‌పై 461 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగలదు. ఎంజీ కామెట్ ఈవీ 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ తెలుపుతోంది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 230 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్న మాట.
ఎంజీ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు ఎంజీ షీల్డ్ 360 నుంచి అదనపు ప్రయోజనాలు పొందుతాయి. ఇది ఐదేళ్ల వారంటీ, ఐదేళ్ల హజిల్ ఫ్రీ సర్వీసు, ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మరిన్ని లాభాలను కలిగి ఉన్న విస్తృత శ్రేణి ప్యాకేజీని అందిస్తుంది. ఎంజీ మోటార్ ఇండియా దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
భారతదేశం కోసం ఎంజీ మోటార్ సుమారు రూ. 5,000 కోట్ల పెట్టుబడితో కూడిన ఐదు సంవత్సరాల రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. ఇందులో ఐదు కొత్త ఉత్పత్తులను ప్రారంభించడంతో పాటు రెండో తయారీ ప్లాంట్, బ్యాటరీ అసెంబ్లీని ఏర్పాటు చేయడం కూడా ఉంది.
2028 నాటికి భారతదేశంలో తన మొత్తం అమ్మకాలలో 65 నుంచి 75 శాతం వరకు ఈవీలను కలిగి ఉండాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. ఎంజీ త్వరలో లాంచ్ చేయనున్న కార్లలో కూడా చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలే. గుజరాత్‌లో కొత్త తయారీ ప్లాంట్ ద్వారా ఉత్పత్తిని 120,000 యూనిట్ల నుంచి 300,000 యూనిట్లకు పెంచనుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, ఈవీ సెల్ తయారీతో సహా అధునాతన క్లీన్ టెక్నాలజీలలో పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.
మరోవైపు భారతదేశంలోని రెండు టాప్ కార్ల తయారీ కంపెనీలు, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024లో దేశంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయబోతున్నాయి. మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, నెక్స్ట్ జనరేషన్ డిజైర్‌లను 2024లో మొదటిగా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ కూడా రాబోయే కాలంలో మార్కెట్లోకి రానుంది. ఈ కారు ఇటీవలే టెస్టింగ్ సమయంలో కనిపించింది.